
‘‘ఆరేళ్ల క్రితం ఇదే లొకేషన్‌లో ఒక్క సీన్‌కి పదకొండు టేక్స్ తీసుకున్నాను. నా తొలి సినిమా తాలూకు ఈ జ్ఞాపకం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రిషికేష్‌లో నా మొదటి సినిమా చిత్రీకరించిన ఇంట్లో ఆరేళ్ల తర్వాత షూటింగ్ చేయడం ఓ మంచి అనుభూతినిస్తోంది’’ అన్నారు భూమీ ఫెడ్నేకర్. ‘దమ్ లగా కే హైసా’ (2015) చిత్రం ద్వారా భూమి హిందీ తెరకు పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే తనలో మంచి నటి ఉందని నిరూపించుకున్నారామె. 2015 ఫిబ్రవరి 27న ఈ సినిమా విడుదలైంది. ఇప్పుడు అదే తేదీకి ‘దుమ్ లగా ..’ షూటింగ్ చేసిన రిషికేష్‌లో తన తాజా చిత్రం ‘బదాయీ దో’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా భూమి మాట్లాడుతూ – ‘‘యశ్ రాజ్ ఫిలింస్‌లో మొదటి అవకాశం అంటే చిన్న విషయం కాదు. కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకునే అవసరంలేని మంచి సినిమా ద్వారా నన్ను ఈ సంస్థ పరిచయం చేసింది. యశ్ రాజ్‌కి ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే ఆ సినిమాలో నటించిన నా తొలి హీరో ఆయుష్మాన్ ఖురానా, దర్శకుడు శరత్ కటారియాకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నటిగా మంచి పాత్రలు చేయాలనే తపనతో వచ్చిన నాకు అవకాశం ఇవ్వడంతో పాటు, నటిగా నేను డిఫరెంట్ అని ఈ ప్రపంచానికి చెప్పే అవకాశం ఇచ్చిన ‘దమ్ లగా...’కి నా మనసులో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది’’ అన్నారు. ‘టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్‌కథ, శుభ్ మంగళ్ సావధాన్, సాండ్ కీ ఆంఖ్, బాలా’ వంటి చిత్రాల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేసి, నటిగా దూసుకెళుతున్నారు భూమీ ఫెడ్నేకర్.
చదవండి: ఎవర్నీ తక్కువ చేసి చూపించలేదు