
పక్కా ప్రణాళికతో లక్ష్యసాధన
శ్రీరాంపూర్/భీమారం: పక్కా ప్రణాళికలతో ఉత్పత్తి లక్ష్యాలు సాధించవచ్చని సింగరేణి డైరెక్టర్(పీపీ) వెంకటేశ్వర్లు తెలిపారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ ఓసీపీ, ఇందారం ఓసీపీని ఆదివారం సందర్శించారు. క్వారీలోని వ్యూపాయింట్ నుంచి పని ప్రదేశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇందారం ఓసీపీని సంప్ ఏరియాలో బొగ్గు నిల్వలను ఉత్పత్తికి భంగం కలుగకుండా వీలైనంత త్వరగా ఉత్పత్తి చేసి రవాణా చేయాలని ఆదేశించారు. ఈమేరకు ఇప్పటినుంచే ప్రణాళికలకు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. అంతకు ముందు జీఎం కార్యాలయంలో ఏరియా అధికారులతో బొగ్గు ఉత్పత్తి, రవాణా, రక్షణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఓసీపీలో మాట్లాడుతూ ఓసీపీలో ఓబీ సంస్థలు తమకు నిర్దేశించిన మట్టి వెలికితీత పనులు చేయాలన్నారు. నెలవారీగా లక్ష్యాలను సాధిస్తేనే వార్షిక లక్ష్యాలను చేరకుంటామన్నారు. సీఆర్‌ఆర్, జీవీఆర్, వారాహి సంస్థలు తమ పని సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నారు. దీనికి కావాల్సిన యంత్రాలను సమకూర్చుకోవాలన్నారు. 2025–26లో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధన కోసం గని అధికారులు కృషి చేయాలన్నారు. ప్రతి ఉద్యోగి కంపెనీ లక్ష్యాల సాధన కోసం పాటుపడాలన్నారు. రక్షణ పాటిస్తూ బొగ్గు ఉత్పత్తి చేయాలన్నారు. ఉత్పత్తి అయిన బొగ్గును సకాలంలో రవాణా చేయాలన్నారు. కార్యక్రమాల్లో ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శ్రీనివాస్, ఇంజినీర్ చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీరాంపూర్ ఓసీపీ ప్రా జెక్టు అధికారి నాగరాజు, ఎస్సార్పీ ఓసీపీ పీవోటీ శ్రీనివాస్, సర్వే అధికారి సంపత్, ఇందారం ఓసీపీ మేనేజర్ రవికుమార్, రక్షణ అధికారి సతీశ్, వారా హి కంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.