ఈ మధ్య కాలంలో థియేటర్ దగ్గర సెన్సేషన్ సృష్టించిన చిత్రాల్లో బేబి మూవీ ఒకటి. ఈ మూవీతో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య పేరు మార్మోగిపోయింది. స్టార్ హీరోలు సైతం ఆమెను పొగడ్తల్లో ముంచెత్తారు. నిజానికి ఆమెకు హీరోయిన్ అవకాశం అంత ఈజీగా రాలేదు. మొదట డబ్‌స్మాష్, టిక్‌టాక్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకుంది వైష్ణవి చైతన్య. తర్వాత యూట్యూబ్‌లో షార్ట్ ఫిలింస్, కవర్ సాంగ్స్, వెబ్ సిరీస్ చేస్తూ ఫేమస్ అయింది. వెండితెరపైనా పలు సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది.
10వ తరగతిలోనే కుటుంబ బాధ్యత
అందం, ప్రతిభ ఉన్నప్పటికీ హీరోయిన్ ఛాన్స్ ఆమెను ఆలస్యంగానే వరించింది. డైరెక్టర్ సాయి రాజేశ్ బేబి కథకు వైష్ణవి సరిపోతుందని భావించడంతో ఆమెను సెలక్ట్ చేశాడు. తర్వాత ఆ మూవీ ఓ రేంజ్‌లో హిట్టవడం.. హీరోయిన్‌కు ఎక్కడలేని క్రేజ్ రావడం తెలిసిందే! తాజాగా వైష్ణవి చైతన్య ఓ ఇంటర్వ్యూలో తను పడ్డ కష్టాలను చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. 'నేను పదో తరగతి నుంచే కుటుంబ బాధ్యతలు తీసుకున్నా. అప్పుడు నాకు తెలిసిందల్లా డ్యాన్స్ ఒక్కటే! బర్త్‌డే, పెళ్లి.. ఇలాంటి ఈవెంట్స్‌లో డ్యాన్స్ చేసేదాన్ని. అలా ఒక్కరోజు డ్యాన్స్ చేస్తే రూ.700 ఇచ్చేవాళ్లు. మా అమ్మ ఆ డబ్బుతో బియ్యం కొనుక్కువచ్చేది.
దుస్తులు మార్చుకునేందుకు గది లేదు
యూట్యూబ్‌లో వీడియోలు చేసేటప్పుడు కాస్ట్యూమ్స్ మార్చుకుందామన్నా ప్రత్యేక గది ఉండేది కాదు. అక్కడున్న వాష్‌రూమ్‌కి వెళ్లి దుస్తులు మార్చుకునేదాన్ని. అది మా అమ్మ ఏడ్చేసింది. ఎందుకమ్మా, ఇదంతా వద్దు.. వదిలేయ్ అని బాధపడింది. అప్పుడే ఏదైనా సాధించాలనుకుని ఫిక్సయ్యాను. ఒకసారేం జరిగిందంటే.. ఒక సినిమాలో చిన్న పాత్ర చేశాను. మనకంటూ కారవాన్ ఉండదు. పెద్ద ఆర్టిస్ట్ దగ్గరకువెళ్లి వాష్‌రూమ్ కోసం మీ కారవ్యాన్ వాడుకోవచ్చా? అని అడిగితే ఆమె నానామాటలు అంది. నాకు ఏడుపొక్కటే మిగిలింది. ఈ సంఘటన నన్ను చాలా బాధపెట్టింది. అంతేకాదు, ఈ పిల్ల ఏం చేయలేదు, తను ముందుకు వెళ్లలేదు అని చాలామాటలన్నారు. అవి ఎంత పట్టించుకోవద్దనుకున్నా అవి నన్ను ఏదో ఒకరంగా బాధించాయి' అని చెప్పుకొచ్చింది వైష్ణవి చైతన్య.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment