దళపతిగా కోలీవుడ్‌లో చెరగని ముద్ర వేసిన విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 'తమిళగ వెట్రి కళగం' (TVK) పేరుతో ఈ ఏడాది ఆయన కొత్త పార్టీని ఏర్పాటుచేశారు. కొద్దిరోజుల క్రితం ఆ పార్టీకి సంబంధించి జెండాతో పాటు గుర్తును కూడా ఆవిష్కరించారు.ఎరుపు, పసుపు రంగుల్లో ఉన్న ఈ జెండాపై మధ్యలో వాగాయి పువ్వుకు రెండు ఏనుగులు అటూ, ఇటూ ఉన్నాయి. తమిళ సంప్రదాయం ప్రకారం ఈ పువ్వును విజయానికి గుర్తుగా అభివర్ణిస్తారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి 2న రాజకీయ పార్టీగా గుర్తింపు కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నాడు విజయ్.
విజయ్‌కి ఎన్నికల సంఘం నుంచి శుభవార్త వచ్చింది. తమ పార్టీకి గుర్తింపు ఇస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇదే విషయాన్ని ఒక లేఖ ద్వారా విజయ్ తెలిపారు. ఎన్నికల సంఘం ప్రకటనతో తన రాజకీయ పార్టీకి గుర్తింపు రావడంతో ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తమ పార్టీ లక్ష్యమని విజయ్ పేర్కొన్నారు. త్వరలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి పార్టీ కార్యచరణ గురించి వెళ్లడిస్తామని అన్నారు. ఈ క్రమంలో తమిళనాడు విల్లుపురం వేదికగా TVK పార్టీ తొలి భారీ బహిరంగ సభకు పోలీసుల నుంచి అనుమతి వచ్చింది. 21 నిబంధనలతో సభకు అనుమతి లభించింది. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలోనే విజయ్ రాజకీయ పార్టీని ప్రకటించారు. కానీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ముందే ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఏ ఇతర రాజకీయ పార్టీలకు కూడా తన మద్దతు ఇవ్వలేదు. 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల బరిలో తప్పకుండా దిగుతామని విజయ్ పేర్కొన్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తారా..? లేదా పొత్తుల సాయంతో ముందుకొస్తారా..? అనే విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment