ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో 'అవతార్: ది వే ఆఫ్ వాటర్ (అవతార్-2)’ ఒకటి. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 16న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ చిత్రం ఇప్పటికే 2.2 బిలియన్ డాలర్ల వరల్డ్ వైడ్ బిజినెస్ సాధించిందని ప్రచారం జరుగుతోంది. ప్రపంచ దేశాలతో పాటు భారతీయ సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. ఈ సినిమా కోసం ఇండియాలో ఈ నెలలోనే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. కేవలం మూడు రోజుల్లోనే 45 స్క్రీన్‌లలో 15,000పైగా ప్రీమియం ఫార్మెట్‌ల టిక్కెట్లు అమ్ముడయ్యాయి.
‘అవతార్-2 ’ విడుదలకు ఇంకా మూడు వారాల సమయం ఉంది. ఇంత ముందుగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే కూడా ఇలాంటి స్పందన రావడం సంతోషంగా ఉందని పీవీఆర్ పిక్చర్స్ సీఈఓ కమల్ జియాంచందాని అన్నారు. 'జేమ్స్ కామెరూన్ సినిమాలు భారతీయ బాక్సాఫీస్ పై ప్రతిసారీ ఏదో ఒక మాయాజాలం సృష్టిస్తూనే ఉన్నాయి. ప్రేక్షకులు అలాంటి మరో దృశ్యం కోసం ఎదురు చూస్తున్నారు! అడ్వాన్స్ బుకింగ్ లపై భారీ స్పందన వచ్చింది. ఇది కేవలం ప్రీమియం ఫార్మాట్ అమ్మకాల గురించి నేను చెబుతున్న మాట. ఇతర అన్ని ఫార్మాట్ లలో టికెట్ల అమ్మకాలు నేటి నుంచి ఓపెనవ్వడంతో ఇంకా భారీ సంఖ్యలను ఆశిస్తున్నాము' అని అన్నారు.
ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ చీఫ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ రాజేందర్ సింగ్ జ్యాలా ..‘అవతార్‌కి సీక్వెల్ తరతరాలుగా ప్రజలు చూసే ఒక భారీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అవుతుంది. మా ప్రీమియం ఫార్మాట్ షోలన్నీ ఇప్పటికే అమ్ముడయ్యాయి. ఇది మాకు అద్భుతమైన వార్త. మేము 3D - 2D ఫార్మాట్ ల బుకింగ్లను ప్రారంభించిన తర్వాత బుకింగ్ సంఖ్యలు గణనీయంగా పెరుగుతాయని ఆశిస్తున్నాం’ అన్నారు.
సినీపోలిస్ సీఈఓ దేవాంగ్ సంపత్ మాట్లాడుతూ.. ‘అవతార్ 13 సంవత్సరాల క్రితం విడుదలైనప్పుడు ఈ చిత్రానికి భారీ స్పందనను చూసి మేం మంత్రముగ్దులయ్యాం. ఇది అప్పట్లో బ్లాక్ బస్టర్ .. ఇప్పటికీ సినీ ప్రేక్షకుల హృదయాలను శాసిస్తోంది. భారతదేశంలోని ప్రేక్షకులు ఎల్లవేళలా లార్జర్-దన్-లైఫ్ ఎంటర్ టైనర్ లపై గొప్ప ప్రేమను కురిపిస్తూనే ఉంటారు. ఒక్క రోజులోనే మేము భారతదేశం అంతటా టికెట్ల అమ్మకాల్లో పార్ట్ 2కి అద్భుతమైన స్పందనను పొందాం. ప్రపంచంలోనే అత్యుత్తమ 3డి టెక్నాలజీ అయిన సినెపోలిస్ రియల్ డి 3డిలో సినిమాను చూడండి’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment