
Bigg Boss Telugu 5 Promo: బుల్లితెర హిట్ షో బిగ్‌బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ల గొడవలకు హద్దు లేకుండా పోతోంది. కిచెన్‌లో, పనుల పంపకాల్లో, బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్‌లలో అన్ని చోట్లా వాదులాటకు దిగుతూ ప్రేక్షకులకు తలనొప్పిగా మారుతున్నారు హౌస్‌మేట్స్. దీంతో వీరి గొడవలకు మూలాలేంటో తెలుసుకుని, వారిని సరిదిద్దేందుకు వీకెండ్ ఎపిసోడ్ ద్వారా నాగ్ సిద్ధమయ్యాడు. పనిలో పనిగా వారి అసలు స్వరూపాలను కూడా ప్రేక్షకుల ముందుంచే ప్లాన్ చేశాడు. తాజాగా రిలీజైన ప్రోమోలో నాగ్ ఇంటిసభ్యులకు.. ఎవరితో సెట్? ఎవరితో కట్? అనే టాస్క్ ఇచ్చాడు.
ముందుగా శ్వేత వర్మ మాట్లాడుతూ.. 2017లో అమ్మను కోల్పోయాను. ఇక్కడ యానీ మాస్టర్‌తో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను అంటూ ఆమెతో సెట్ అని చెప్పకనే చెప్పింది. ఆ తర్వాత సింగర్ శ్రీరామచంద్ర.. శ్వేత వర్మ సెట్ అని పేర్కొన్నాడు. ఎవరితో బంధం కట్ చేసుకోవాలన్న విషయంలో లోబో, శ్రీరామచంద్ర.. కాజల్ ఫొటోలను చించేసినట్లు తెలుస్తోంది. ఇక సరయూ.. సిరి ఫొటోను చించేస్తూ.. 'ఇతరుల సహకారంతో గేమ్ ఆడటం చాలా ఈజీ. కానీ ఎవరి సహకారం లేకుండా ఆడటం చాలా కష్టం, అది ఆడి చూపించు' అని చెప్పుకొచ్చింది.
ఆమె మాటలతో షాకైన సిరి.. ఏ రోజైనా గెలిపించమని చెప్పానా? అని ప్రశ్నిస్తూనే కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె కంటతడికి కరిగిపోని సరయూ.. 'మీరాడే ఆటలకు నేనూ రోజు ఏడవాలి' అని తిరిగి బదులిచ్చింది. వీరిద్దరూ తన ముందే ఈ రేంజ్‌లో మాటల యుద్ధానికి దిగడాన్ని చూసిన నాగ్.. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదో జరిగుంటుందని అనుమానపడ్డాడు. మొత్తానికి ఈరోజు కామెడీ డోస్ కంటే కూడా ఏడుపులు, పెడబొబ్బలే ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది. మరి ఈ ఎపిసోడ్ చూడాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment