ముంబై: ప్రముఖ హిందీ రియాలిటీ షో ‘ఖత్రోంకీ ఖిలాడీ: మేడిన్ ఇండియా’ స్పెషల్ ఎడిషన్ బహుమతుల ప్రదానోత్సవం ఆదివారం ముగిసింది. ఒళ్లు గగుర్పొడిచే స్టంట్లతో ప్రేక్షకులను థ్రిల్ చేస్తూనే.. ఒకింత భయానికి గురిచేసే ఈ అడ్వెంచరస్ షో ట్రోఫీని టీవీ నటి నియా శర్మ సొంతం చేసుకున్నారు. సీజన్ ఆసాంతం అద్భుత ప్రదర్శిన కనబరిచిన ఆమె.. ఫైనల్లో మరోసారి తనదైన ధైర్యసాహసాలు ప్రదర్శించి విజేతగా నిలిచారు. నటీనటులు జాస్మిన్ భాసిన్, కరణ్ వాహిని వెనక్కి నెట్టి ట్రోఫీని ముద్దాడారు.
ఈ సందర్భంగా నియా శర్మ మాట్లాడుతూ.. ‘‘ఈ స్పెషల్ ఎడిషన్‌ను తొలుత చాలా సరదాగా ప్రారంభించాను. అయితే కొద్ది రోజుల్లోనే నా ఆలోచన పూర్తిగా మారిపోయింది. టైటిల్‌ను గెలవాలనే ఆశయంతో స్టంట్లు పూర్తి చేయడం మొదలుపెట్టాను. ఇందుకోసం నేను వందకు వంద శాతం కష్టపడ్డాను’’ అని సంతోషం వ్యక్తం చేశారు. షో నిర్వాహకులు తన పట్ల పూర్తి నమ్మకం ఉంచి, ప్రోత్సహించడంతోనే ఇదంతా సాధ్యమైందని చెప్పుకొచ్చారు. (చదవండి: బిగ్‌బాస్ ఎంట్రీ: కొట్టిపారేసిన నటి)
అదే విధంగా.. ‘‘కలర్స్(టీవీ చానెల్) నాకు రెండోసారి అవకాశం కల్పించింది. నన్ను నేను నిరూపించుకోవడానికి దోహదపడింది. నియా శర్మ అంటే కేవలం మేకప్, స్టైలింగ్ అని విమర్శించే వాళ్లకు ఈ విధంగా సమాధానం ఇచ్చాను. నియా ఒక విజేత. తనను తాను నిరూపించుకున్న ధీశాలి’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. కాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి హోస్ట్‌గా వ్యవహరించిన ఖత్రోంకీ ఖిలాడీ షోలో నియా, జాస్మిన్ భాసిన్, కరణ్ వాహితో పాటుగా జై భన్షాలీ, రిత్విక్ ధంజని, భారతీ సింగ్, హర్ష్ లింబోచియా, అలీ గొని, కరణ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. వీరిలో రిత్విక్ మాత్రం వ్యక్తిగత కారణాలతో షో మధ్యలోనే వైదొలిగాడు. సీజన్ 10 ముగిసిన తర్వాత నిర్వహించిన స్పెషల్ ఎడిషన్‌లో రోహిత్ శెట్టి టీం కఠిన టాస్కులతో కంటెస్టంట్ల ధైర్యసాహసాలను పరీక్షించారు. (చదవండి: బాడీషేమింగ్ అనేది మార్కెట్ గిమ్మిక్)
నీటితో నింపి లాక్ చేసిన పేటికలో గడపడం, బాంబులను దాటుకుంటూ ముందుకు సాగడం, బురదలో ఈత కొట్టడం వంటి స్టంట్లు ఇచ్చారు. ఇక ఫైనల్లో కొండచిలువలను తప్పించుకుంటూ, పైకి ఎగబాకుతూ, గ్లాసు పగులకొట్టి నెక్లెస్‌ను తీసుకురావాల్సిందిగా టాస్క్ ఇచ్చారు. మధ్య మధ్యలో బాంబులు పేలుస్తూ, ఎలక్ట్రిక్ షాకులకు గురిచేశారు. వీటన్నింటినీ సమర్థవంతంగా పూర్తి చేసిన నియా శర్మ.. టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఇక జమాయి రాజా, ఏక్ హజారోం మే మేరీ బహన్ హై వంటి హిట్ సీరియళ్లతో బుల్లితెరపై నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ‘ఖత్రోంకీ ఖిలాడీ’గా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment