టైటిల్: బిచ్చగాడు 2
నటీనటులు: విజయ్ ఆంటోని, కావ్య థాపర్, దాతో రాధా రవి, వై.జి. మహేంద్రన్, యోగి బాబు తదితరులు
దర్శకత్వం: విజయ్ ఆంటోని
సంగీతం: విజయ్ ఆంటోని
సినిమాటోగ్రఫీ: విజయ్ మిల్టన్, ఓమ్ ప్రకాష్
విడుదల తేది: మే 19, 2023
‘బిచ్చగాడు 2’ కథేంటంటే..
విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోనీ) ఓ బడా వ్యాపారవేత్త. దేశంలోనే అత్యంత ధనవంతుల్లో ఏడో వ్యక్తి. ఎన్నికల ఫండ్ కోసమే రూ. 5000 కోట్లు ఇచ్చేస్తాడు. ఆయన ఆస్తుల విలువ దాదాపు లక్ష కోట్ల వరకు ఉంటుంది. అయితే.. విజయ్ గురుమూర్తి ఆస్తిపై అతని స్నేహితుడు, వ్యాపారాల్లో కీలకంగా వ్యవహరించే అరవింద్(దేవ్ గిల్) కన్నుపడుతుంది. ఎలాగైనా విజయ్ ఆస్తిని కొట్టేయాలని ఆలోచిస్తున్న సయమంలో టీవీలో బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ గురించి చెప్పేది వింటాడు. విజయ్‌ని చంపేసి అతని శరీరంలో వెరొకరి బ్రెయిన్‌ని ట్రాన్స్‌ప్లాంట్ చేయించి, ఆస్తి మొత్తం కాజేయాలని ప్లాన్ వేస్తాడు.
పథకం ప్రకారమే విజయ్‌ని దుబాయ్‌కి వచ్చేలా చేసి చంపేస్తాడు. ఆ తర్వాత ఆ బాడీలో సత్య అనే ఓ బిచ్చగాడి బ్రెయిన్‌ని ట్రాన్స్‌ప్లాంట్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆనంద్ అనుకున్నట్లు విజయ్ ఆస్తిని చేజిక్కించుకున్నాడా? అసలు సత్య ఎవరు? ఎలా బిచ్చగాడు అయ్యాడు? అతని చెల్లెలు ఎవరు? ఎలా దూరమైంది? సత్య చిన్నప్పుడు జైలుకు ఎందుకు వెళ్లాడు? సత్య విజయ్‌గా మారిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? అతనిపై ఎవరికి అనుమానం రాలేదా? విజయ్ ప్రియురాలు, కంపెనీ సెక్రటరీ హేమ(కావ్యా థాపర్)కు నిజం తెలిసిన తర్వాత ఏం చేసింది? సీఎం(రాధా రవి) సత్యను ఎందుకు చంపించాలనుకున్నాడు? అసలు యాంటీ బికిలీ కార్యక్రమం ఏంటి? చివరకు సత్య తన చెల్లి కలిశాడా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
విజయ్ ఆంటోని హీరోగా నటించిన ‘బిచ్చగాడు’లో మదర్ సెంటిమెంట్ ఉంటే.. దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘బిచ్చగాడు 2’లో సిస్టర్ సెంటిమెంట్ ఉంది. అలాగే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు ఓ మంచి సందేశాన్ని ఇవ్వడం ఈ సినిమా స్పెషల్. బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ అనే ఆసక్తికర సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఎలాంటి సాగదీత లేకుండా బిలియనీర్ విజయ్ గురిమూర్తి నేపథ్యాన్ని తెలియజేస్తూ అలసు కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. ఇక సత్య పాత్రని పరిచయం చేయగానే.. తర్వాత ఏం జరుగుతుందనేది మనకు తెలిసిపోతుంది. అతని బ్రెయిన్‌ని విజయ్ బాడీలోకి ట్రాన్స్‌ప్లాంట్ చేసే సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి.
ఆ తర్వాత కొన్ని సన్నివేశాలు లెన్తీగా అని అనిపించినా.. ఇంటర్వెల్ సీన్ అదిరిపోవడంతో పాటు సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథ మొత్తం సిస్టర్ సెంటిమెంట్, సందేశం.. సామాజిక సేవ చుట్టు తిరుగుతుంది. పేదల కోసం ‘యాంటీ బికిలీ’అనే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు విజయ్ అనౌన్స్ చేసిన తర్వాత కథలో వేగం పెరుగుతుంది. చివర్లో వచ్చే కోర్టు సీన్స్ ఆకట్టుకుంటాయి. అదే సమయంలో సినిమా మొత్తంలో కొన్ని సన్నివేశాలు ప్రతిసారి రిపీట్ అవ్వడం.. అది కూడా ఎమోషనల్‌గా చూపించడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో స్క్రీన్ల్‌ప్లే మరింత బలంగా రాసుకుంటే బాగుండేది. ఓవరాల్‌గా ఈ బిచ్చగాడు కొన్ని చోట్ల ఏడిపిస్తాడు.. యాక్షన్స్‌తో అలరిస్తాడు.. అలాగే ఓ మంచి సందేశాన్ని అందిస్తాడు.
ఎవరెలా చేశారంటే..
ఒక సినిమాకు తానే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించడం అంటే అంత ఆషా మాషీ వ్యవహారం కాదు. కానీ విజయ్ ఆంటోని మాత్రం ఈ విషయంలో సక్సెస్ సాధించాడు. ఈ చిత్రంలో హీరోగా నటిస్తూనే దర్శకత్వంతో పాటు సంగీతాన్ని కూడా అందించాడు. అలా అని తన నటనలో ఎక్కడా తగ్గలేదు. ధనవంతుడైన విజయ్ గురిమూర్తిగా, బిచ్చగాడు సత్యగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించిన విజయ్ ... ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్ తో పాటు ఎమోషన్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు.
ఇక విజయ్ గురుమూర్తి ప్రియురాలు హేమగా కావ్యా థాపర్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. సినిమా ప్రారంభంలో వచ్చే పాటలో అందాల ప్రదర్శన చేసి అందరిని అలరించింది. ఇక నెగెటీవ్ షేడ్స్ ఉన్న అరవింద్ పాత్రకి దేవ్ గిల్ న్యాయం చేశాడు. సీఎంగా రాధా రవి, డాక్టర్‌గా హరీశ్ పేరడితో పాటు యోగిబాబు, జాన్ విజయ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఇక సాంకేతిక విషయాలకొస్తే.. విజయ్ ఆంటోని అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ప్రతి సీన్‌ని తెరపై చాలా రిచ్‌గా చూపించారు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment