-అనిల్ కపూర్
ఐశ్వర్యా రాయ్, అక్షయ్ ఖన్నా, అనిల్ కపూర్ లీడ్ రోల్స్‌లో నటించిన హిందీ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా ‘తాల్’ (1999). సుభాష్ ఘాయ్ దర్శకత్వం వహించి, నిర్మించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ కావడంతో పాటు అవార్డులు, రివార్డులను సాధించింది. ఈ చిత్రం విడుదలై పాతికేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అనిల్ కపూర్.
‘‘తాల్’ గురించి ప్రేక్షకులు ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నారు. విక్రాంత్ కపూర్ (‘తాల్’లో అనిల్ కపూర్ పాత్ర) రోల్ నా కెరీర్‌లో ఓ మర్చిపోలేని జ్ఞాపకం. ఈ పాత్రను నాకు ఇచ్చిన సుభాష్‌ను గుర్తుపెట్టుకుంటాను. ‘రమ్తా జోగి..’ నా ఫేవరెట్ సాంగ్. అయితే ఈ పాట నా ఫెవరెట్‌గా మారడం వెనక పెద్ద కథ ఉంది. నిజానికి ఈ పాటకు ఫరా ఖాన్ కొరియోగ్రఫీ చేయాలి. కానీ చివరి నిమిషంలో ఆమె తప్పుకున్నారు. దీంతో ఈ పాటను రేపు చిత్రీకరిస్తామనగా, ముందు రోజు రాత్రి ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ వచ్చారు.
నేను ఎటువంటి రిహార్సల్స్ లేకుండానే ఈ పాటను పూర్తి చేశాను. అదీ... ఐశ్వర్యా రాయ్ వంటి అద్భుతమైన డ్యాన్సర్ సరసన డ్యాన్స్ చేశాను. చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఇంకో విశేషం ఏంటంటే...ఫిల్మ్‌ఫేర్, జీ, ఐఎఫ్‌ఎఫ్‌ఏ, స్క్రీన్ అవార్డ్స్... ఇలాంటి అవార్డ్స్ ఫంక్షన్స్‌లో ఉత్తమ సహాయనటుడి విభాగం (‘తాల్’లో నటనకు గాను...)లో నాకు మేజర్ అవార్డులు వచ్చాయి. ఇలా అన్ని రకాలుగా ‘తాల్’ మర్చిపోలేని అనుభూతిని మిగిల్చింది’’ అంటూ ఇన్‌స్టా వేదికగా పేర్కొన్నారు అనిల్ కపూర్. 12 పాటలు ఉన్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment