Bollywood Melody Queen Asha Bhosle turns 89 - Sakshi
Sakshi News home page

Happy Birthday Asha Bhosle: 'లతా మంగేష్కర్‌ చాలా ఏళ్లు దగ్గరికే రానివ్వలేదు'

Published Wed, Sep 8 2021 8:27 AM | Last Updated on Wed, Sep 8 2021 12:35 PM

Bollywood Melody Queen Asha Bhosle Turns 89 - Sakshi

Asha Bhosle Turns 89: చిన్న వయసులో ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. పిల్లల తల్లయ్యి పుట్టింటికి చేరింది. అక్క లతా మంగేష్కర్‌ అనే మర్రి చెట్టు నీడ నుంచి జరిగి పాడటానికి పెనుగులాడింది. ఆమెను వాంప్‌ సింగర్‌ అన్నారు. ఆమెది లావుగొంతు అన్నారు. ఆమె అది తన గొంతు అంది. తన గొంతును నిలబెట్టడానికి గొప్ప యుద్ధమే చేసింది. ఇవాళ ఆమె విశ్రమిస్తున్న మహానది. సేద తీరుతున్న గాన సరోవరం. 89కి చేరుతున్న ఆశా భోంస్లేకు కొన్ని పల్లవుల చప్పట్లు కొన్ని చరణాల కరతాళాలు.

'సచిన్‌ టెండూల్కర్‌ను ఒకసారి ఎవరో అడిగారు: కొత్త కుర్రాళ్లు వస్తున్నారు... రిటైర్‌ అవ్వొచ్చు కదా. దానికి సచిన్‌ టెండూల్కర్‌ జవాబు: ఆశా భోంస్లే అన్నేళ్లు వచ్చినా అంత బాగా పాడుతున్నప్పుడు నాకేం తక్కువ?'

ఆశా భోంస్లే గురించి అందరికీ అంతా తెలుసు. అందరికీ అంతా తెలియదు. ఆశా భోంస్లే పాట అందరికీ అంతా తెలుసు. కాని అందరికీ ఆ పాట వెనుక ఆమె వదిలి వచ్చింది, దాటి వచ్చింది, అనుభవించి వచ్చింది తెలియదు. ఆశా భోంస్లేలా జీవించడం పోరాడటం కష్టం. ఇక ఆమెలా పాడటం... సరే... ఎలాగూ కష్టం.

ఆంఖోమే క్యాజీ రుపెహలా బాదల్‌
బాదల్‌ మే క్యాజీ కిసీకా ఆంచల్‌ (నౌ దో గ్యారా)

ఈ పాట ఈమె పాడటానికి ముందు, ఇలా ఈమె పాటలు పాడటానికి ముందు చాలా కథ నడిచింది. తండ్రి దీనానాథ్‌ మంగేష్కర్‌ది సంచార మ్యూజిక్‌ థియేటర్‌. తిరిగి తిరిగి కొల్హాపూర్‌లో సెటిల్‌ అయితే ఐదుమంది సంతానంలో ఆశా రెండోదిగా ఆ ఇంట పాట వింటూ పెరిగింది. చదివించే స్తోమత లేక తండ్రి లతాను, ఆశాను కూడా ఇంట్లో కూచోబెట్టాడు. ఆ తర్వాత ఆయన అంత పెద్ద కుటుంబాన్ని దిక్కు లేనిది చేస్తూ మరణిస్తే అందరూ కలిసి ముంబై చేరారు.

లతా ఆ సమయంలోనే నిశ్చయించుకుంది కుటుంబాన్ని నిలబెట్టాలని. కాని ఆశా భయపడింది... ఈ భయంకరమైన దారిద్య్రంలో బతకగలనా అని. అందుకే తమకు మేనేజర్‌గా పని చేస్తూ వచ్చిన 31 ఏళ్ల గణపతిరావ్‌ భోంస్లేను 16 ఏళ్ల వయసులో ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. లతాకు ఇది చాలా పెద్ద దెబ్బ. చెల్లి తోడుంటుంది అనుకుంటే ఈ పని చేస్తుందా. చాలా ఏళ్లు క్షమించలేకపోయింది.

చాలా ఏళ్లు అసలు దగ్గరికే రానివ్వలేదు. తాను చేసిన పని సరైనది కాదని ఆశాకు అర్థమైంది. భర్త వ్యసనపరుడు. అత్తామామల ఆరళ్లు. ఇద్దరు పుట్టాక, మూడో పాప గర్భంలో ఉండగా ఆమెను బయటకు తోసేశారు. ఆత్మహత్య చేసుకోవాలనుకుంది ఆశా. కాని కడుపులో బిడ్డ ఉందని ఆగిపోయింది. ముంబై చేరితే ఆదరించేవారు లేరు. జరుగుబాటుకు వీలు లేదు. ఉన్నదల్లా గొంతు. అది పలికించగల పాట. కాని అప్పుడప్పుడే మహల్‌ (1959)తో లతా స్టార్‌ అయ్యింది. రంగంలో గీతా దత్, షంషాద్‌ బేగం, సురయ్య... వంటి మహామహులు ఉన్నారు. ఇందరి మధ్య ఆశా ఎవరు? ఎవరు ఈ ఆశా? ముగ్గురు పిల్లల ఈ తల్లికి ఇక్కడ ఏం పని?



మిస్టర్‌ జాన్‌ యా బాబాఖాన్‌
యా లాలా రోషన్‌దాన్‌ (బారిష్‌)

కాని అప్పుడే హెలన్‌ వచ్చింది. సినిమాలకు క్లబ్‌ సాంగ్స్‌ అవసరం అయ్యాయి. రాక్‌ ఎన్‌ రోల్‌ మ్యూజిక్‌లో పాటలు అవసరం అయ్యాయి. లతా ఇలాంటి పాటలు పాడదు. షంషాద్, గీతా పాడతారు కాని ఖరీదు. పేదవాళ్లు ఆపిల్‌ తినలేకపోయినా బేరీ పండ్లు తినగలరు. ఆశా అలాంటి బేరీ పండు. పాటలో మెండు. సి.రామచంద్ర, ఓపి.నయ్యర్, ఎస్‌.డి. బర్మన్‌ వీళ్లందరి హుషార్‌ పాటలకు ముఖ్యంగా హెలన్‌ పాటలు ఆమె పాడటం మొదలెట్టింది. నిజానికి ఆశాను హెలెన్‌ నిలబెట్టింది.

హెలెన్‌ను ఆశా. అలాగే వైజయంతీ మాలకు పాడిన ‘ఇనా మీనా డీకా’ (సినిమా: ఆశ) సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది. ఎస్‌.డి.బర్మన్‌ ‘సాహిబ్‌ బీబీ ఔర్‌ గులామ్‌’లో మన తెలుగు అమ్మాయి వహీదా రహమాన్‌కు ‘భవరా బడా నాదాన్‌ హై’ ఇచ్చి ఈలలు మోగించాడు. ఓపి నయ్యర్‌ ‘నయా దౌర్‌’లో ‘మాంగ్‌ కే సాథ్‌ తుమ్హారా’ పాడించాడు. ఎవరు ఆశా భోంస్లేకు ఇక్కడ ఏం పని అంది? లతా గంగా నది. నిజమే. నర్మద ఉంటుంది. ఉండాలి. ఉండేలా చూసుకోవడం ప్రకృతి పని. ఆశా నర్మద.



ఆయియే బెహర్‌బాన్‌
బైఠియే జానే జాన్‌... (హౌరా బ్రిడ్జ్‌)

‘అయ్యా... పిల్లల్ని సాక్కోవాలి పాట ఇవ్వండి’ అని అడుక్కునే స్థితి నుంచి ‘అమ్మా... మీరే మా పాట పాడాలి’ అని నిర్మాతలు, సంగీత దర్శకులు వెంటపడే స్థితికి ఆశా ఎదిగింది. ఓపి నయ్యర్‌తో ఆమె స్నేహం వల్ల అతను చేసిన ప్రతి పాట ఆమే పాడింది. ఆ తర్వాత సంగీత దర్శకుడు రవి ఆమెకు మంచి పాటలు ఇచ్చాడు. ‘వక్త్‌’లో ‘ఆగేభీ జానే నా తూ’ పెద్ద హిట్‌. ఆ తర్వాత ఆర్‌.డి.బర్మన్‌ ఆమె జీవితంలో ప్రవేశించి ‘ఓ మేరే సోనరే సోనరే సోనా’ అని భవిష్యత్తు బంగారం చేశాడు.

ఆర్‌.డి.బర్మన్‌కు ఆశా ఎన్నో హిట్స్‌ పాడింది. ‘పియా తూ అబ్‌ తో ఆజా’ (కార్‌వాన్‌), ‘దమ్‌ మారో దమ్‌’ (హరే రామ హరే కృష్ణ)... ‘హమ్‌ కిసీసే కమ్‌ నహీ’ కోసం పాడిన ‘చురాలియా’ గ్లాసుల గలగలలు సరేసరి. అయితే రొమాంటిక్‌ పాటలు, అల్లరి పాటలు, తాపగీతాలు... వీటికి పేరుందని చెప్పుకునే ఆశాను ‘ఉమ్రావ్‌జాన్‌’ సినిమా ఇంకో పేరుగా చూపింది. అంతవరకూ గజల్‌ అంటే లతా. ఈ సినిమాతో ఆ ఖ్యాతి ఆశా పొందింది. ఖయ్యాం సంగీతంలో ‘దిల్‌ చీజ్‌ క్యా హై ఆప్‌ మేరే’, ‘ఇన్‌ ఆంఖోకి మస్తీమే’... పాటలను నిత్య పరిమళ భరితం చేసింది. ఒక్క వొరలో రెండు కత్తులు ఇమడవు అనేది పాత మాట. లతా, ఆశ ఇప్పుడు ఒకే సింహాసనంలో సగం సగం కూచునే స్థితికి ఆశా వచ్చింది.

‘తీస్రీ మంజిల్‌’తో కొత్త ఆశా ఉదయించింది. అందులో ‘ఆజా ఆజా’ పాడటానికి ఆశా భోంస్లే కంగారు పడింది. పల్లవి చివర ‘అహహ ఆజా అఅ్హ ఆజా’ అని అనగలనా లేదా అని సందేహం. ‘పోనీ స్టయిల్‌ మార్చనా’ అని ఆర్‌.డి అంటే వద్దు అని పంతం. లతా ఇది తెలిసి ‘నువ్వు మొదట మంగేష్కర్‌వి. తర్వాత భోంస్లేవి. పాడగలవు పాడు’ అంది. రికార్డింగ్‌ జరిగే రోజు నిర్మాత నాసిర్‌ హుసేన్, ఆర్‌.డి.బర్మన్‌ 500 రూపాయలు పందెం వేసుకున్నారు. రఫీ ‘అహహ ఆజా’ బాగా అనగలడని నాసిర్‌ హుసేన్, ఆశా బాగా అనగలదని ఆర్‌.డి.బర్మన్‌. ఆశా గెలిచింది. ఆ పాట ఆమెదే.

ఆశాకు పాటంటే పిచ్చి. నిజానికి ఆశా వంటి కళాకారులకు సంసారిక జీవితం ఎలా హ్యాండిల్‌ చేయాలో తెలియదు. ఆర్‌.డి.బర్మన్‌తో చేసుకున్న రెండో వివాహం పెద్దగా సజావుగా సాగలేదు. అతని తాగుడు అతణ్ణి చిన్న వయసులో మృత్యువు తెచ్చింది. ఆశా విపరీతమైన బిజీ ఆమెను ఆమె కూతురికి పూర్తి ప్రేమ ఇవ్వలేకపోయింది. ఆమె కూతురు వర్ష నలభై ఏళ్ల వయసులో ఆత్మ హత్య చేసుకుంది. 

ఆమె పెద్ద కొడుకు హేమంత్‌ కేన్సర్‌తో మరణించాడు. ఇప్పుడు ఆశాకు చిన్న కొడుకు ఆనంద్‌ భోంస్లే అతని కుటుంబం దగ్గరగా ఉంది. పెద్ద కొడుకుతో పుట్టిన మనవరాలితో కూడా సత్సంబంధాలు లేవు. కాని ‘గతాన్ని గుర్తు చేసుకోకు. భవిష్యత్తు కోసం బెంగ పడకు. నీకున్నది ఈరోజు. దానిని మాత్రమే పట్టించుకో’ అనే తత్వాన్ని ఆశా నమ్ముతుంది. ఆ నమ్మకంతోనే ముందుకు సాగుతుంది.

కొందరు మళ్లీ మళ్లీ పుట్టరు. వారిని ప్రకృతి లోకం కోసం తయారు చేసి చాలా కాలం విరామం తీసుకుంటుంది. ఆ విరామ సమయమంతా మనం ఆ కళాకారుల కళతో వినోదం పొందుతాం. ఊరడిల్లుతాం. మురిసి ముచ్చట పడతాం.ఆశా నేడు 89లోకి అడుగుపెడుతుంది.ఆమె వందేళ్లు చూడాలి. ఆమె పాట ఎలాగూ వెయ్యేళ్ల ఆయుష్షు పొందింది కదా.జీవితం సప్తసాగర గీతం వెలుగు నీడల వేదంసాగనీ పయనం (చిన్ని కృష్ణుడు)
– కె

చదవండి : Manike Mage Hithe: ‘మాణికే మాగే హితే’, ఎవరీ యొహాని డి సిల్వా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement