సాక్షి, హైదరాబాద్: సినీ ప్రపంచం మరచిపోలేని నటుడు, నిర్మాత ఇర్ఫాన్ ఖాన్. ఆయన ఎంచుకున్న పాత్రలన్నీ దేనికదే ప్రత్యేకం. స్క్రీన్ మీద ఆ పాత్రలు తప్ప ఇర్ఫాన్ కనిపించడు. అంతటి విలక్షణమైన ప్రతిభ నటన ఆయన సొంతం. అలాంటి గొప్ప కళాకారుడి అకాల మరణం దురదృష్టకరం. కానీ వెండితెరపై ఆయన ఆవిష్కరించిన అద్భుత పాత్రలు ఎప్పటికీ సజీవమే. ఇర్ఫాన్ 55వ జయంతి (జనవరి,7) సందర్భంగా ‘సాక్షి’ డిజిటల్ నివాళులర్పిస్తోంది.
జనవరి 7, 1967న రాజస్థాన్ లోని జైపూర్‌లో ఇర్ఫాన్ ఖాన్ జన్మించారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ కరియర్‌లో ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లోనే కనిపించినప్పటికీ, పలు హాలీవుడ్, ఇతర భారతీయ భాషల్లో కూడా నటించారు. సహజమైన నటన, వైవిధ్య భరిత పాత్రలకు ఆయన పెట్టింది పేరు. 1988లో సలామ్ బాంబే సినిమాలో తొలిసారిగా నటించిన ఇర్ఫాన్, ది నేమ్‌సేక్, కమలాకీ మౌత్, జజీరే, దృష్టి, ఏక్ డాక్టర్ కీ మౌత్ లాంటి సినిమాలతో పాటు.. తెలుగులో మహేష్ హీరోగా నటించిన సైనికుడు మూవీలో నటించారు. హాలీవుడ్‌లో స్లమ్‌డాగ్ మిలియనీర్, ఎ మైటీ హార్ట్, జురాసిక్ వరల్డ్, లైఫ్ ఆఫ్ పై వంటి ఉత్తమ చిత్రాల్లో నటించి మంచి పేరును సంపాదించారు. పాన్ సింగ్ తోమర్ సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు.
ముఖ్యంగా లైఫ్ ఆఫ్ పై సినిమాతో పాపులర్ అయిన ఇర్ఫాన్ ఖాన్ సినీ కరియర్‌లో ప్రతీ సినిమా ఒక మైలురాయి లాంటిదనే చెప్పాలి. పాన్ సింగ్ తోమర్, లంచ్ బాక్స్, హైదర్, తల్వార్, మఖ్‌బూల్, పీకూ, ఇంగ్లీష్ మీడియం ఇటీవల ఓటీటీలో రిలీజ్ మర్డర్ ఎట్ తీసరీ మంజిల్ 302 లాంటి చిత్రాల్లో ఇర్ఫాన్ నటన అద్భుతం. పీకూ మూవీలో అమితాబ్‌కు పోటీపడి నటించి మెప్పించారు. అలాగే ఇర్ఫాన్ ఖాన్ అనగానే తల్వార్ మూవీలో సీబీఐ ఆఫీసర్ పాత్ర, కార్వాన్ లో షౌకత్ పాత్రను గుర్తు రాకమానవు. ఒక్కసారి ఆయన మూవీ చూస్తే ఆ పాత్ర ప్రేక్షకుడిని చాన్నాళ్లు వెంటాడుతుంది. కాలర్ పట్టి నిలదీస్తుంది. అలా నటనలో జీవితాన్ని ఆవిష్కరించి ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నటుడు ఇర్ఫాన్.
అసామాన్య ప్రతిభతో రాణిస్తున్న ఇర్ఫాన్‌ను కేన్సర్ బలితీసుకుంది. 2020, ఏప్రిల్‌లో ఆయన కన్నుమూశారు. తల్లి చనిపోయిన కొన్ని రోజులకే ఆయన కూడా తల్లి ఒడికి చేరిపోవడం అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇర్ఫాన్ ఖాన్ పెద్ద కుమారుడు బాబిల్ ఖాన్ మూవీల్లో నటించేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీనికి సంబంధించి ఫోటోషూట్ కూడా చేశాడు. కాగా కళా రంగంలో కృషి చేసినందుకు గాను భారత ప్రభుత్వం ఇర్ఫాన్ ఖాన్‌కు 2011లో పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది.
Comments
Please login to add a commentAdd a comment