బిగ్‌బాస్ నాల్గో సీజన్ నేటితో విజయవంతంగా వంద ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. టాప్ 5లోకి చేరుకున్న ఇంటిసభ్యుల మధ్య బిగ్‌బాస్ చిచ్చుపెట్టే ప్రయత్నం చేశాడు కానీ అది పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇక ట్రోఫీ గెల్చుకునేందుకు అనర్హురాలు ఎవరన్న ప్రశ్నకు అమ్మాయిల పేర్లే ఎక్కువగా వినిపించడంతో వారిలో గెలవాలన్న కసి మరింత పెరిగింది. సెంచరీ కొట్టిన బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే ఈ స్టోరీ మీద ఓ లుక్కేయండి.
మోనాల్ లేదని బాధపడిన అఖిల్
ఎప్పుడూ సినిమా పాటతో నిద్ర లేచే కంటెస్టెంట్లు ఇవాళ మాత్రం బిగ్‌బాస్ జర్నీ ర్యాప్ సాంగ్‌తో మేలుకున్నారు. వాళ్ల అరుపులు, మాటలు, ఏడుపులు వారికే కొత్తగా అనిపించాయి. ఇక ఈ మధ్య మోనాల్‌ను పట్టించుకోవడం మానేసిన అఖిల్ ఆమె లేని లోటును ఫీలయ్యాడు. తోడు లేకపోవడంతో పిచ్చి లేస్తుందని హారిక దగ్గర బాధ చెప్పుకున్నాడు. అనంతరం బిగ్‌బాస్ ముసుగు వెనుక దాగింది ఎవరు? అనే టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా ఇంట్లో మొదట ముసుగు ధరిస్తే దానిని బయట పెట్టింది ఎవరనే విషయాన్ని చెప్పాల్సి ఉంటుంది. టాస్క్ ప్రారంభం అవగానే ఇంటి సభ్యులు ముఖాన మాస్కు పెట్టుకుని డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. (చదవండి: గెలిస్తే రైతుల అప్పు తీరుస్తానన్న అరియానా)
అఖిల్ వల్ల పులిహోర కలపడం బయటపడింది
మ్యూజిక్ ఆగిపోగానే మొదట అభిజిత్ మాట్లాడుతూ.. నా కోపాన్ని ఇంట్లోకి జంటగా అడుగు పెట్టిన సోహైల్, అరియానా బయట పడేలా చేశారని చెప్పాడు. తనకు వంట వచ్చన్న విషయం అమ్మ రాజశేఖర్ వల్ల అందరికీ తెలిసిందని అరియానా చెప్పుకొచ్చింది. కోపం సోహైల్ వల్ల, కెమెరాల ముందు ఏడవడం అవినాష్ వల్ల బయట పడిందని పేర్కొంది. అనంతరం సోహైల్ మాట్లాడుతూ.. దివి వల్ల అగ్రెసివ్, అరియానా వల్ల వంట చేయడం బయటపడిందన్నాడు. అఖిల్.. నోయల్ వల్ల ఏడవడం, అభి వల్ల కోపం బయటపడిందని చెప్పాడు. హారిక.. సోహైల్ వల్ల కోపాన్ని దాచుకోలేకపోయానని చెప్పింది. అభి వల్ల పొజెసివ్‌నె, అఖిల్ వల్ల పులిహోర కలపడం, అరియానా వల్ల తనకున్న సహనం బయటపడిందని తెలపింది. (చదవండి: హారిక తమన్నా, మోనాల్ అనుష్క అంటోన్న అభి)
సోహైల్ మనసులో ఏదీ పెట్టుకోడు
తర్వాత ఒకరి గురించి మరొకరు మాట్లాడారు. సోహైల్ ఎంత కోప్పడతాడో అంతకంటే ఎక్కువ బాధపడతాడు. చిన్నపిల్లాడి మనస్తత్వం, మనసులో ఏదీ పెట్టుకోడని అరియానా చెప్పుకొచ్చింది. తర్వాత సోహైల్.. అరియానా గురించి చెప్తూ ఆమె లోపల ఉన్న ప్రేమను బయటపెట్టదని చెప్పాడు. తర్వాత అభి గురించి నేను చెప్తానంటే నేను చెప్తానని అఖిల్, హారిక పోట్లాడారు. చివరికి అఖిల్ అందుకుంటూ.. రిజర్వ్‌డ్‌గా కనిపిస్తాడు కానీ అభి ఎమోషనలేనని, దాన్ని బయటపెట్టట్లేదు అని చెప్పాడు. తర్వాత హారిక.. అఖిల్ గురించి చెప్తూ.. అతడిని కేర్ తీసుకునేందుకు ఒకరు కావాలని ఎదురు చూస్తాడు అని మోనాల్ గురించి పరోక్షంగా చెప్పుకొచ్చింది. అభిజిత్.. హారిక గురించి చెప్తూ ఆమె లోపల ఉన్న విషయాన్ని బయట పెట్టదని చెప్పాడు. తనకంటే ఎక్కువ ఇగో ఉంటుందన్నాడు. మోనాల్, అరియానాను బాగున్నావని మెచ్చుకుంటే నన్ను ఎందుకు పొగడలేదని దబాయించేదని చెప్పాడు. (చదవండి: బొమ్మ లొల్లి: శోకాలు పెట్టిన టామ్ అండ్ జెర్రీ)
ముగ్గురి దృష్టిలో అరియానా అనర్హురాలు
తర్వాత బిగ్‌బాస్ ఈ ఫైనలిస్టులకు మరో టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఫైనలిస్టులు తాము విజేత కావడానికి ఎందుకు అర్హులో చెప్తూ, అర్హత లేని వ్యక్తి పేరును చెప్పాల్సి ఉంటుంది. మొదట అభి మాట్లాడుతూ.. 'ఎక్కువ సార్లు నామినేట్ అయి సేఫ్ అయ్యాను. నేను ట్రోఫీ గెలిచేందుకు అర్హుడిని అనుకుంటున్నాను. హారికతో పోటీపడటం నేను తట్టుకోలేను. కాబట్టి నేను గెలవాలంటే హారిక అర్హురాలు కావద్దు' అని చెప్పాడు. తర్వాత అఖిల్.. టాస్కుల్లో హద్దులు దాటినందుకు అరియానా అనర్హురాలు అనుకుంటున్నానని చెప్పాడు. సోహైల్.. అరియానా, అభిజిత్ అనర్హులు అని, హారిక.. అరియానా అనర్హురాలు అని చెప్పింది. మెజారిటీ ఫైనలిస్టులు అరియానా విజేత అయ్యేందుకు అర్హురాలు కాదని తేల్చి చెప్పారు
అమ్మాయిలే ట్రోఫీ కొట్టాలి
చివరగా అరియానా మాట్లాడుతూ.. 'ఆటలో నా పేరు గుర్తుండిపోవడం బాగుంది. అందరి బుర్రల్లోకి నా పేరే వచ్చిందంటే నేను గేమర్‌నే. అంటే ట్రోఫీ తీసుకునేందుకు నేను అర్హురాలినే' అని చెప్పుకొచ్చింది. హారిక కొన్నిసార్లు సరైన నిర్ణయాలు తీసుకోలేదంటూ ఆమెను అనర్హురాలని ప్రకటించింది. ఈ టాస్క్ ముగిసిన తర్వాత హారిక, అరియానా దీని గురించి చర్చించుకున్నారు. అనర్హులుగా అమ్మాయిల పేర్లే రావడాన్ని తట్టుకోలేకపోయారు. దీంతో ట్రోఫీ ఎలాగైనా అమ్మాయే గెలవాల్సిందేనని అభిప్రాయపడ్డారు. (చదవండి: టోటల్ డ్యామేజ్ చేసుకుంటున్న అఖిల్)
Comments
Please login to add a commentAdd a comment