
తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్‌లోనే ఇదొక బెస్ట్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. రోహిణిని గడ్డిపరకలా తీసిపారేసింది విష్ణు.. అసలు పరిగెత్తడం వచ్చా.. అని వంకరగా చూస్తూ బాడీ షేమింగ్ చేశాడు పృథ్వీ. ఫ్రాక్చర్ అయిన కాలుతోనే గేమ్ ఆడి ఈ ఇద్దరినీ ఓడించి లేడీ టైగర్ అనిపించుకుంది రోహిణి. మరిన్ని విశేషాలు నేటి (నవంబర్ 22) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..

యష్మి బకరా
మెగా చీఫ్ కంటెండర్లకు బిగ్‌బాస్ ఆటోలో ప్రయాణం అనే టాస్క్ ఇచ్చాడు. చివరి వరకు ఆటోలో ఉన్నవారు ఎక్కువ పాయింట్లు గెలుస్తారన్నాడు. యష్మి, పృథ్వీ, విష్ణు కలిసి. తేజ, రోహిణిని తోసేశారు. పృథ్వీ, విష్ణు కలిసి యష్మిని తోయడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. నీకు సపోర్ట్ చేస్తే నువ్వేమో తోశావ్.. అలాంటప్పుడు నాకు సాయం చేస్తానని ఎందుకన్నావ్? మీరిద్దరూ ఎలా ఆడతారో చూస్తా.. అని నిలదీసింది.

నీ ఒంట్లో ఫైర్ లేదు: విష్ణు
అందుకు రోహిణి.. వాళ్లు ఆడరు, ఒకరికోసం ఒకరు కాంప్రమైజ్ అవుతారంది. ఇంకేం చూస్తావులే, దిగు అని విష్ణుప్రియకు చెప్పింది. దీంతో విష్ణుకు బీపీ వచ్చింది. నీది నువ్వు చూసుకో, నీ ఒంట్లో ఫైర్ లేదు, పక్కనోళ్ల గేమ్ గురించి మాట్లాడకు. నువ్వు జీరో అని చీప్‌గా మాట్లాడింది. రోహిణి కూడా నువ్వే జీరో అనడంతో.. నీకన్నా ఎక్కువ వారాలున్నానంది. ఎందుకున్నావో నీకూ తెలుసు, నీ ప్లాన్ వర్కవుట్ అయింది, అందుకే ఉన్నావని రోహిణి ఉన్నమాట అనేసింది.

విష్ణు బండారం బట్టబయలు
దీంతో విష్ణు.. నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుందని నోరు జారింది. ఆ మాటతో రోహిణి.. ఫస్ట్ నిఖిల్‌కు ట్రై చేశా, వర్కవుట్ కాలేదు.. తర్వాత పృథ్వీకి ట్రై చేశా అని నువ్వే కదా చెప్పావు అని తన బండారం బయటపెట్టేసింది. ఈ గొడవ చల్లారాక విష్ణుప్రియను తోసేసి పృథ్వీ గెలిచాడు. టాస్క్ అయ్యాక విష్ణు.. రోహిణితో మళ్లీ వాదనకు దిగింది. తనే ఒప్పని నిరూపించుకోవాలని చూసింది. కానీ తన దగ్గర పప్పులు ఉడకనివ్వలేదు రోహిణి.

నోరు అదుపులో పెట్టుకో
ఫైర్ లేదు, జీరో, క్యారెక్టర్ అంటూ నోరు జారుతున్నావ్.. నోరు అదుపులో పెట్టుకో అని హెచ్చరించింది. అనంతరం తెడ్డు మీద గ్లాస్ అనే టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో రోహిణి గెలవగా పృథ్వీ, తేజ, విష్ణుప్రియ, యష్మి తర్వాతి నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌గా చివరి స్థానాల్లో ఉన్న యష్మి, విష్ణుప్రియను గేమ్ నుంచి ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్... పృథ్వీ, తేజ, రోహిణికి ఫైనల్ గేమ్ పెట్టాడు.

సంచాలక్ కూడా గేమ్ ఆడింది!
ఈ ఛాలెంజ్‌లో కంటెండర్లు.. కుండను కిందపడకుండా చూసుకోవాలి. బజర్ మోగినప్పుడల్లా హౌస్‌మేట్స్‌లో ఒకరు.. మెగా చీఫ్ అవకూడదనుకుంటున్న కంటెస్టెంట్ కుండలో రెండుసార్లు ఇసుక పోయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో యష్మి సంచాలక్‌గా వ్యవహరించింది. సంచాలక్ అయినప్పటికీ మధ్యమధ్యలో తను వెళ్లి అందరి కుండలు బ్యాలెన్స్ చేస్తానంటూ కేవలం రోహిణి కుండలోనే పదేపదే ఇసుక పోయడం గమనార్హం.

రోహిణి ఎమోషనల్
ఈ గేమ్‌లో అద్భుతంగా ఆడిన రోహిణి.. తేజ, పృథ్వీలను మట్టికరిపించింది. ఫ్రాక్చర్ అయిన కాలుతో రెండున్నర గంటలపాటు కుండను బ్యాలెన్స్ చేసింది. నేను మెగా చీఫ్ అయ్యాను.. ఆడి గెలుచుకున్నా అంటూ రోహిణి ఏడ్చేసింది. ఇక టాస్క్ మధ్యలో రోహిణిని నిఖిల్ పొగుడుతుంటే అవసరమా? అంటూ కన్నెర్రజేసిన విష్ణు.. చివర్లో మాత్రం నువ్వు హీరో అని అరవడం డ్రామాలాగే కనిపించింది.

బాధలో పృథ్వీ
ఒక్కసారి కూడా మెగా చీఫ్ కాలేకపోయినందుకు పృథ్వీ చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. ఇక చివరి మెగా చీఫ్ అయిన రోహిణి కోసం బిగ్‌బాస్ శివంగివే.. పాట ప్లే చేశాడు. బాడీ షేమింగ్ చేసిన పృథ్వీపై, జీరో అని హేళన చేసిన విష్ణుప్రియపై రోహిణి పైచేయి సాధించి తన సత్తా చూపించింది.


Comments
Please login to add a commentAdd a comment