ప్రభాస్, పూజా హెగ్డే జంటగా కె. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాధేశ్యామ్’. వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేశారు అప్పటి ‘మైనే ప్యార్ కియా’ ఫేమ్ భాగ్యశ్రీ. ఈ సినిమాలో నటించడం గురించి భాగ్యశ్రీ మాట్లాడుతూ – ‘‘హీరోయిన్‌గా నా మొదటి సినిమా ‘మైనే ప్యార్ కియా’ (హీరోగా సల్మాన్ ఖాన్‌కి కూడా ఇది తొలి సినిమా). ఈ సినిమా తర్వాత మరికొన్ని సినిమాలు చేశాను. కెరీర్ బాగున్నప్పటికీ పెళ్లి చేసుకోవడానికి అది సరైన సమయం అని, అప్పుడు చేసుకుంటే మంచి ఫ్యామిలీ బాండింగ్ ఏర్పడుతుందని హిమాలయ్‌ని పెళ్లి చేసుకున్నాను. కుటుంబ బాధ్యతలు, పిల్లల పోషణతో బిజీగా ఉన్నందువల్ల సినిమాల్లో నటించలేదు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లయ్యారు. అందుకని నా భర్త, పిల్లలు తిరిగి నన్ను సినిమాల్లో నటించమని సపోర్ట్ చేస్తున్నారు.
దీంతో సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేశాను. ప్రభాస్ ‘రాధేశ్యామ్’, కంగనా రనౌత్ ‘తలైవి’ (తమిళనాడు మాజీ సీయం, ప్రముఖ నటి జయలలిత బయోపిక్) చిత్రాల్లో యంగ్ మదర్ క్యారెక్టర్స్ చేసే అవకాశాలు వచ్చాయి. అయితే కరోనా వల్ల ‘రాధేశ్యామ్’ విడుదల వాయిదా పడింది. ‘రాధేశ్యామ్’ వంటి సినిమాలో తల్లి పాత్ర చేసినందుకు గర్వంగా ఉంది. ప్రభాస్ గొప్ప నటుడు.. నిగర్వి కూడా. ఈ చిత్రనిర్మాతలు మేకింగ్ విషయంలో రాజీ పడలేదు. జార్జియాలో గడ్డకట్టే చలిలో షూటింగ్ జరిగినప్పుడు కూడా యూనిట్‌ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘బాలీవుడ్‌వారు ఇప్పుడు తెలుగు, తమిళ చిత్రాలవైపే చూస్తున్నారు. తెలుగు పరిశ్రమ నుంచి మంచి సినిమాలు వస్తున్నాయి. తెలుగులో మదర్ క్యారెక్టర్స్ మాత్రమే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న అన్ని పాత్రలు చేయాలని ఉంది’’ అని చెప్పుకొచ్చారు భాగ్యశ్రీ.
Comments
Please login to add a commentAdd a comment