అనుబంధాలతో అల్లుకున్న పొదరింట్లో ఉన్న అమ్మాయి.. నాలో ఏదో చిలిపి కల అంటూ సరదాగా ఆడుతూ పాడుతూ ఉన్న ఆమె జీవితంలో.. కల్లోలం రేపేందుకు ఓ విలన్ వచ్చేస్తాడు.. అతడి రాకతో, డాక్టర్‌గా ప్రాక్టిస్ చేస్తున్న అమ్మాయి జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది.. విలన్ పన్నే కుట్రలను ఆమె ఎలా తిప్పికొట్టింది.. అతడిని తట్టుకుని నిలబడిందా లేదా? అన్నది చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.. ప్రముఖ ఛానెల్ ‘స్టార్ మా’లో ప్రసారం కానున్న ‘కస్తూరి’ సీరియల్ గురించే ఈ ఉపోద్ఘాతమంతా.. అగ్నిసాక్షి సీరియల్‌తో ఇన్ని రోజులు గౌరీగా ప్రేక్షకుల మనసులో నిలిచిన ఆ అందమైన అమ్మాయే.. ఇకపై కస్తూరిగా మనల్ని అలరించనుంది. ఆమె మరెవరో కాదు.. ఐశ్వర్య పిస్సే! అల్లరిపిల్ల ‘గౌరీ’కి సంబంధించిన ముచ్చట్లు మీకోసం..
నిజ జీవితంలోనూ అంతే..
స్టార్ మాలో వచ్చిన ‘‘అగ్నిసాక్షి’’ ముగింపు సమయంలోనే ఐశ్వర్యకు ‘‘కస్తూరి’’ సీరియల్ ఆఫర్ వచ్చిందట. నిజానికి ఫిబ్రవరిలో ఈ షూటింగ్ మొదలవ్వాలి. అయితే లాక్‌డౌన్ కారణంగా కాస్త ఆలస్యమైనా త్వరలోనే సీరియల్ బుల్లితెరపై ప్రసారం కానుంది. ఐశ్వర్య ఇందులో మెడికోగా కనిపించనుంది. ఇందులో క్యారెక్టర్ ఐశ్వర్య నిజజీవితానికి చాలా దగ్గరగా ఉంటుందట. ఐశ్వర్యకి ఓపిక ఎక్కువేనట. బాధ కలిగినా వెంటనేగా ముఖం మీద చూపించదు. కస్తూరిలో అలాంటి క్యారెక్టర్ తనకు ఇచ్చిన యూనిట్‌కు, తన వెన్నంటి ప్రోత్సహిస్తున్న స్టార్ మాకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పాలంటున్నది ఐశ్వర్య.
డాక్టర్ కావాలని..
ఐశ్వర్య బెంగళూరులో పుట్టింది. చిన్నప్పుడే వాళ్ల నాన్న తనను, తల్లిని వదిలేసి వెళ్లిపోయాడు. ఐశ్వర్య వాళ్ల అమ్మ హెల్త్ వర్కర్‌గా పని చేసేది. అందుకే ఐశ్వర్య చిన్నప్పుడు ఆయుర్వేదం డాక్టర్ కావాలని కలలు కన్నది. కానీ అమ్మ కష్టం అర్థమై డాక్టర్ చదువును పక్కకు పెట్టేసింది. పదో తరగతిలో ఉన్నప్పుడు థియేటర్స్‌లో జాయినయింది. అలా మెల్లగా నటన మీద ఆసక్తి పుట్టడంతో చాలా ఆడిషన్లకు వెళ్లింది. అలా నటిగా మారి ఇప్పుడు ప్రేక్షకుల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది. తన చిన్ననాటి కల తీరనప్పటికీ, ఇప్పుడు ‘స్టార్ మా’ వల్ల కస్తూరిలో తను డాక్టర్ పాత్ర పోషిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందంటున్నది ఈ కన్నడ భామ.
కన్నడతో కెరీర్..
సినిమాల్లో కంటే సీరియల్ ‘బెస్ట్’ అని భావించింది ఐశ్వర్య. అప్పటికే సీరియల్స్ హవా నడుస్తుండటంతో.. అటు వైపుగా అడుగులు వేసింది. మొదట రెండు సీరియల్స్‌లో చిన్న పాత్రలు చేసింది. ఆ తర్వాత ఓ సీరియల్‌లో మెయిన్ లీడ్ చేసింది. అలా నటన కొనసాగిస్తూనే డిగ్రీ పూర్తి చేసింది. ఈ క్రమంలో రెండు సినిమాల్లో కూడా చిన్న పాత్రలు చేసింది. కానీ సీరియళ్లలో వరుస అవకాశాల కారణంగా సినిమా అవకాశాలను పక్కకు పెట్టింది. అన్నట్లు.. ఒక సినిమాలోనూ హీరోయిన్‌గా నటించింది ఐశ్వర్య. కానీ అది ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. ఆ తర్వాత ఆర్కా మీడియాలో పని చేసినప్పుడు తెలుగులో ఆఫర్ వచ్చింది.
తెలుగు లోగిళ్లలో..
తెలుగులోకి రావాలని అస్సలు అనుకోలేదట ఐశ్వర్య. అయితే ఇక్కడ అడుగు పెట్టాక చాలా కంఫర్ట్‌గా ఫీలయిందట. ముందు ఇంగ్లిష్‌లో రాసుకొని డైలాగులు చెప్పేదాన్నని... ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడగలనంటున్నదీ అమ్మడు. ఇక స్టార్ మాలో వచ్చిన అగ్నిసాక్షి సీరియల్ తన కెరీర్‌కి చాలా ప్లస్ అయిందని, ఇప్పటికీ తనను గౌరిగానే గుర్తు పెట్టుకుంటారంటున్నరని మురిసిపోయింది. అయితే ఇప్పడు కస్తూరి వచ్చాక మాత్రం తనని కస్తూరి అని పిలువడం ఖాయమంటున్నది. చాలా కాలం తర్వాత వస్తున్నా, ఇటీవల విడుదలైన ప్రోమోకి వచ్చిన రెస్పాన్స్ చూస్తే చాలా సంతోషంగా ఉందంటున్నది.
వాళ్ల అన్నయ్యనే పెళ్లి చేసుకున్నా..
‘‘నటి నవ్య నాకు మొదటి సీరియల్ నుంచి పరిచయం. వాళ్లన్నయ్యనే నేను పెళ్లి చేసుకున్నా. మేం వదిన, ఆడపడుచులుగా కాకుండా ఫ్రెండ్స్‌లా ఉంటాం. తన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నా. కరోనా సమయంలో కూడా తను చూపిన గుండె నిబ్బరం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. తను స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టే అలా నిలబడగలిగింది. స్టార్ మాలో వచ్చిన ‘ఇస్మార్ట్ జోడి’ వల్ల నేను చాలా నేర్చుకున్నా. భార్యభర్తల అన్యోన్యత గురించి చాలా తెలుసుకున్నా’’అని అంటున్నది ఐశ్వర్య.
పద్ధతిగా ఉంటే..
‘‘ప్రతీ పనిలో అమ్మ తోడ్పాటు మరువలేనంటుననది. తెలుగులో నాకంటూ ఒక గుర్తింపు రావడానికి స్టార్ మా ముఖ్య కారణం. వారి అండతో మరిన్ని మంచి ప్రాజెక్ట్‌లతో కనిపించాలని అనుకుంటున్నారు. అగ్నిసాక్షి సీరియల్‌కి రెండు అవార్డులు అందుకున్నా. ప్రేక్షకుల అభిమానం వల్లే ఈ అవార్డులు అందుకోగలిగాను. పద్ధతిగా ఉండే క్యారెక్టర్‌లు వస్తే తప్పకుండా సినిమాల్లో కూడా చేస్తాను. గౌరిగా ఆదరించినట్టే.. ఇప్పుడు కస్తూరిగా కూడా అదే అభిమానం చూపిస్తారని ఆశిస్తున్నా’’ అంటున్న ఐశ్వర్యకు ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం!!
Comments
Please login to add a commentAdd a comment