
"పల్లెకు పోదాం ఛలో ఛలో" టాస్కు బిగ్‌బాస్ చరిత్రలోనే బోరింగ్‌గా నిలిచిపోయేటట్లు కనిపిస్తోంది. ఈ టాస్కులో పాత్రల చిత్రీకరణ బాగానే ఉన్నా కంటెస్టెంట్ల పర్ఫామెన్స్ మరీ నీరసంగా ఉంది. ఒక్క సోహైల్ మాత్రం గ్రామపెద్దగా ఒదిగిపోయి పల్లెటూరు యాస మాట్లాడుతూ పాత్రకు న్యాయం చేశాడు. కానీ మిగతా ఇంటి సభ్యులు ఎవరూ ఆయన పెద్దరికానికి గౌరవం ఇవ్వకపోవడం గమనార్హం. కొందరు కంటెస్టెంట్లు పల్లె యాస మాట్లాడేందుకు ప్రయత్నించినా అది ఎబ్బెట్టుగా అనిపించింది. మరికొందరైతే 'రాని పని రాజా పని' అన్నట్లుగా పల్లెటూరి యాస మాట్లాడేందుకు బొత్తిగా ప్రయత్నించనేలేదు.
పుకార్లు పుట్టించే పోకిరీ పిల్ల హారిక సీక్రెట్ టాస్క్ ఒక్కటే కొద్దో గొప్పో నయం అనిపించింది. అమ్మ రాజశేఖర్ మీద కాఫీ గుమ్మరించడం, అవినాష్‌కు కోపం తెప్పించడం, మెహబూబ్ పేరును లిప్‌స్టిక్‌తో రాయడం వంటి మూడు హత్యలు చేయాలని బిగ్‌బాస్ హారికను ఆదేశించాడు. వెంటనే ఆమె మాస్టర్ మీద కాఫీ పోసి ఏమీ తెలీనట్లుగా అమాయకత్వం ప్రదర్శించింది. ఇది చూసి అక్కడే ఉన్న అభికి అనుమానం వచ్చింది. ఆఖరికి మాస్టర్ కూడా ఇది టాస్క్ కావచ్చేమో అనేశాడు. కానీ అంతలోనే హారిక టాపిక్ డైవర్ట్ చేయడంతో దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. (చదవండి: సంకేతాలిచ్చిన బిగ్‌బాస్: మాస్టర్ ఎలిమినేట్?!)
నేడు రెండో హత్య చేసేందుకు హారిక నడుం కట్టింది. నవ్వించే అవినాష్ నిప్పులు చెరిగేలా రెచ్చగొట్టింది. పాన్ షాపు మీద కావాలని దౌర్జన్యం చేసింది. అక్కడున్న వస్తువులను నేలపైకి విసిరి నెట్టింది. దీంతో అవినాష్‌కు బీపీ పెరిగింది. దీనికి తోడు అఖిల్ కూడా పాను షాపును చిందరవందర చేయడంతో అవినాష్ తన షాపునే నేలమట్టం చేశాడు. తమాషా చేస్తున్నారా? అని అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. అరవకు, నాకు కూడా బరాబర్ వాయిస్ వస్తది అంటూ హారిక అతడిని మరింత రెచ్చిగొట్టింది. ఈ గొడవలో అఖిల్ దూరి తనకు తెలియకుండానే హారిక టాస్కు విజయవంతం అయ్యేందుకు దోహదపడ్డాడు. కాగా ఈ సీజన్‌లో తొలి సీక్రెట్ టాస్కును అవినాష్ విజయవంతంగా పూర్తి చేశాడు. హోటల్ టాస్కులో హోటల్ సిబ్బందిగా ఉంటూనే ఆ టీమ్ గెలవకుండా కృషి చేశాడు. ఇప్పుడు హారిక కూడా బిగ్‌బాస్ ఇచ్చిన మూడు హత్యలను పూర్తి చేసి కెప్టెన్సీ పోటీదారులుగా నిలవనున్నట్లు స్పష్టమవుతోంది. (చదవండి: అఖిల్ మాటిచ్చాడు, ఎవర్నీ లవ్ చేయడు)
Comments
Please login to add a commentAdd a comment