Tollywood Top Heroes 7 Big Movies Ready To Hit Screens In 2023 Summer, Deets Inside - Sakshi
Sakshi News home page

Telugu Movie Releases In 2023: సమ్మర్ వార్ కు సై అంటున్న హీరోలు.. బరిలో 7 పెద్ద సినిమాలే!

Published Wed, Jul 13 2022 7:33 AM | Last Updated on Wed, Jul 13 2022 10:27 AM

Chiranjeevi, Mahesh Babu, Prabhas, Allu Arjun New Films Are Ready To Release On Summer 2023 - Sakshi

సినిమాలకు మంచి సీజన్‌ అంటే సంక్రాంతి, వేసవి, దసరా, దీపావళి... ఈ ఏడాది సమ్మర్‌ ముగిసింది. ఇక  2023 వేసవి బరిలో నిలిచేందుకు భారీ సినిమాలు రెడీ అవుతున్నాయి. డేట్‌ని ఫిక్స్‌ చేయకపోయినా వేసవి బరిలో నిలిచేందుకు ముందుగానే కర్చీఫ్‌ వేసేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్‌ వంటి హీరోలు వేసవికి సై అంటున్నారు.. ఆ వివరాల్లోకి ఓ లుక్కేద్దాం.

వరుసగా నాలుగైదు సినిమాలకు ఓకే చెప్పి, ఫుల్‌ స్పీడ్‌లో ఉన్నారు చిరంజీవి. ఆయన నటిస్తున్న చిత్రాల్లో ‘బోళాశంకర్‌’ ఒకటి. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తమిళ హిట్‌ ‘వేదాళం’కి రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలని ఫిక్స్‌ అయ్యారట చిత్రయూనిట్‌. తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా కీర్తీసురేశ్‌ నటిస్తున్నారు.

ఇక గత ఏడాది ‘అఖండ’ హిట్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్న బాలకృష్ణ కూడా వచ్చే వేసవికి సందడి చేయనున్నారని టాక్‌. బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ సెప్టెంబరు నెలాఖరులో ప్రారంభం కానుంది. సినిమా రిలీజ్‌ను వేసవికి టార్గెట్‌ చేసుకున్నారట.

మరోవైపు ‘బాహుబలి’తో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్, ‘కేజీఎఫ్‌’తో పాన్‌ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘సలార్‌’ కూడా సమ్మర్‌ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమాలో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఇక తాజా క్రేజీ చిత్రాల్లో మహేశ్‌బాబు–త్రివిక్రమ్‌ సినిమా ఒకటి. ‘అతడు, ఖలేజా’ చిత్రాల తర్వాత మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందనున్న  ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తారు. ఆగస్టులో షూటింగ్‌ ప్రారంభం కానున్న ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

ఇంకోవైపు ‘జనతా గ్యారేజ్‌’ వంటి హిట్‌ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో రెండో సినిమా రూపొందనుంది. ఎన్టీఆర్‌ కెరీర్‌లో 30వ సినిమాగా రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్‌ ఆగస్టులో ఆరంభం కానుంది. ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.

సమ్మర్‌ రేస్‌లో రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వం వహించనున్న సినిమా కూడా ఉండే అవకాశం ఉంది. పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో  కియారా అద్వానీ కథానాయిక. దర్శకుడు శంకర్‌ నేరుగా తెలుగులో చేస్తున్న తొలి చిత్రం ఇది. ఈ సినిమాని కూడా వేసవి బరిలో నిలపనుందట చిత్రబృందం. మార్చిలో విడుదల అవుతుందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌.

ఇక గత ఏడాది ‘పుష్ప’ వంటి సూపర్‌ హిట్‌ ఇచ్చిన అల్లు అర్జున్‌–సుకుమార్‌ తగ్గేదేలే అంటూ ఈ సినిమా రెండో భాగానికి రెడీ అవుతున్నారు. అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప ది రైజ్‌’ సీక్వెల్‌గా ‘పుష్ప ది రూల్‌’ రానుంది. వార్తల్లో ఉన్న ప్రకారం ఈ సినిమా 2023 సంక్రాంతి బరిలో దిగాల్సి ఉంది. అయితే ఇప్పటివరకూ షూటింగ్‌ ఆరంభం  కాలేదు. దీంతో వేసవిలో పుష్ప రాజ్‌ వేట మొదలవుతుందట. మరి.. సమ్మర్‌ రేస్‌లో ఈ చిత్రాలన్నీ నిలుస్తాయా? కొత్త చిత్రాలు లిస్ట్‌లో చేరతాయా? అనేది చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement