చివరి ఓటు అప్పీల్ ఛాన్స్ పొందేందుకు గౌతమ్, నిఖిల్ హోరాహోరీగా ఆడారు. అటు ఓంకార్ హౌస్‌లోకి వచ్చి తన ఇస్మార్ట్ జోడీకోసం ఓ జంటను బుక్ చేసుకుని వెళ్లాడు. మరి మౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (డిసెంబర్ 6) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..
రంగు పడుద్ది
గత వీకెండ్‌లో గోల్డెన్ టికెట్ పొందిన నిఖిల్, రోహిణి, గౌతమ్‌కు ఓట్ అప్పీల్ గేమ్‌లో పాల్గొనేందుకు చివరి ఛాన్స్ ఇచ్చాడు. ముందుగా కేక్ గేమ్ పెట్టాడు. కేక్‌పై ఉన్న ఎనిమిది నెంబర్ కిందపడకుండా కేక్ కట్ చేయాలన్నాడు. ఈ ఆటలో రోహిణి ఓడిపోయింది. నిఖిల్, గౌతమ్‌కు రంగుపడుద్ది అనే ఛాలెంజ్ ఇచ్చాడు. ప్రత్యర్థి టీ షర్ట్‌పై ఎవరు ఎక్కువ రంగు పూస్తే వారే విజేతగా నిలుస్తారు. ఈ గేమ్‌లో కొట్టుకుంటూ తోసుకుంటూ, లాగుతూ, ఈడడ్చుకెళ్తూ భీకరంగా ఆడారు.
కొట్టుకున్న గౌతమ్, నిఖిల్
మొదటి రౌండ్‌లో గౌతమ్ గెలిచాడు. రెండో రౌండ్ అయిపోయేసరికి గౌతమ్ కొడుతున్నాడని నిఖిల్ ఆరోపించాడు. నేను కావాలని కొట్టలేదు, నీకు తగిలిందనగానే సారీ చెప్పాను. మరి నువ్వు నన్ను లాక్కెళ్లలేదా? అని ప్రశ్నించాడు. పక్కకెళ్లి కూసోబే అని నిఖిల్ అనడంతో గౌతమ్.. బే అని ఎవడ్ని అంటున్నావ్? ఎక్కువ తక్కువ మాట్లాడకు అని మండిపడ్డాడు. ఆడే విధానం తెలియదు, ముఖం మీద కొట్టావ్.. అని నిఖిల్ రెచ్చిపోయి మాట్లాడుతూనే ఉన్నాడు.
నలిగిపోయిన ప్రేరణ
వీళ్లిద్దరికీ సర్ది చెప్పలేక సంచాలకురాలు ప్రేరణ మధ్యలో నలిగిపోయింది. మొన్న నేను నోరు జారినప్పుడు హౌస్ అందరూ నన్ను తప్పని వేలెత్తి చూపారు.. మరి ఇప్పుడు నిఖిల్ నోరు జారితే ఎవరూ ఎందుకు స్పందించట్లేదని గౌతమ్ హౌస్‌మేట్స్‌ను ప్రశ్నించాడు. అందుకు వాళ్లు.. అమ్మాయిని వాడుకుంటున్నావ్? అనడం చాలా పెద్ద తప్పు కాబట్టే ఆరోజు మాట్లాడాల్సి వచ్చిందన్నారు. ఇకపోతే రెండు, మూడవ రౌండ్స్‌లో నిఖిల్ గెలిచాడు. ఎక్కువ రౌండ్లు నిఖిల్ గెలవడంతో ప్రేక్షకులను ఓట్లు అడిగే చాన్స్ పొందాడు.
ఎప్పటికీ రుణపడి ఉంటా
నిఖిల్ మాట్లాడుతూ.. ఇన్నివారాలు నన్ను సేవ్ చేసినందుకు థాంక్యూ.. నేనెంతో కష్టపడ్డా.. మీరూ అంతే ఇష్టపడి నన్ను సేవ్ చేశారు. నేను విజేత అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకోసం ఇంకా ఎంతైనా కష్టపడతాను. ఈ ఒక్కసారి మీ నిఖిల్‌ను గెలిపించండి. ఇప్పటికీ, ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. తెలిసో తెలియక తప్పులు చేశాను. అందుకు నన్ను క్షమించండి. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ నిఖిల్ ఒకేలా ఉంటాడు.
ఓటు వేయండి
మీ ప్రేమాభిమానాలు కూడా ఎప్పటికీ ఇలాగే ఉంటాయని నా గట్టి నమ్మకం. ఈ షో గెలవాలంటే మీ ఓట్లు కావాలి. తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను మీ ఇంటిబిడ్డగా భావించి ఓటు వేయమని కోరుతున్నాను అని అభ్యర్థించాడు. తర్వాత యాంకర్ ఓంకార్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఇస్మార్ట్ జోడీ మూడో సీజన్ రాబోతుందంటూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. తర్వాత అతడు కంటెస్టెంట్లతో చిన్న గేమ్ ఆడించాడు. నీ పార్ట్‌నర్ కోసం నీలో ఏ లక్షణాన్ని దూరం చేస్తావని అడగ్గా నిఖిల్ తన చిరాకును వదిలేస్తానన్నాడు.
బిగ్‌బాస్ ఇస్మార్ట్ జోడీ
తర్వాత అందర్నీ జంటలుగా విడగొట్టి డ్యాన్సులు చేయించాడు. అయితే వీళ్లందరూ పేపర్ పైన స్టెప్పులేయాల్సి ఉంటుంది. ప్రతి రౌండ్‌కు ఆ పేపర్ సైజ్‌ను తగ్గిస్తూ ఉంటారు. పేపర్ దాటి అడుగు బయట పెట్టిన జంట అవుట్.. అలా మొదటి రౌండ్‌లో గౌతమ్-రోహిణి అవుట్ కాగా తర్వాత నిఖిల్- విష్ణు ఎలిమినేట్ అయ్యారు. ప్రేరణ నబీల్‌ను ఎత్తుకుని మరీ డ్యాన్స్ చేసి గెలిచేసింది.
పెళ్లి వీడియో చూసుకుని మురిసిపోయిన ప్రేరణ
నబీల్ తనకు తందూరి చికెన్ బర్గర్+ సాఫ్ట్ డ్రింక్ కావాలని కోరగా.. ప్రేరణ.. తన పెళ్లి వీడియో అందరికీ చూపించాలని ఉందంది. నబీల్‌ను ఒప్పించి ప్రేరణ తన పెళ్లి వీడియో వచ్చేలా చేసింది. తన పెళ్లి క్షణాలను చూసుకుని ఆమె భావోద్వేగానికి లోనైంది. ఇంతలో ఓంకార్ ట్విస్ట్ ఇచ్చాడు. నీ కోరిక తీర్చినందుకుగాను నువ్వు, నీ భర్తతో ఇస్మార్ట్ జోడీలో తప్పకుండా పాల్గొనాలంటూ మాట తీసుకున్నాడు. అందుకామె సంతోషంగా ఒప్పుకుంది.
Comments
Please login to add a commentAdd a comment