ఫిజికల్ టాస్క్ వస్తే పృథ్వీకి తెలియకుండానే పూనకం వస్తుంది. మనుషుల్ని పిట్టల్లా విసిరేస్తూ, పురుగుల్లా నలిపేస్తుంటాడు. ఈ రోజూ ఇదే జరిగింది. ఈసారి నిఖిల్ తోడయ్యాడు. టాస్కులో ఈ దోస్తులిద్దరూ అరాచకం సృష్టించారు. మరి వీరితో పోటీపడిందెవరు? హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 24) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..
నిఖిల్, పృథ్వీ అరాచకం
బీబీ రాజ్యం ఛాలెంజ్ కొనసాగింపుగా నేటి ఎపిసోడ్ ప్రారంభమైంది. ఎనిమిది ధాన్యపు బస్తాలను తోపుడు బండిపై ఎవరు ముందుగా పెడతారో ఆ టీమ్‌కు రాజ్యంలో వ్యవసాయం దక్కుతుందన్నాడు. ఓజీ టీమ్ నుంచి నిఖిల్, పృథ్వీ విజృంభించి ఆడారు. వారిని అడ్డుకునేందుకు గౌతమ్, మెహబూబ్ చాలావరకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొట్టుకున్నారు, తోసేసుకున్నారు. నానా అరాచకం సృష్టించడంతో బిగ్‌బాస్ కొన్ని సెకన్లపాటు గేమ్‌ను పాజ్ చేశాడు.
అదుర్స్ అనిపించిన తేజ, అవినాష్
అలాగే ఈ ఆటలో పోటీదారులను మార్చుకోవచ్చని వెసులుబాటు కల్పించాడు. అలా గౌతమ్, మెహబూబ్ స్థానంలోకి అవినాష్, తేజ వచ్చారు. వీళ్లు కూడా తమ శక్తికి మించి ప్రయత్నించి ఆడారు. వాళ్లు ఎంతో కష్టపడి ఓ సంచిని బండిపై పెట్టారు. కానీ అది ముందు ఓజీ తోపుడు బండికి టచ్ అయిందంటూ వారికే పాయింట్ ఇస్తానని సంచాలకురాలు యష్మి వితండ వాదం చేసింది. ఒక్క బస్తా కూడా రాయల్ టీమ్‌ను పెట్టనివ్వకపోవడం నిఖిల్, పృథ్వీల శక్తికి నిదర్శనం.
మనలో ఒకరే విన్నర్
ఫైనల్‌గా ఈ గేమ్‌లో ఓజీ టీమ్ గెలవడంతో వ్యవసాయ భూమి గెలిచారు. అలాగే తన టీమ్‌లో నుంచి పృథ్వీని మెగా చీఫ్ కంటెండర్‌గా ప్రకటించారు. ఈ క్రమంలో కంటెండర్ అవ్వాలనుకున్న ప్రేరణకు, యష్మికి మధ్య గొడవ జరిగింది. ఈ ఇద్దరికీ సర్ది చెప్పిన నిఖిల్.. ఇది మన సీజన్.. మన టీమ్‌లోని ఒకరే ట్రోఫీ ఎత్తాలి. మనలో మనకు గొడవలొద్దు అని టీమ్ సభ్యులకు హితోపదేశం చేశాడు. ఓడిన రాయల్స్ టీమ్ నుంచి గంగవ్వను మెగా చీఫ్ కంటెండర్ పోస్టు నుంచి తప్పించారు.
కూతుర్ని తల్చుకుని హరితేజ ఎమోషనల్
వచ్చినప్పటినుంచి మేమే గెలిచాం అని రాయల్స్ ఫీల్ అవుతున్నారు. మనం మిగతా టాస్కులు గెలిచి ఆ పొగరును తగ్గించేయాలని ప్రేరణ.. నబీల్‌తో అంది. అన్నట్లుగానే తర్వాత టాస్కుల్లోనూ దూకుడు ప్రదర్శించారు. మరోవైపు హరితేజ.. తన కూతురు భూమిని తల్చుకుని ఎమోషనలైంది. అమ్మ గురించి బెంగపెట్టుకోకు, స్కూలుకు వెళ్లు, పిన్నితో ఆడుకో.. వీకెండ్‌లో నాన్న వస్తాడు. అమ్మమ్మ, తాతయ్య అందరూ ఉన్నారు, నీకోసం ఏడవట్లేదు. నువ్వు కూడా ఏడవొద్దంటూనే కన్నీళ్లు పెట్టుకుంది.
మళ్లీ ఓజీ టీమ్‌దే గెలుపు
బీబీ రాజ్యంలో సైన్యం, హాస్పిటల్‌ను పొందడానికి బిగ్‌బాస్ వైరల్ అటాక్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఓజీ టీమ్ నుంచి నిఖిల్, నబీల్ ఆడగా రాయల్ టీమ్ నుంచి గౌతమ్, తేజ ఆడారు. మరోసారి ఓజీ టీమ్ గెలిచి హాస్పిటల్, సైన్యం పొందింది. అలాగే తన టీమ్‌లో నుంచి నిఖిల్‌ను మెగా చీఫ్ కంటెండర్‌గా ప్రకటించారు. రాయల్స్ నుంచి గౌతమ్‌ను మెగా చీఫ్ కంటెండర్ రేసు నుంచి తప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment