
కరోనా వల్ల సినిమా పరిశ్రమ సంక్షోభంలో ఉంది. ఇలాంటి సమయంలో అందరూ కలసికట్టుగా ముందుకు వెళితే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. ముఖ్యంగా సినిమాల విడుదల విషయంలో ఏకాభిప్రాయంతో ఉండాల్సిన అవసరం ఉందన్నది నిర్మాతల అభిప్రాయం. ఈ విషయంలోనే రాజమౌళిపై బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌కి ఆగ్రహం వచ్చినట్లు ఉంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ విడుదల తేదీ (అక్టోబర్ 13)ని ప్రకటించారు. ఇది ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి ఇతర భాషలవాళ్లు కూడా ఈ సినిమా విడుదల అప్పుడు తమ సినిమాని రిలీజ్ చేయడానికి ఇష్టపడరు.
అయితే అజయ్ దేవగణ్‌తో తీస్తున్న ‘మైదాన్’ సినిమాని అక్టోబర్ 15న విడుదల చేస్తున్నట్లు చాలా రోజుల క్రితం చిత్రనిర్మాత బోనీ కపూర్ ప్రకటించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’లో అజయ్ దేవగణ్ కీలక పాత్ర చేస్తున్నారు. దసరాకి నా ‘మైదాన్’ ఉంది, ఒకసారి బోనీ కపూర్‌తో మాట్లాడండి అని రాజమౌళికి అజయ్ దేవగణ్ చెప్పినా, ఆయన పట్టించుకోలేదనే వార్త ప్రచారంలోకొచ్చింది. రెండు సినిమాల క్లాష్ గురించి బోనీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో – ‘‘నేను చాలా అప్‌సెట్ అయ్యాను. ఇది అనైతికం. ‘మైదాన్’ సినిమా రిలీజ్ డేట్‌ని ఆరు నెలల క్రితమే ప్రకటించాను. ఇండస్ట్రీని కాపాడుకోవాల్సిన సమయంలో రాజమౌళి ఇలా చేశాడు’’ అని పేర్కొన్నారనే వార్త ఉంది. మరి.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ వెర్సస్ ‘మైదాన్’ క్లాష్ తప్పుతుందా? వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment