– అల్లు అర్జున్
‘‘పుష్ప 2: ది రూల్’ క్లైమాక్స్ షూటింగ్‌లో ఉన్నా. నా జీవితంలో ఎంతో క్లిష్టమైన క్లైమాక్స్ షూటింగ్ . సుకుమార్‌గారి భార్య తబితగారు వచ్చి ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ సినిమాని నేను సమర్పిస్తున్నాను.. ప్రీ రిలీజ్ వేడుకకి రావాలని అడగ్గానే వస్తానని చెప్పాను. ఎందుకంటే మనకి ఇష్టమైన వాళ్లకి మనం సపోర్ట్‌గా నిలబడగలగాలి. అది మన ఫ్రెండ్ అయినా, కావాల్సిన వాళ్లు అయినా. నాకు ఇష్టమైతేనే నేను వస్తా.. నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరికీ తెలిసిందే’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు.
రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. తబితా సుకుమార్ సమర్పణలో బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించిన ఈ మూవీ ఈ నెల 23న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ మాట్లాడుతూ–‘‘సుకుమార్‌గారు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో ఉన్నారు. అయినా తబితగారు స్వతహాగా ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్.
రావు రమేష్‌గారి లాంటి నటుడు ఉండటం మన తెలుగు ఇండస్ట్రీ అదృష్టం. ఈ మధ్య చిన్న చిత్రాలకు జనాలు థియేటర్స్‌కి వస్తుండటం మంచి ట్రెండ్. అదే ట్రెండ్ ఈ శుక్రవారం కూడా కొనసాగాలి. ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ ని కూడా మీరు సపోర్ట్ చేయాలి. గత ఏడాది నాకు జాతీయ అవార్డు వచ్చినప్పుడు ఈ ఏడాది ‘కాంతార’ కి వస్తే బాగుండు అనుకున్నా. రిషబ్ శెట్టిగారికి వచ్చినందుకు అభినందనలు. నిత్యామీనన్ మంచి నటి. నాకు మంచి ఫ్రెండ్. తనకు జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉంది. అలాగే ‘కార్తికేయ 2’ మూవీ యూనిట్‌కి, జానీ మాస్టర్‌కి కూడా అభినందనలు. డిసెంబరు 6న అస్సలు తగ్గేదే లే.. ఇది మాత్రం ఫిక్స్. నా సినిమా ఎలా ఉన్నా మీకు(ఫ్యాన్స్) నచ్చుతుంది కాబట్టి ‘పుష్ప 2: ది రూల్’ని మీకు అంకితం ఇస్తున్నా’’ అని తెలిపారు.
డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ–‘‘ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బన్నీ రావడం వల్ల ఈ చిన్న సినిమా కాస్త పెద్దది అయిపోయింది. బన్నీ ఎప్పుడూ కూడా తాను స్టార్ అనుకోడు.. నేను బాగా నటించాలన్నదే తన లక్ష్యం. ఓ స్టార్ హీరో నటించడమే గొప్ప విషయం అనుకుంటే గనక.. గొప్పగా నటించే రావు రమేశ్‌కూడా బిగ్గెస్ట్ స్టార్. ఈ సినిమా హిట్ కావాలి’’ అన్నారు. ‘‘ఇన్నేళ్లలో నాకు సరైన స్క్రిప్ట్ దొరికిందని నమ్మి, ఈ సినిమాలో లీడ్ రోల్ చేశాను’’ అని రావు రమేష్ చెప్పారు.
‘‘ఇటీవల ‘కమిటీ కుర్రోళ్ళు, ఆయ్’ వంటి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఆ కోవలో మంచి కథతో వస్తున్న మా ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ ని కూడా ఆదరించాలి’’ అన్నారు తబితా సుకుమార్. ఈ వేడుకలో నిర్మాతలు మోహన్ కార్య, బుజ్జి రాయుడు పెంట్యాల, ఇంద్రజ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment