గౌతమ్ కిచ్లు, కాజల్ అగర్వాల్
కుమారి కాజల్ అగర్వాల్ శ్రీమతి కాజల్ అవుతున్న రోజు రానే వచ్చింది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో నేడు కాజల్ వివాహం జరగనుంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, తక్కువమంది సమక్షంలో ముంబైలో వివాహ వేడుక ప్లాన్ చేశారు. గౌతమ్ కిచ్లుతో తన వివాహం కుదిరినట్లు అక్టోబర్ 6న కాజల్ అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత పెళ్లి పనులతో బిజీ అయ్యారు. పెళ్లి కాగానే కొత్తింట్లోకి మారబోతున్నారు కాజల్, గౌతమ్. పెళ్లి షాపింగ్, ఆ ఇంటి పనులు చూసుకుంటూ, వేడుకలు చేసుకుంటూ ఈ జంట బిజీ బిజీగా గడిపారు. వారం రోజులుగా కాజల్, గౌతమ్ ఇంట్లో పెళ్లికి ముందు జరిగే వేడుకలను నిర్వహించారు. ఆ వేడుకల గురించి తెలుసుకుందాం.
కాజల్, గౌతమ్ కిచ్లు నిశ్చితార్థ వేడుక కుటుంబ సభ్యుల సమక్షంలో కొన్ని రొజుల క్రితం జరిగింది. ఆ తర్వాత కాజల్ తన చెల్లెలు నిషా, స్నేహితులతో కలిసి బ్యాచిలరెట్ పార్టీ చేసుకున్నారు. గౌతమ్ కిచ్లుతో కలిసి ఇటీవల దసరా పండగ జరుపుకున్నారు కాజల్. ‘‘రెండు రోజుల్లో మిసెస్ కాబోయే ముందు ‘మిస్’గా ఉన్నప్పుడు జరుపుకున్న ‘పైజామా పార్టీ’’ అంటూ తన చెల్లెలు నిషా, ఆమె కుమారుడితో కలిసి దిగిన ఓ ఫొటోను షేర్ చేశారు కాజల్. గురువారం మెహందీ ఫంక్షన్ తాలూకు ఫొటోను పంచుకున్నారు. అదే రోజున ‘హల్దీ’ ఫంక్షన్ కూడా జరిగింది. పెళ్లికి ముందు పెళ్లి కూతురిని చేస్తారనే సంగతి తెలిసిందే. కాజల్‌ని కూడా గురువారం పెళ్లి కూతుర్ని చేశారు.
ఆట పాటలతో..
సంగీత్ లేని పెళ్లి వేడుకలు చాలా అరుదు. పెళ్లి రోజునే సంగీత్‌ని ప్లాన్ చేశారు. ‘‘పెళ్లి వేడుకలన్నీ తక్కువమంది సమక్షంలో అయినప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేశాం. పెళ్లి రోజునే సంగీత్ ప్లాన్ చేశాం. ఆటపాటల హంగామా తప్పనిసరిగా ఉంటుంది’’ అని కాజల్ చెల్లెలు నిషా పేర్కొన్నారు.
నటనకు దూరం కావడంలేదు
‘‘కొన్నేళ్లుగా నా మీద ఎంతో అభిమానం చూపించారు. ఇప్పుడు కొత్త ప్రయాణం మొదలుపెట్టబోతున్నాను. అందరి ఆశీర్వాదాలు కావాలి’’ అంటూ గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని ప్రకటించినప్పుడు కాజల్ పేర్కొన్నారు. ‘‘మీ కొత్త ప్రయాణానికి మా శుభాకాంక్షలు’’ అని అభిమానులు పేర్కొన్నారు. తమ అభిమాన కథానాయిక పెళ్లి చేసుకోవడం అభిమానులు ఆనందపడే విషయం. అలాగే పెళ్లి తర్వాత కాజల్ సినిమాలకు దూరం కావాలనుకోవడంలేదు. ఇది అభిమానులకు రెండింతలు ఆనందాన్నిస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Comments
Please login to add a commentAdd a comment