బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు మొదటి రోజును మించిపోయేలా రెండో రోజు కఠినమైన డీల్స్ ఇచ్చాడు. అన్నీ చేసేందుకు తలాడించిన కంటెస్టెంట్లు అరగుండు, సగం గడ్డం గీసుకునేందుకు మాత్రం వెనకడుగు వేశారు. ఇక టాస్క్‌లో అఖిల్‌ను కష్టపెడుతుంటే చూడలేకపోయిన మోనాల్ అతడికి సాయం చేసేందుకు ముందుకు రావడంతో అభిజిత్ ఆమెపై మండిపడ్డాడు. కోపాన్ని చంపుకుంటున్న సోహైల్‌తో ఇంటిసభ్యులు గొడవ పడుతూ అతడి సహనాన్ని పరీక్షిస్తున్నారు. నాగార్జునకు ఇచ్చిన మాట కోసం సోహైల్ ఎవరి మీదా అరవలేక ఏడుపు రూపంలో బాధను బయటకు కక్కాడు. మరి నేటి ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి..
బిగ్‌బాస్ నిన్న ఆరు డీల్స్ ఇవ్వగా అందులో అరియానా రెడ్ టీమ్, అఖిల్ బ్లూ టీమ్ చెరో మూడు పూర్తి చేశాయి. నేడు బిగ్‌బాస్ మరో ఐదు డీల్స్ ఇచ్చాడు. అవేంటంటే..
ఏడో డీల్: తల, గడ్డం సగం గీసుకోవాలి. చెల్లించాల్సిన నాణాలు: 40
మాస్టర్ ఈ టాస్క్ చేసేందుకు ముందుకు వచ్చాడు. అమ్మ చనిపోతే గుండు గీసుకోలేదని ఎమోషనల్ అయ్యాడు. అయితే అభిజిత్ వెళ్లి ఇది కెప్టెన్సీ కోసం కాదు, కెప్టెన్సీ పోటీదారుల కోసమేనని మాస్టర్‌తో చెప్పుకొచ్చాడు. మీరు గెలిచినా మళ్లీ కొట్లాడుకోవాల్సిందేనని తెలిపాడు. దీంతో మరోసారి ఆలోచనలో పడ్డ మాస్టర్ చేయలేనని చేతులెత్తేశాడు. అటు అరియానా టీమ్ కూడా ఈ డీల్‌ను తిరస్కరించడంతో బిగ్‌బాస్ దీన్ని రద్దు చేశాడు.
ఎనిమిదో డీల్: పేడ కలిగిన బాత్‌టబ్‌లో దిగి 100 బటన్లను వెతికి తీయాలి. చెల్లించాల్సిన నాణాలు: 30
అఖిల్ గంట మోగించడంతో అతని టీమ్‌లో దివి ఈ టాస్క్ చేసేందుకు ముందుకు వచ్చింది. అఖిల్ ఆమె దగ్గర నిలుచుని పాటలు పాడుతూ ఎంకరేజ్ చేశాడు.
తొమ్మిదో డీల్: ముఖానికి స్టాకింగ్ వేసుకుని దానిపై నుంచి అరటి పళ్లను తినాలి. చెల్లించాల్సిన నాణాలు: 10
అరియానా గంట మోగించడంతో అభిజిత్ ఈ చాలెంజ్ పూర్తి చేసేందుకు సిద్ధమయ్యాడు. కానీ ముఖానికి అంతటికీ స్టాకింగ్ పెట్టుకోకుండా అతి తెలివి ప్రదర్శించాడు. అయితే సంచాలకుడు అలా కుదరదని చెప్పడంతో అవినాష్ ముఖానికంతటికీ కప్పేసుకుని అరటిపండు నోటిలో కుక్కుకున్నాడు.
పదో డీల్: గార్డెన్ ఏరియాలో ఉన్న ఒక కుర్చీలో ఒక సభ్యుడు కూర్చుని ఉండాల్సి ఉంటుంది. మిగతావాళ్లు అతడిని లేపే వరకు వాష్ చేస్తుండాలి. బిగ్‌బాస్ తదుపరి ఆదేశాల వరకు అతను అందులోనే కూర్చోవాలి. చెల్లించాల్సిన నాణాలు: 25
గంట మోగించిన అఖిల్ ఈ టాస్కు చేసేందుకు రెడీ అయ్యాడు. తర్వాత అతడిని డిస్టర్బ్ చేసేందుకు అందరూ సాయశక్తులా ప్రయత్నించారు. మోనాల్ అతడి గడ్డానికి బ్రష్‌తో పేస్ట్ రుద్దింది. తర్వాత అభిజిత్, అవినాష్ అతడికి చన్నీళ్లతో తలస్నానం చేయించారు. అయితే అఖిల్‌ను ఇబ్బంది పెడుతున్నాడని నోయల్ అనడంతో అవినాష్ ఇది టాస్క్‌లో భాగమని సీరియస్ అయ్యాడు. ఇక కళ్లలోకి షాంపూ పోతుందని మోనాల్ నీళ్లు గుమ్మరించడంతో అభి, మెహబూబ్ ఏం చేస్తున్నావని మండిపడ్డారు. నోయల్ కూడా ముందుకొచ్చి అతనికి కళ్లు తుడుస్తుంటే సంచాలకుడిగా సోహైల్ గుంభనంగా ఉండటాన్ని అవినాష్ ప్రశ్నించాడు. (చదవండి: కథ వేరే ఉంటది: మాస్టర్‌కు సోహైల్ వార్నింగ్)
సంచాలకుడిగా నువ్వు కరెక్ట్ కాదు: అవినాష్
దీంతో సోహైల్ ఎవరూ అఖిల్ దగ్గరకు రావడానికి కూడా ఒప్పుకోలేదు. అయినా సరే అవినాష్ మాత్రం ఆవేశంతో ఊగిపోయాడు. దివి టబ్‌లో నుంచి ఒకసారి దిగినప్పుడు కూడా ఏమీ చేయలేదని విమర్శించాడు. సంచాలకుడిగా నువ్వు కరెక్ట్ కాదని అనేశాడు. 'బిగ్‌బాస్.. ఇలానే జరిగితే నేను టాస్కులు ఆడను, కావాలంటే ఎలిమినేట్ చేసేయండి, నాకు క్లారిటీ లేకపోతే బాగోదు' అని వార్నింగ్ ఇచ్చాడు. 'ఎవడు బే ఆడుతోంది సేఫ్ గేమ్' అంటూ నోరు జారాడు. దీంతో సోహైల్‌కు కోపం వస్తోందని గ్రహించిన అఖిల్ అతడిని పక్కకు తీసుకువెళ్లాడు. కానీ ఆవేశం పట్టలేక చేయిని కుర్చీకి బాదుకున్నాడు. నాగ్ సర్‌కు ప్రామిస్ ఇచ్చినందుకే తాను అరవట్లేదు అని తన బాధను చెప్పుకొచ్చాడు.
పదకొండో డీల్: ఎవరైనా ఒకరు తరువాతి వారం నేరుగా నామినేట్ అవ్వాలి. చెల్లించాల్సిన నాణాలు: 30
అఖిల్ ముందుగా గంట కొట్టడంతో అతని టీమ్‌లో నుంచి నోయల్ నామినేట్ అవుతానని చెప్పాడు.
ఇంతటితో డీల్స్ ముగిసిపోగా అఖిల్ 'రెడ్' టీమ్ గెలిచినట్లు సోహైల్ ప్రకటించాడు. తర్వాత సోహైల్‌కు ప్లేటులో అన్నం పెట్టుకున్నాడే కానీ బాధతో ముద్ద దిగడం లేదు. ఇది గమనించి అఖిల్ దగ్గరకు వెళ్లగా సోహైల్ చంటి పిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకున్నాడు. 'అందరూ అన్నా కూడా పడుతున్నా, ఇంకా ఏం చేయాలి, నాకేం అర్థం కావట్లేద'ని దుఃఖించాడు. దీంతో అఖిల్ వెక్కి వెక్కి ఏడుస్తున్న అతడి కన్నీళ్లు తుడిచాడు. మెహబూబ్ దగ్గరుండి స్నేహితుడికి గోరు ముద్దలు తినిపించాడు. (చదవండి: నోయల్‌కు మోనాల్ హగ్: షాక్‌లో అభిజిత్)
గర్ల్‌ఫ్రెండ్ కావాలంటూ అఖిల్ పాటలు
తర్వాతి రోజు మధ్యాహ్నం వర్షంలో హారిక, దివి గొడుగు కింద ఆటలాడారు. మరోవైపు అవినాష్.. అరియానాతో కాసేపు చిలిపి సంభాషణలు జరిపాడు. అరియానాను దగ్గరకు రమ్మంటూ పిలిచి సైగలు చేయబోయాడు. సైగలేవీ వద్దు, డైరెక్ట్‌గా చెప్పు అని అరియానా వారించడంతో 'యూ సో కూల్' అని మరోసారి చెప్పుకొచ్చాడు. ఇక మోనాల్, అఖిల్ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నామన్న విషయాన్నే మర్చిపోయి మరో లోకంలో విహరించారు. ఒకరినొకరు కాసేపు ఆట పట్టించుకున్నారు. నాకో గర్ల్‌ఫ్రెండ్ కావాలి.. అని అఖిల్ పాట పాడాడు. తర్వాత మళ్లీ తనెప్పుడూ పాడే "మొన్న కనిపించావు, మైమరిచిపోయాను.." అంటూ పాట ఎత్తుకున్నాడు. (చదవండి: నామినేషన్స్ పిచ్చ లైట్: నోయల్)
రెండోసారి కెప్టెన్ అయిన నోయల్
బిగ్‌బాస్ కెప్టెన్సీ పోటీదారులకు "కొట్టు- తలతో ఢీ కొట్టు" అనే టాస్క్ ఇచ్చాడు. దీనికి అవినాష్ సంచాలకుడిగా వ్యవహరించాడు. తలకు బ్యాటు కట్టుకుని వారికి కేటాయించిన కలర్ బాల్స్‌ను నెట్‌లో వేయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో నోయల్ గెలవడంతో అతడు రెండోసారి కెప్టెన్ అయ్యాడు. కానీ అమీతుమీ టాస్క్‌లో నేరుగా నామినేట్ అయినందున తర్వాతి వారంలో అతడికి ఇమ్యూనిటీ లభించదని బిగ్‌బాస్ స్పష్టం చేశాడు. దీంతో నోయల్ తర్వాతి వారం నామినేషన్ నుంచి తప్పించుకోలేకపోయాడు. అనంతరం నోయల్.. మెహబూబ్‌ను రేషన్ మేనేజర్‌గా ప్రకటించాడు. (చదవండి: బిట్టు అని పిలవడం ఇష్టమేనా అని అడిగారు: సుజాత)
Comments
Please login to add a commentAdd a comment