
జుట్టు రాలిపోవడం ఎంత పెద్ద సమస్య అనేది అనుభవించినవారికే తెలుస్తుంది. అందులోనూ చిన్నవయసులోనే జుట్టు రాలిపోతుంటే దాన్ని అరికట్టలేక, కవర్ చేయలేక నానాతంటాలు పడేవారు చాలామంది ఉంటారు. ఈ ఇబ్బందులు తానూ పడ్డానంటున్నాడు బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా (Akshaye Khanna). ఛావా సినిమా (Chhaava Movie)లో ఔరంగజేబుగా నటించి విశేష గుర్తింపు సంపాదించుకున్న ఇతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో హెయిర్ ఫాల్ గురించి మాట్లాడాడు.
ఆ బాధ నాకు తెలుసు
'చిన్న వయసులోనే తలపై వెంట్రుకలు ఊడిపోతే (Early Balding) ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. చేతి వేళ్లను కోల్పోయినంత బాధగా, కష్టంగా ఉండేది. నాకది పెద్ద సమస్యలాగే కనిపించేది. 19 ఏళ్ల వయసులోనే జుట్టు ఊడిపోతుంటే భరించలేకపోయాను. అది మానసికంగా, వృత్తిపరంగా నన్ను చాలా ఇబ్బందిపెట్టింది. నటుడిగా కొనసాగాలనుకునే వ్యక్తికి జుట్టు చాలా అవసరం.
సడన్‌గా కంటిచూపు మందగిస్తే ఎలా ఉంటుంది?
మనకు తలపై ఎన్ని వెంట్రుకలు ఉన్నాయన్నదాన్ని బట్టే ఎలాంటి ఆఫర్స్ వస్తాయనేవి ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా జుట్టు రాలడాన్ని మనం తగ్గించలేం అన్న నిజాన్ని జీర్ణించుకునేవరకు తిప్పలు తప్పవు. కానీ చిన్న వయసులో జుట్టు కోల్పోవడం వల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. అలాగే వయసు పెరిగేకొద్దీ కంటిచూపు సైతం మందగిస్తుంది. సడన్‌గా ఒక రోజు ఉదయం పేపర్ తిరగేద్దామంటే అక్షరాలు మసకబారినట్లు కనిపిస్తున్నాయనుకోండి. ఎలా ఉంటుంది?
భయపడ్డా.. ఫోకస్ చేశా
అదేంటి నా కంటిచూపుకేమైంది? ఇకమీదట అద్దాలు పెట్టుకుంటే మాత్రమే కనిపిస్తాయా? అని ఆందోళన చెందుతాం కదా.. ఈ బట్టతల కూడా అలాంటిదే! దీనివల్ల నాకు సినిమా అవకాశాలు ఏమైనా తగ్గిపోతాయేమోనని భయపడ్డాను. కానీ తర్వాత నా లుక్స్ కంటే కూడా యాక్టింగ్ స్కిల్స్‌పైనే ఎక్కువ ఫోకస్ చేశాను. అందువల్లే ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను' అని అక్షయ్ ఖన్నా చెప్పుకొచ్చాడు.
చదవండి: భార్యకు విడాకులిచ్చి హీరోయిన్‌తో ప్రేమాయణం?.. స్పందించిన హీరో