మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రతిసారీ ఇద్దరు మాత్రమే పోటీ పడే ఎన్నికలలో ఈసారి ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతుండటంతో మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రోజుకో ట్విస్ట్ బయటకు వస్తూ.. సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ‘మా’ కార్యవర్గం పదవీ కాలం చెల్లింది కనుక వెంటనే ఎన్నికలు నిర్వహించాలంటూ ఎగ్జిక్యూటివ్ కమిటీలోని 15 మంది సభ్యులు, మా క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు అయిన కృష్ణం రాజుకు లేఖలు రాశారు.
2019 లో ఎన్నిక అయిన 15 మంది సభ్యులు తమ పదవి కాలం ముగిసి పోయింది కనుక వెంటనే ఎన్నికల నిర్వహణ బాధ్యత తీసుకుని నిర్వహించాలని కృష్ణంరాజును కోరారు. గతంలో రాసిన లేఖకు ఇప్పటి వరకు జవాబు లేకపోవడంతో మరోసారి లేఖ రాశామని ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు తెలిపారు. గురువారం మా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు వర్చువల్‌గా సమావేశమై ఎన్నికల నిర్వహణపై చర్చించనున్నారు. సెప్టెంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం ‘మా’ అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితారాజశేఖర్, హేమతో పాటు సీవీఎల్ నర్సింహరావు కూడా ఉన్నారు. అయితే వీరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశాలున్నాయి. జీవిత, హేమ, నర్సింహరావు పోటీ నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఏకగ్రీవం అంశం కూడా తెరపైకి వచ్చింది. రేపు జరగబోయే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment