కళాకారులు.. ఒక్కసారి కళను నమ్ముకుంటే ప్రాణం పోయినా వదిలిపెట్టరు. దానికోసం ఏమైనా చేస్తారు.. ఎంతవరకైనా వెళ్లొస్తారు. కళ ద్వారా పేరు, పరపతి, డబ్బు వస్తుందో లేదో కానీ సంతృప్తి మాత్రం దక్కుతుంది. అందుకే చాలామంది ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆ కళను వదిలిపెట్టరు, జీవితం మొత్తాన్ని దానికే అంకితమిస్తారు. మెగా కుటుంబం కూడా అంతే!
స్వయంకృషితో ఎదిగిన చిరంజీవిని సినిమా అనే కళ అక్కున చేర్చుకుంది. మొదట్లో తడబడ్డాడు, కిందపడుతూనే పైకి లేచాడు. విమర్శించిన నోళ్లతోనే పొగడ్తలు కురిపించేలా చేసుకున్నాడు. తన నటన ద్వారా ప్రజలకు వినోదం అందించాలనుకున్నాడు. అందుకే 68 ఏళ్ల వయసులోనూ హాయిగా విశ్రాంతి తీసుకోకుండా కుర్ర హీరోలతో పోటీపడుతూ సినిమాలు చేస్తూనే ఉన్నాడు.
ఎడమ చేతికి తెలియకుండా కుడి చేత్తో సాయం
సినిమా అంటే అంత పిచ్చి ఆయనకు! ఒక్క సినిమానే కాదు సినిమారంగంలో పనిచేసేవాళ్లపైనా మక్కువ ఎక్కువ. అందుకే వారికోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. కరోనా సమయంలో సినీకార్మికులకు, సాధారణ జనాలకు ఆక్సిజన్ సిలిండర్లు అందించి ఎంతోమంది ప్రాణాలు కాపాడాడు. అయితే చిరంజీవికి చేసిన సాయం చెప్పుకోవడం ఇష్టముండదు. అలా ఎడమ చేతికి తెలియకుండా కుడి చేత్తో ఎక్కువగా సాయం చేస్తుంటాడు. ఇండస్ట్రీలో ఉండే ఎంతోమంది తన దగ్గరి నుంచి ఏదో రకంగా సాయం పొందినవారే! ఇలాంటి వ్యక్తికి పొగడ్తలే కాదు పునస్కారాలు కూడా వచ్చాయి.
అవార్డులే అవార్డులు..
ఉత్తమ నటుడిగా మూడు నందులు, ఏడు సౌత్ ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నాడు. ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్‌మెంట్, రఘుపతి వెంకయ్య.. ఇలా ఎన్నో పురస్కారాలు ఆయనను వరించాయి. 2006లో పద్మ భూషణ్ అందుకున్న ఆయన 18 ఏళ్ల తర్వాత పద్మ విభూషణ్ అందుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్న రామ్‌చరణ్ రెండు నందులు ఎగరేసుకుపోయాడు. సైమా, పాప్ గోల్డెన్ అవార్డు అందుకున్నాడు.
ఉపాసన కూడా..
అంతేకాదు, ఆయన నటించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటునాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గతేడాది ఆస్కార్ గెలుచుకుంది. చరణ్ భార్య ఉపాసన వ్యాపారవేత్తగా, సామాజిక కార్యకర్తగా రాణిస్తోంది. అపోలో ఆస్పత్రిలో కీలక పదవిలో ఉన్న ఉపాసన తను చేస్తున్న సేవలకుగానూ గతంలో మహాత్మాగాంధీ అవార్డు అందుకుంది. చిరు అల్లుడు అల్లు అర్జున్.. గతేడాది ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. అతడి కెరీర్‌లో ఐదు నందులతో పాటు అనేక పురస్కారాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment