మలయాళ చిత్ర పరిశ్రమలో నటీమణులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన హేమా కమిషన్ నివేదిక అక్కడ ప్రకంపనలు పుట్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ ప్రభావం అన్ని చిత్ర పరిశ్రమలను తాకుతోంది. ముఖ్యంగా తమిళ సినీ పరిశ్రమను కుదిపేస్తోంది. సీనియర్ల నుంచి జూనియర్ నటీమణులు పలువురు తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను బహిర్గతం చేస్తూ మంచి పరిష్కారం ఆశిస్తున్నారు. కాగా లైంగిక వేధింపులకు బుల్లితెర నటీమణులు అతీతం కాదని నటి కుట్టి పద్మిని పేర్కొన్నారు.
బాల నటిగా పరిచయం అయిన ఈమె పలు చిత్రాల్లో నటించినా, ఆ తరువాత బుల్లితెరలో నటిగా, నిర్మాతగా రాణిస్తున్నారు. ఆమె నటీమణుల లైంగిక వేధింపుల గురించి స్పందిస్తూ డాక్టర్, ఇంజినీర్, సాఫ్ట్‌వేర్‌లో మాదిరిగానే సినిమా వృత్తి కూడా అన్నారు. అయితే ఇక్కడ లైంగిక వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వెండితెరలోనే కాకుండా బుల్లితెరలోనూ నటీమణులు లైంగిక వేధింపులకు గురవుతున్నారన్నారు. కొందరు ఆ సంఘటనలపై ఫిర్యాదులను నిరూపించుకోవడం సాధ్యం కాకపోవడం, బయటకు చెబితే అవకాశాలు రావేమోనని భయపడుతున్నారన్నారు. మరి కొందరు బాగా సంపాదించుకోవడంతో సర్దుకు పోతున్నారన్నారు.
నటి శ్రీరెడ్డి లాంటి వాళ్లకు నడిగర్ సంఘం మెంబర్ షిప్ కార్డు ఇవ్వడం లేదన్నారు. దీంతో వారు సీరియళ్లలోనూ నటించలేకపోతున్నారని అన్నారు. మలయాళ నటుడు సురేష్‌గోపి లైంగిక వేధింపులకు ఆధారాలు ఉన్నాయా అని అడుగుతున్నారని, ఆధారాలు ఎక్కడ నుంచి వస్తాయని, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలన్నారు. తాను బాల తారగా నటిస్తున్నప్పుడు ఇలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నానని, ఈ విషయం తన తల్లి ఫిర్యాదు చేయడంతో తనను ఆ చిత్రం నుంచి తొలగించారని నటి కుట్టి పద్మిని ఈసందర్భంగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment