బిగ్‌బాస్ నాల్గవ సీజన్‌లో నాలుగో కంటెస్టెంటు ఇంటి ముఖం పట్టే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే సూర్య కిరణ్, కరాటే కల్యాణి, దేవి నాగవల్లి ఎలిమినేట్ అయ్యారు. అయితే కొత్తగా వచ్చి చేరిన వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో కలిపి ప్రస్తుతం 16 మంది ఇంటిసభ్యులు ఉన్నారు. వీరిలో అభిజిత్, లాస్య, హారిక, సోహైల్, మెహబూబ్, కుమార్ సాయి, స్వాతి దీక్షిత్ నామినేషన్‌లో ఉన్నారు. అయితే అభిజిత్ అభిమానగణం దండిగానే ఉండటంతో ఓట్లు కూడా అంతే స్థాయిలో పడుతున్నాయి. దీంతో అతడు సేఫ్ జోన్‌లో ఉన్నాడు. అనవసర విషయాల్లో తలదూర్చకుండా సహనానికి నిలువెత్తు రూపంలా నిలుస్తోన్న లాస్యకూ ఎక్కువ ఓట్లే పడ్డాయి.
కెప్టెన్‌కు గండం తప్పినట్టే!
ఈ వారం సోహైల్ భీభత్సంగా ఆడేసి ఎక్కువ ఓట్లు వచ్చేలా చేసుకున్నాడు. హారిక కూడా ఎలిమినేషన్ దరిదాపుల్లో లేదు. మిగిలిందల్లా స్వాతి దీక్షిత్, కుమార్ సాయి, మెహబూబ్ దిల్‌సే. ఇందులో స్వాతి, కుమార్ ఇద్దరూ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లే. వచ్చినప్పటి నుంచి సోమరితనం ప్రదర్శిస్తూ వచ్చిన కుమార్ సాయి ఈ వారం అనూహ్యంగా కెప్టెన్‌గా నిలిచి తనను తిట్టిపోసిన వ్యక్తుల చేతులతోనే చప్పట్లు కొట్టించుకున్నాడు. సింపథీ ఓట్లు, దానికి తోడు కెప్టెన్ అయ్యాడు కాబట్టి అతడిని హౌస్ నుంచి పంపించే చాన్సులు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక స్వాతి దీక్షిత్ తన ఆట తానడకుండా ఉన్న కాయిన్లు అన్నింటినీ అభికి అప్పగించేసింది. వచ్చీరావడంతోనే గేమ్‌పై ఫోకస్ పెట్టలేకపోవడం కొంత మైనస్‌గా మారింది. (చదవండి: బిగ్‌బాస్: అభి కోసం ఆట త్యాగం చేసిన స్వాతి)
వచ్చిన వారానికే తిరుగుముఖం పట్టిన స్వాతి
అంతేకాక హౌస్‌లో ఆమెకు అప్పగించిన పని కూడా సరిగా చేయట్లేదని మిగతా కంటెస్టెంట్లు చర్చించుకుంటూనే ఉన్నారు. ఇంకా ప్రేక్షకులు ఆమెకు పెద్దగా కనెక్ట్ కాకపోవడంతో తక్కువ ఓట్లే పడ్డట్టు తెలుస్తోంది. దీంతో స్వాతి ఎలిమినేట్ అయ్యేందుకు ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. మిగిలింది మెహబూబ్.. నిజానికి చివరి వారమే వెళ్లాల్సింది కానీ చివరి నిమిషంలో అనూహ్యంగా దేవి నాగవల్లిని ఎలిమినేట్ చేశారు. ఈ వారంలో అదృష్టాన్నిచ్చే స్విచ్ కాయిన్ పోగొట్టుకోవడం, కావాలని మరీ అభిజిత్‌తో గొడవ పడటం వల్ల అతడిపై మరింత వ్యతిరేకత వచ్చింది. దీంతో మెహబూబ్ మళ్లీ డేంజర్ జోన్‌లోకి వచ్చాడు. దీంతో ఇతను కూడా వెళ్లిపోయేందుకు ఆస్కారం ఉందంటున్నారు. మరి ఈ వారం స్వాతి దీక్షిత్, మెహబూబ్‌లలో ఎవరు బిగ్‌బాస్ హౌస్‌కు గుడ్‌బై చెప్తారనేది వేచి చూద్దాం.. (చదవండి: దటీజ్ దేవి: మాస్టర్‌నే ఏడిపించేసింది)
Comments
Please login to add a commentAdd a comment