
సాక్షి, అమీర్‌పేట: కరాటే కల్యాణితో తనకు ప్రాణభయం ఉందని ఓ మరో బాధితుడు ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం.. గతేడాదిలో జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువతిపై అత్యాచారం జరగగా ఈ కేసుకు సంబంధించి బాధితురాలి ఫొటోలు, పేర్లు ఇతర వివరాలను అప్పట్లో కల్యాణి మీడియాకు చెప్పింది. వెంగళరావునగర్‌లో ఉంటున్న కర్నూల్‌కు చెందిన నితేష్ అనే వ్యక్తి బాధితురాలి వివరాలను రహస్యంగా పెట్టాల్సింది పోయి మీడియాకు ఎందుకు చెప్పావంటూ కల్యాణిని ప్రశ్నించాడు.
నన్ను అడగడానికి నువ్వెవరంటూ ఎదురు తిరగడంతో జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నితేష్‌పై కోపం పెంచుకున్న కల్యాణి తనపైనే ఫిర్యాదు చేస్తావా.. నీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడిందని తెలిపాడు. అయితే తాజాగా కల్యాణిపై కేసు నమోదైనట్లు విషయం తెలుసుకున్న నితేష్ కల్యాణితో తనకు కూడా ప్రాణభయం ఉందంటూ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
చదవండి: (యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి)