‘‘నువ్వు అలాంటి పాత్రలు చేయొద్దు, ఇలాంటి కథలు ఎంచుకోవద్దు.. అంటూ కొందరు చెప్పిన సలహాలు పాటించి బోల్తా పడ్డాను (ఫ్లాప్ సినిమాలను ఉద్దేశిస్తూ). కానీ, నన్ను నేను నమ్ముకుని స్వతహాగా కథలు ఎంచుకుని చేస్తున్నప్పుడు బోల్తా పడలేదు (హిట్ సినిమాలను ఉద్దేశిస్తూ)’’ అని హీరో అడివి శేష్ అన్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిట్ 2’. అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. హీరో నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా అడివి శేష్ చెప్పిన విశేషాలు.
► నేను కథ వినేటప్పుడు ఓ ప్రేక్షకునిగా ఆలోచిస్తాను. ఎక్కడైనా బోర్ కొడుతుంటే మొహమాటం లేకుండా చెప్పేస్తాను. ‘హిట్ ది ఫస్ట్ కేస్’లో విశ్వక్ సేన్ నటించాడు. ‘హిట్ ది సెకండ్ కేస్’లో నన్ను చేయమని శైలేష్ అడిగినప్పుడు.. ‘నేనే ఎందుకు చేయాలి’ అన్నాను. కృష్ణదాస్ అనే పోలీసాఫీసర్ పాత్రకి మీరు కరెక్టుగా సరిపోతారని చెప్పాడు. ‘ఈ విషయం విశ్వక్ సేన్‌కి తెలుసా?’ అని శైలేష్‌ని అడిగితే.. ‘తెలుసు’ అన్నాడు. అప్పుడు ‘హిట్ 2’ కథ వినేందుకు ఒప్పుకున్నాను. పైగా నానీగారు కూడా ఫోన్ చేసి కథ వినమన్నారు. స్క్రిప్ట్ వినగానే నచ్చింది. నా గత ఐదు చిత్రాల్లో నాలుగింటి స్క్రిప్ట్‌లో ఇన్‌వాల్వ్ అయ్యాను. కానీ, ‘హిట్ ది సెకండ్ కేస్’ స్క్రిప్ట్‌లో మాత్రం ఇన్‌వాల్వ్ కాలేదు. శైలేష్ బాగా రాశాడు. నేను ఒక నటుడిగా మాత్రమే పని చేశాను.
► సమాజంలోని చాలా ముఖ్యమైన అంశాలను, కొందరు కిల్లర్స్‌గా ఎందుకు మారుతున్నారు? అనే విషయాలను ఈ సినిమాలో చర్చించాం. ‘మేజర్’ సినిమా బయోపిక్ కావడం, పైగా ఆర్మీ నేపథ్యంలో ఉండటంతో చాలా ఒత్తిడి ఉండేది. కానీ, ‘హిట్ 2’కి ఎలాంటి ఒత్తిడి లేదు. ప్రీమియర్ చూసినవారందరూ చాలా బాగుందని చెప్పడం హ్యాపీ. ఈ చిత్రాన్ని హిందీ, కన్నడలో డబ్ చేస్తున్నాం. ఈ నెల 13న హిందీలో విడుదలవుతుంది.
► థ్రిల్లర్ నేపథ్యంలో నేను నటించిన ‘క్షణం’ చిత్రంతో నాకు మంచి పేరు వచ్చింది. అలాగే ‘గూఢచారి’ కమర్షియల్ సక్సెస్ ఇచ్చింది. నా ఫేవరెట్ టాప్ టెన్ చిత్రాల్లో చిరంజీవిగారి ‘ఖైదీ’, కార్తీగారి ‘ఖైదీ’ ఉన్నాయి. ‘హిట్ 2’ చిత్రం కమల్‌హాసన్‌గారి ‘విక్రమ్’లా హిట్ కావాలనుంది.
‘హిట్’ ఫ్రాంచైజీలో లాస్ట్ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఉంటుంది. నేను ముద్దు సన్నివేశాల్లో నటించినప్పుడు అమ్మ తిట్టింది. ఫైట్స్, డ్యాన్స్‌లా అది కూడా నటనలో భాగమని అమ్మకి చెప్పాను. నాకు ఓ మంచి కామెడీ సినిమా చేయాలనుంది. ‘హిట్ 3’లో నేను కూడా ఉంటాను. ఆస్కార్ అవార్డు పొందిన ఓ హాలీవుడ్ మూవీని రీమేక్ చేయనున్నాం. అందులో నా పాత్ర రఫ్‌గా ఉంటుంది.
► నేను అమెరికాలో ఉన్నప్పుడు గంటన్నర ప్రయాణం చేసి మరీ వెళ్లి మహేశ్‌బాబుగారి ‘మురారి’ సినిమా చూశాను. నేను అభిమానించిన హీరోలు మహేశ్‌బాబు (‘మేజర్’ సినిమా నిర్మాత), నానీ (హిట్ 2) గార్లతో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. నాలోని నిజాయతీ, నా ప్యాషన్‌ని మహేశ్, నానీగార్లు నమ్మారు కాబట్టే నాతో సినిమాలు నిర్మించారు.
అప్పుడు నేను బోల్తా పడలేదు
Published Fri, Dec 2 2022 4:32 AM | Last Updated on Fri, Dec 2 2022 4:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment