
బుల్లితెర సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన రోహిణి తర్వాత బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకుంది. జబర్దస్త్‌లోనూ తన కామెడీ టైమింగ్, పంచులతో కమెడియన్‌గా రాణిస్తోంది. బుల్లితెరకే పరిమితం కాకుండా అటు వెండితెరపైనా సత్తా చాటుతోంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. ఇటీవల రోహిణి ఆస్పత్రిలో చేరింది. తన కాలు సర్జరీ కోసం ఆస్పత్రికి వెళ్లినట్లు పేర్కొంది. ఈ మేరకు రౌడీ రోహిణి అనే తన యూట్యూబ్ ఛానల్‌లో వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో తన ఆరోగ్య పరిస్థితిని వెల్లడించింది.
'2016లో నాకు యాక్సిడెంట్ అయింది. అప్పుడు నేను బెడ్ పై నుంచి లేవలేని పరిస్థితి. అమ్మే నన్ను దగ్గరుండి చూసుకుంది. ఆ సంఘటన గుర్తొస్తే ఇప్పటికీ కన్నీళ్లొస్తాయి. యాక్సిడెంట్‌లో నా కాలు ఫ్రాక్చర్ అయితే రాడ్డు వేశారు. షూటింగ్‌లతో బిజీబిజీగా ఉండటంతో ఇంతవరకు ఈ రాడ్ తీయించలేదు. డ్యాన్స్ చేసేటప్పుడు రాడ్ వల్ల కొన్ని మూమెంట్స్ చేయలేకపోయేదాన్ని. చాలా సంవత్సరాలవుతోందని రాడ్డు తీయించడానికి ఆస్పత్రికి వెళ్లాను' అని చెప్పుకొచ్చింది.
ఆస్పత్రికి వెళ్లి అన్నిరకాల పరీక్షలు చేయించుకుంది రోహిణి. రాడ్ తీయడం కోసం ఆమెకు మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. తీరా రాడ్డు లోపల కూరుకుపోయిందని, ఎంత ప్రయత్నించినా బయటకు రాలేదని వైద్యులు తెలిపారు. బలవంతంగా రాడ్డును బయటకు లాగితే ఎముక విరిగే ప్రమాదం ఉండటంతో దాన్ని అలాగే ఉంచేశామని పేర్కొన్నారు. దీంతో రాడ్డు తీసేస్తున్నారన్న ఆనందం ఆమెకు ఎంతోకాలం నిలవలేదు.
Comments
Please login to add a commentAdd a comment