మామూలుగా ఒక్క టికెట్ మీద ఒక సినిమానే చూడగలం. అలాగే వేరే టికెట్ మీద వేరే సినిమా చూడగలం. కాని అదే ఒక్క టికెట్ మీద డజనుకు పైగా సినిమాలు దాదాపు వంద రోజులు చూడగలిగితే అదే బిగ్ బాస్ కార్యక్రమం. మనం చూసే సినిమా సినిమాలకు ప్రత్యేకత కోరుకుంటాం. ఓ చిన్న సన్నివేశం కాని, అంతెందుకు కనీసం చిన్న ప్రదేశం కాని ఒక సినిమాలోది మరో సినిమాలో కనబడితే నానా యాగీ చేస్తాం. కాని బిగ్ బాస్ కార్యక్రమం మాత్రం ఇందుకు మినహాయింపు.
గడచిన 8 సీరిస్ లలో బిగ్ బాస్ కార్యక్రమ అంశంకాని, కంటెస్టంట్లు ఆడిన టాస్కులు కాని అంతెందుకు వాళ్ళున్న సెట్ అంతా ఒకటే. కాకపోతే సెట్‌కు కాస్త రంగులు మారుస్తారు. సీరీస్ కు కంటెస్టంట్లు మారతారు. అయినా ప్రతి సీరిస్ కు బిగ్ బాస్ కున్న ఆదరణ పెరుగుతుందే కాని తరగట్లేదు. బిగ్ బాస్ కార్యక్రమానికి ప్రేక్షక అభిమానం ఆకాశమంత ఎత్తయితే , విమర్శకుల దురభిమానం అంతరిక్షమంత ఎత్తు అని చెప్పవచ్చు.
ఈ వారం మెగా ఛీఫ్‌గా ఎంపిక (విష్ణుప్రియ) ఓ విడ్డూరమయితే వారం మధ్యలో గంగవ్వ హౌస్ ను తన నటనతో చేసిన హారర్ ఎపిసోడ్ ఓ అద్భుతమనే అనాలి. యధావిధిగా హొస్ లో కంటెస్టెంట్లు మూడు లవ్ ఎపిసోడ్లు నాలుగు ఫ్లర్టింగ్ ఎపిసోడ్లతో ప్రేక్షకులను అలరిస్తూనే వున్నారు.
వారాంతంలో దీపావళి స్పెషల్ ఎపిసోడ్‌గా ప్రసారమయిన ఫార్మెట్ కూడా పేలవంగా అనిపించింది. కాకపోతే కొత్త సినిమాల సెలబ్రిటీస్ తో కాస్త కళకళలాడించడానికి ప్రయత్నించాడు బిగ్ బాస్. వారమంతా కాస్త టాస్కులలో తన సత్తా చాటుతూ స్క్రీన్ స్పేస్ మిగతావారి కన్నాఎక్కువ షేర్ చేసుకున్నా మెహబూ్బ్‌కు మొండి చేయి చూపించి ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్.
ఈ వారం ఎపిసోడ్ ట్విస్ట్ ఎంటంటే అవినాష్ కూడా తాను అనారోగ్య కారణాలతో హౌస్ బయటకు వెళుతున్నట్టు ఎపిసోడ్ చివర ప్రోమోలో చూపించారు. పోయినసారి మన విశ్లేషణలో చెప్పుకున్నట్టు హౌస్‌లోని కంటెస్టెంట్లు తమ ఉనికి, ఉపాధి కోసం తమ ఆరోగ్యాలను కూడా లెక్కచెయట్లేదు. ఇన్ని జరుగుతున్నా బిగ్ బాస్ మాత్రం తన షో లాభాలను లెక్క పెట్టుకుంటూనే వున్నాడు. ఏదేమైనా అట్లుంటది బిగ్ బాస్‌తో.
- ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment