
హీరో రవితేజ సినిమాకి రెండోసారి మాట ఇచ్చారు హీరో వెంకటేశ్. రవితేజ నటించిన ‘క్రాక్’ (2021)కి వాయిస్ ఓవర్ ఇచ్చిన వెంకటేశ్.. తాజాగా ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రానికి ఇచ్చారు. వంశీ దర్శకత్వంలో రవితేజ టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ఇది. ‘‘అది 70వ దశకం. బంగాళాఖాతం తీరప్రాంతంలోని ఒక చిన్న గ్రామం. దడదడ మంటూ వెళ్లే రైలు ఆప్రాంతం పొలిమేర రాగానే గజగజ వణుకుతుంది. ఆ ఊరు మైలురాయి కనబడితే జనం అడుగులు తడబడతాయి.
దక్షిణ భారతదేశపు నేర రాజధాని.. ‘స్టూవర్టుపురం’. ఆప్రాంతానికి ఇంకో పేరు కూడా ఉంది.. ‘టైగర్ జోన్’. ద జోన్ ఆఫ్ టైగర్ నాగేశ్వరరావు..’ అంటూ టైగర్ నాగేశ్వరరావు చరిత్రని తన వాయిస్‌తో వెంకటేశ్ పరిచయం చేసిన తీరు సినిమాపై ఆసక్తి పెంచుతోంది. ఈ సినిమా కాన్సెప్ట్ వీడియోకు హిందీలో జాన్ అబ్రహాం, కన్నడలో శివ రాజ్‌కుమార్, తమిళంలో కార్తీ, మలయాళంలో దుల్కర్ సల్మాన్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. 1970ల నేపథ్యంలో స్టూవర్టుపురంలోని గజదొంగగా ముద్రపడిన నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా అక్టోబర్ 20న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.