అద్దం ముందు గంటలతరబడి నిలబడి రెడీ అయ్యే అమ్మాయిలందరో! అందాన్ని కాపాడుకోవడం కోసం, అందంగా కనిపించడం కోసం తహతహలాడిపోతుంటారు. సెలబ్రిటీలైతే ఈ విషయంలో ఒక మెట్టు ఎక్కువే ఉంటారు. చర్మ రక్షణ కోసం వారు సమయం, ఖర్చు రెండింటినీ వాడేస్తారు. చర్మంపై చిన్న గీత పడ్డా తట్టుకోలేరు. అలాంటిది బిగ్‌బాస్ బ్యూటీ, నటి, సింగర్ సోఫియా హయత్‌కు పెద్ద కష్టం వచ్చిపడింది.
పొట్టపై మచ్చతో ఫోటోషూట్
సోఫియా కడుపులో 7 సెంటిమీటర్ల కణతి తయారవడంతో వైద్యులు ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. ఆపరేషన్ అనంతరం పొట్టపై పొడవాటి కుట్లు వేశారు. ఈ కుట్లను చూపిస్తూ చిన్నపాటి ఫోటోషూట్ చేసింది సోఫియా హయత్. తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ.. 'నేను ఈ సమస్య నుంచి సక్సెస్‌ఫుల్‌గా బయటపడినందుకు సంతోషంగా ఉంది. ఈ ఆపరేషన్ తర్వాత నా శక్తి అంతా నాకు తిరిగి లభించింది. నా పొట్టలో ఉన్న ఏడు సెం.మీ. కణతిని తీసేశారు. కానీ కోలుకోవడానికి చాలా సమయం పడుతోంది.
నాకు ఫ్యామిలీ లేదు
నాకిప్పుడు మానసిక ధైర్యం కూడా ముఖ్యం. నా శరీరం నడవడానికి, నిద్రించడానికి, బెడ్‌పై నుంచి లేవడానికి, ఏదైనా పట్టుకోవడానికి, ఆఖరికి బాత్రూమ్‌కు వెళ్లడానికి కూడా సహకరించడం లేదు. నాకంటూ ఎవరూ లేరు కాబట్టి నేనే ఎలాగోలా మ్యానేజ్ చేయాలి. కానీ నాకంటూ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. లేడీ క్లాడియా, స్టర్మ్ ఆస్పత్రిలో నా వెంటే ఉన్నారు. వీళ్లే నా నిజమైన కుటుంబం. వాళ్లను నేను ఎంతగానో ప్రేమిస్తున్నానో వాళ్లు కూడా అంతే ప్రేమను తిరిగిస్తున్నారు.
శరీరం వణికిపోతోంది
ఆస్పత్రిలో నేను ఐదురోజులున్నాను. మూడు వారాలు బెడ్ రెస్ట్ ఇచ్చారు. నేను ఒక్కదాన్నే కావడంతో పక్కింటివాళ్లు నాకు కొంత సాయం చేశారు. కాస్త బయటకు వెళ్లి నడుద్దామనుకున్నప్పుడు నా పనిమనిషి సాయపడింది, అయితే నాలుగడుగులు వేయగానే నా శరీరం వణికిపోయింది. నేను ఎప్పుడూ ఫిట్‌గా, స్ట్రాంగ్‌గా ఉండేదాన్ని. అలాంటిది ఇప్పుడు కనీసం నడవలేకపోతున్నాను. ఇలాంటి సందర్భాల్లోనే మనుషుల నిజస్వరూపాలు కూడా బయటపడతాయి. ఎవరిది నిజమైన ప్రేమ, ఎవరు ఫేక్ అని తెలుసుకున్నాను. చాలామందికి నేను డబ్బిచ్చాను, రకరకాలుగా సాయం చేశాను. కానీ వాళ్ల నుంచి నాకేదీ తిరిగిరాలేదు. అలాంటివాళ్లకు దూరంగా ఉండటమే నయం అని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment