ప్రస్తుతం పల్లెల్లో ఎక్కడ చూసినా బలగం మాటే వినిపిస్తోంది. అంతలా గ్రామీణ ప్రజలను ఆకట్టుకుంది ఈ చిత్రం. పల్లె సంప్రదాయాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించిన చిత్రం బలగం. తెలంగాణ పల్లెల్లో కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమానురాగాలను తెరపై చక్కగా చూపించారు దర్శకుడు వేణు యెల్దండి. చిన్న సినిమా హృదయాలకు హత్తుకునేలా చేశారు. అంతలా విజయం సాధించిన ఈ చిత్రంపై ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అయితే ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్యకల్యాణ్ రామ్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించిన వారిపై టాలీవుడ్‌లో ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఈ చిత్రంలో హీరోకు అత్తమ్మగా, హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్‌కు తల్లి పాత్రలో రూప లక్ష్మి తనదైన నటనతో మెప్పించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తన పాత్రకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కుటుంబ నేపథ్యం గురించి వివరించారు.
రూప లక్ష్మి మాట్లాడుతూ..'మా నాన్న రైతు. ఆయనకు ఆరుగురు సంతానం. నన్ను లెక్చరర్‌కి దత్తత ఇచ్చారు. అయితే ఇప్పటికీ నేను నా కుటుంబ సభ్యులతో చక్కగా కలిసే ఉంటాను.' అని అన్నారు. మీరు తక్కువ వయసులోనే తల్లి పాత్రను పోషించారు. అలాగే రేపు ప్రభాస్ వంటి హీరోలకు తల్లి పాత్ర చేయమని అడిగితే ఏం చేస్తారని ప్రశ్నించగా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. 'ఒక మహిళగా సంతృప్తినిచ్చే స్థానం అమ్మ. కాబట్టి అలాంటి పాత్రలు వస్తే నటించటానికి ఎప్పుడు సిద్ధమే. ఇందులో నాకేలాంటి అభ్యంతరం లేదు. 70 ఏళ్ల వ్యక్తికి అమ్మగా నటించాలని అడిగినా నాకేలాంటి ఇబ్బంది లేదు. స్టార్ హీరోలకు అమ్మ పాత్రలో నటించటానికి నేనేప్పుడు సిద్ధమే.' అని అన్నారు.
కాగా.. బలగం చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించిన ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్‌రామ్‌లతో పాటు సుధాకర్ రెడ్డి, నర్సింహ, రూప లక్ష్మి, మురళీధర్‌లకు చాలా మంచి గుర్తింపు దక్కింది. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలంగాణ నేపథ్యంలో సినిమా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. గ్రామాల్లో ప్రజలు ఏకంగా పెద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేసుకుని మరీ ఆ సినిమాను చూసేస్తున్నారు.
(ఇది చదవండి: అదిరిపోయే లుక్‌తో కాజోల్.. నెటిజన్స్ దారుణమైన ట్రోల్స్)
Comments
Please login to add a commentAdd a comment