
తమిళ నటి, పలు తెలుగు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య భాస్కరన్. సీనియర్ నటి లక్ష్మి కూతురు అయిన ఐశ్వర్య టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో అమ్మానాన్న తమిళ అమ్మాయి, నాని, కళ్యాణ వైభోగం లాంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌తో మెప్పించింది. అయితే తాజాగా తనకెదురైన ఓ చేదు అనుభవాన్ని వెల్లడించింది.
ఇటీవల తాను ఆన్‌లైన్ లైంగిక వేధింపులకు గురయ్యానని ఐశ్వర్య తెలిపింది. చాలా మంది తనకు అసభ్యకరమైన సందేశాలు పంపుతుండడంతో డిప్రెషన్‌కు గురైనట్లు పేర్కొంది. కూతురి సలహాతోనే ఈ విషయాన్ని మీ అందరితో చెబుతున్నానని వివరించింది. కొందరు వ్యక్తులు అశ్లీల ఫొటోలు పంపిస్తూ తనను మానసికంగా వేధించారంటూ వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో సోప్స్ బిజినెస్‌ను ఆమె ప్రారంభించారు.
ఐశ్వర్య మాట్లాడుతూ..'సోప్ బిజినెస్ కోసం సోషల్ మీడియాలో ఫోన్ నంబర్ షేర్ చేశా. అప్పటి నుంచి తనకు అనుచిత సందేశాలు, అసభ్యకర ఫొటోలు పంపిస్తున్నారు. కొంతమంది పురుషులు ప్రైవేట్ పార్ట్స్ ఫొటోలు కూడా షేర్ చేశారు. దీంతో మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యాను.' అంటూ తనకెదురైన లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో ద్వారా పంచుకున్నారు ఐశ్వర్య. ఈ వేధింపులు ఇలాగే కొనసాగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వీడియో ద్వారా హెచ్చరించారు.
ఈ విషయంలో ఆమెకు చాలా మంది నెటిజన్లు మద్దతుగా నిలిచారు. కాగా.. ఐశ్వర్య భాస్కరన్ దక్షిణాదిలో తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించింది. అడవిలో అభిమన్యుడు చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది.