సాక్షి, భద్రాచలం అర్బన్: ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్‌లో ఆదివారం రాత్రి ముగిసిన బిగ్‌బాస్ షో విజేతగా నగరానికి చెందిన అరుణ్ రెడ్డి (సన్నీ) విజేతగా నిలిచారు. జిల్లా వాసి కావడంతో ఫైనల్ షోను అభిమానులు, జిల్లావాసులు అనేకమంది ఆసక్తిగా చూశారు. గెలిచాక పలుచోట్ల అభిమానులు సంబరాలు చేసుకున్నారు. సన్నీ తల్లి కళావతి స్టాఫ్‌నర్సుగా ఖమ్మంలో విధులు నిర్వర్తించారు. ఇద్దరు అన్నయలు ఉజ్వల్, స్పందన్ ఉన్నారు. ఇతను నిర్మల్ హృదయ హైస్కూల్‌లో పాఠశాల విద్య, ఖమ్మం స్టడీ సర్కిల్‌లో సీఈసీ గ్రూపుతో ఇంటర్ ఫస్టియర్ చదివారు.
విజేతగా నిలిచిన ఖమ్మంకు చెందిన సన్నీ
అనంతరం తల్లి వృత్తి రీత్యా కరీంనగర్‌కు బదిలీ అవ్వడంతో సెకండియర్ అక్కడ పూర్తి చేశారు. బాల్యమంతా ఇక్కడే గడవడంతో జిల్లాతో విడదీయలేని అనుబంధం ఉంది. స్నేహితులు, బంధువులు ఉండడంతో జిల్లాలో బిగ్‌బాస్ షోను ఎంతో ఆసక్తిగా వీక్షించారు.
చదవండి: (బిగ్‌బాస్ విన్నర్ సన్నీ ఏమేం గెలుచుకున్నాడంటే?)
ఓటింగ్ ఫ్లెక్సీలు..
సన్నీకి ఓటింగ్ చేయాలంటూ కోరుతూ నగరంలోని ప్రధాన కూడళ్లలో అతడి స్నేహితులు వారం పది రోజుల కిందటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి అధికంగా ఓటింగ్ నమోదైనట్లు తెలిసింది. జిల్లా వాసి కావడంతో ఆయన గెలుపొందాలని పలువురు ఆకాంక్షించి, ఉత్కంఠగా వీక్షించారు. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టమని, వినాయక మండపాల వద్ద, ఈవెంట్లలో ఎంతో ఉత్సాహంగా వేసేవాడని మిత్రులు తెలిపారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
హైదరాబాద్ వెళ్లాక కొంతకాలం మీడియా రిపోర్టర్‌గా చేశారు. ఆ తర్వాత సీరియల్ అవకాశాలను అందిపుచ్చుకున్నారు. బిగ్‌బాస్ షోలో సన్నీని చూశాక..అతడిని గుర్తించిన వాళ్లు మనోడే, మన జిల్లా వాసే అని..ప్రత్యేక అభిమానం పెంచుకున్నారు. ఫైనల్ దశకు చేరడం, చివరకు విజేతగా నిలవడంతో ఆయన అభిమానులు, బంధువులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
మిత్రుల సందడి
ఆదివారం రాత్రి బిగ్‌బాస్ షో విజేతగా సన్నీని ప్రకటించాక అతడి మిత్రులు పలువురు కేరింతలు కొట్టారు. విన్నర్ సన్నీ..అంటూ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. సినిమాల్లోకి రావాలని అనేవాడని, పట్టుదలతో ఆ రంగంవైపు అడుగులు వేసి సీరియళ్లలో నటిస్తున్నాడని తెలిపారు. త్వరలోనే సన్నీని ఖమ్మంకు తీసుకొచ్చేందుకు సన్నిహితులు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment