Cannes Film Festival: గోస్‌ టు కాన్స్‌ | Cannes Film Festival 2022: Five Indian films at the Cannes Film Festival 2022 | Sakshi
Sakshi News home page

Cannes Film Festival: గోస్‌ టు కాన్స్‌

Published Fri, May 13 2022 12:48 AM | Last Updated on Fri, May 13 2022 12:48 AM

Cannes Film Festival 2022: Five Indian films at the Cannes Film Festival 2022 - Sakshi

పేదరికంతో ఇబ్బందులు పడే ఒక మహిళ కథ.. ఓ బాలుడి తీయని జ్ఞాపకాలు.. భారతీయ చరిత్రలో అతి పెద్ద అగ్ని ప్రమాద బాధితుల ఇబ్బందులు.. ఇంటి కోసం వెతికే ఇద్దరు ట్రాన్స్‌జెండర్‌ మహిళల పాట్లు.. ఒక జర్నలిస్ట్‌ మరియు రెండు వర్గాల మధ్య సంఘర్షణ.. ఇవన్నీ కాన్స్‌ చలన చిత్రోత్సవాల్లో వీక్షకుల ముందుకు రానున్నాయి. ఈ కథలతో రూపొందిన ఐదు భారతీయ చిత్రాలు కాన్స్‌ చలన చిత్రోత్సవాల్లో ‘గోస్‌ టు కాన్స్‌’ విభాగంలో ప్రదర్శితం కానున్నాయి. ఈ నెల 17 నుంచి 28 వరకూ ఈ చిత్రోత్సవాలు జరగనున్నాయి. ఫ్రాన్స్‌ దేశంలో జరగనున్న కాన్స్‌ ఉత్సవాలకు వెళ్లనున్న ఆ ఐదు చిత్రాల గురించి తెలుసుకుందాం.   

లైలా... రోషిణి... ఓ ఇల్లు
జీవించడానికి ఒక ఇంటి కోసం ఆరాటపడుతుంటారు లైలా, రోషిణి అనే ఇద్దరు స్త్రీలు. ఆ ఇద్దరూ లింగ మార్పిడి చేయించుకున్నవారు కావడంతో అద్దెకు ఇల్లు దక్కించుకోవడం పెద్ద ప్రహసనం అవుతుంది. రిన్‌ చిన్, మహీన్‌ మీర్జా రూపొందించిన హిందీ చిత్రం ‘ఏక్‌ జగహ్‌ అప్నీ’ కథ ఇది. నిజమైన ఇద్దరు ట్రాన్స్‌ ఉమెన్‌ (లింగ మార్పిడి చేయించుకున్న మహిళలు) నటించిన చిత్రం ఇది. ఇద్దరికీ కూడా ఇది తొలి సినిమానే. కథ రాసేటప్పుడు వారి అనుభవాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.

ఓ బాలుడి జ్ఞాపకాలు
ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకూ ఛత్తీస్‌గఢ్‌లో చదువుకుంటాడు ఆ కుర్రాడు. ఆ నాలుగేళ్ల జీవితం ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. ఆ జ్ఞాపకాలకు కొన్ని కాల్పనిక అంశాలు జోడించి దర్శకుడు శైలేంద్ర సాహు తెరకెక్కించిన చిత్రం ‘బైలాడీలా’. శైలేంద్ర సాహు దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. ఛత్తీస్‌ గఢ్‌లో చదువుకున్నప్పటి అతని జ్ఞాపకాలే ఈ సినిమా. హిందీ, ఛత్తీస్‌గఢ్‌లో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాకి బడ్జెట్‌ నిర్ణయించలేదు. శేలైంద్ర స్నేహితులు నటించారు. వాళ్లతో పాటు టెక్నీషియన్లు ఎవరూ పారితోషికం తీసుకోలేదు. ఈ సినిమా ద్వారా డబ్బులొస్తే అప్పుడు ఇస్తానని ఫ్రెండ్స్‌కి మాటిచ్చారు శైలేంద్ర. కాన్స్‌ చిత్రోత్సవాల్లో తన చిత్రాన్ని మార్కెటింగ్‌ చేసుకోవాలనే ఆకాంక్షతో అక్కడికి వెళుతున్నారు.   
 
నిర్మాతలు ముందుకు రాని ‘ఫాలోయర్‌’
బెల్గామ్‌లోని ఓ పట్టణానికి చెందిన ఒక జర్నలిస్ట్, రెండు వర్గాల మధ్య సంఘర్షణ చుట్టూ సాగే చిత్రం ‘ఫాలోయర్‌’. హర్షద్‌ నలవాడే దర్శకత్వంలో హిందీ, కన్నడ, మరాఠీ, దఖినీ భాషల్లో ఈ చిత్రం రూపొందింది. బెల్గామ్‌ నేపథ్యం కావడంతో అక్కడి స్థానికులతోనే నటింపజేశారు. రెండు వర్గాల మధ్య సంఘర్షణ నేపథ్యంలోని సినిమా కావడంతో నిర్మాతలెవరూ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు రాలేదు. దాంతో తమ పరిస్థితిని వివరిస్తూ ఈ సినిమా టీమ్‌ ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో చూసి ఆర్థిక సహాయం చేయడానికి చాలామంది ముందుకు వచ్చారు. అలా ‘క్రౌడ్‌ ఫండెడ్‌’ మూవీగా ‘ఫాలోయర్‌’ రూపొందింది. సినిమా షూటింగ్‌ పూర్తి చేసి, రఫ్‌ కట్‌ చేస్తున్న సమయంలో పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేయడానికి ఇద్దరు నిర్మాతలు సహాయం చేయడంతో ఈ సినిమా పూర్తయింది.

పేదరికాన్ని జయించాలని...
ప్రభుత్వ పాఠశాలకు మధ్యాహ్నం భోజనం అందించే వంట మనిషి శివమ్మ జీవితం చుట్టూ సాగే కథ ‘శివమ్మ’ చిత్రం. పేదరికాన్ని జయించడానికి ఆమె రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. చివరికి కూతురి పెళ్లికి దాచిన డబ్బుని ఓ వ్యాపారంలో పెట్టుబడిగా పెడుతుంది. నిజజీవితంలో జరిగిన కొన్ని ఘటనలను జోడించి అల్లిన కాల్పనిక కథతో దర్శకుడు జై శంకర్‌ ఈ కన్నడ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో నటించినవారందరూ వృత్తిరీత్యా యాక్టర్లు కాదు. కానీ సినిమా సహజత్వానికి దగ్గరగా ఉండాలని నటింపజేశారు. దర్శక–నిర్మాత–నటుడు రిషబ్‌ శెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
బాగ్‌జాన్‌
2020లో అస్సాంలోని తిన్సుకియా జిల్లాలో ఓ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. భారతదేశ చరిత్రలో అతి పెద్ద అగ్ని ప్రమాదంగా నమోదైంది. గ్యాస్‌ లీకేజ్‌ కారణంగా చమురు బావిలో ఎగసిపడిన భారీ మంటలను అదుపు చేసేందుకు దాదాపు ఆరు నెలలు పట్టింది. ఈ ఘటన నేపథ్యంలో రూపొందిన అస్సామీ చిత్రం ‘బాగ్‌జాన్‌’. తిన్సుకియాలో నిజమైన లొకేషన్లలో చిత్రీకరించారు. అలాగే ఆ దుర్ఘటన బాధితులను కూడా నటింపజేశారు చిత్రదర్శకుడు జైచెంగ్‌ గ్జయ్‌.

బలమైన కథాంశంతో రూపొందిన ఈ ఐదు చిత్రాలూ ప్రపంచ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటాయని ఊహించవచ్చు. ఇలా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కావడం ఆయా చిత్రబృందాలకు ఉపయోగపడే విషయం. తమ సినిమాని మార్కెటింగ్‌ చేసుకునే వీలు ఉంటుంది. అలాగే తదుపరి చిత్రానికి ఫండ్‌ సమకూరే వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ అప్పటికి సినిమా విడుదల కాకపోతే విడుదలకు సహాయం అందే అవకాశం ఉంది. మేకర్స్‌కి ఇలాంటి ప్రయోజనాలు ఉంటే.. నటీనటులకు అవకాశాలు పెరిగే ఆస్కారం కూడా ఉంటుంది. అందుకే కాన్స్‌ చిత్రోత్సవాలకు వెళ్లనున్న ఈ ఐదు చిత్రాల యూనిట్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement