
అత్తింటి రేషన్‌కార్డులో అల్లుడి కుటుంబం
దండేపల్లి: రేషన్‌కార్డుల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తుండగా తప్పులు దొర్లిన కార్డులతో విని యోగదారులు ఆందోళన చెందుతున్నారు. కుటుంబ సభ్యులు, పిల్లల పేర్లు నమోదులో జరిగిన పొరపాట్లతో దరఖాస్తుదారులు కంగుతింటున్నారు. రేషన్‌కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల నమోదుకు గతంలో పౌరసరఫరాల శాఖ అవకాశం కల్పించింది. కొన్నేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల అర్జీలు స్వీకరించడంతో మీ సేవ, ప్రజాపాలన, గ్రామసభలు, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. వీటి సంఖ్య జిల్లా వ్యాప్తంగా వేలలోనే ఉంటుంది. దరఖాస్తులను పరిశీలించిన అధికారులు ఆయా కుటుంబాల్లో కలిపే ప్రక్రియతోపాటు కొత్త రేషన్‌కార్డుల జారీకి కసరత్తు చేస్తున్నారు. రేషన్‌కార్డులో లేని కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయించిన వారు కొంద రు తమ ఆధార్, ఎఫ్‌ఏసీ నంబర్లతో ఆన్‌లైన్‌లో చూస్తే అల్లుడి పేరు అత్తింటి రేషన్ కార్డుల్లో, పిల్ల ల పేర్లు, అమ్మమ్మ, నానమ్మల రేషన్‌కార్డుల్లో కని పించడంతో అవాక్కవుతున్నారు.
● దండేపల్లి మండలం నర్సాపూర్ గ్రామానికి గాజుల నగేష్‌కు ఐదేళ్ల క్రితం పెళ్లయ్యింది. తన తల్లిదండ్రుల రేషన్‌కార్డులో నుంచి తన పేరు డిలిట్ చేయించాడు. కొత్త రేషన్‌కార్డు కోసం ప్రజాపాలన గ్రామసభలో దరఖాస్తు చేసుకున్నాడు. అతడి పేరుతోపాటు ఇద్దరు పిల్లలు మహన్విత్, శ్రీనిత్ పేర్లు అత్తగారి రేషన్ కార్డు(నిర్మల్ జిల్లా కడెం మండలం దిల్‌దార్‌నగర్)లో నమోదయ్యాయి.
● దండేపల్లి మండలం ఎల్లయ్యపల్లెకు చెందిన సల్లూరి సురేష్–సంధ్య రేషన్‌కార్డు కలిగి ఉన్నారు. ప్రస్తుతం తమ కార్డులో కూతురు సుధీష పేరు నమోదుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా నానమ్మ లక్ష్మి రేషన్‌కార్డులో నమోదైంది.
● మంచిర్యాలకు చెందిన గొల్లపెల్లి సంగీత–పున్నం దంపతుల కూతురు అనన్య పేరు దండేపల్లిలో ఉండే అమ్మమ్మ సల్లూరి అమ్మాయి రేషన్ కార్డులో చేరింది.
● దండేపల్లికి చెందిన వేమునూరి శ్రీనివాస్ తన ఇద్దరు పిల్లల పేర్లు రేషన్‌కార్డులో లేకపోవడంతో మీ సేవ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయించాడు. కూతురు పేరు మాత్రమే రేషన్ కార్డులో కనిపిస్తుంది. కొడుకు పేరు రాలేదు. ఇలా జిల్లా వ్యాప్తంగా చాలామంది బాధితులు ఉన్నారు.
సాంకేతిక సమస్యలు కారణం..
రేషన్‌కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల నమోదులో తప్పులు దొర్లడం, కొందరి పేర్లు రాకపోవడం అంతా టెక్నికల్ ఇష్యూ కారణంతోనే అయి ఉండవచ్చు. తప్పులు దొర్లినట్లు కొందరు నా దృష్టికి తీసుకు వచ్చారు. తప్పుల సవరణకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే సరి చేయవచ్చు.
– సంధ్యారాణి, తహసీల్దార్, దండేపల్లి