టైటిల్ : కోబ్రా
నటీనటులు : చియాన్ విక్రమ్, శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, రోషన్ మాథ్యూ, మీనాక్షి , మృణాళిని తదితరులు
నిర్మాణ సంస్థ: సెవెన్ స్క్రీన్ స్టూడియోస్
నిర్మాత: ఎస్ఎస్ లలిత్ కుమార్
దర్శకత్వం: అజయ్ జ్ఞానముత్తు
సంగీతం : ఏఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫీ:హరీష్ కణ్ణన్
విడుదల తేది: ఆగస్ట్ 31, 2022
ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో ఎప్పుడు ముందుంటాడు తమిళస్టార్ చియాన్ విక్రమ్. ఫలితాన్ని పట్టించుకోకుండా వైవిధ్యమైన పాత్రలలో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. అయితే విక్రమ్ ప్రయోగానికి ప్రేక్షకుల ప్రశంసలు లభించాయి కానీ..సాలిడ్ హిట్ మాత్రం దక్కడం లేదు. అందుకే ఈ సారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని యాక్షన్ థ్రిల్లర్ 'కోబ్రా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో విక్రమ్ పది పాత్రలు పోషించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘కోబ్రా’పై హైప్ క్రియేట్ అయింది. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు(ఆగస్ట్ 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాలిడ్ హిట్ కోసం 17 ఏళ్లు ఎదురుచూస్తున్న విక్రమ్‌కు ‘కోబ్రా’తో ఆ కొరత తీరిందా? లేదా? రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
స్కాట్లాండ్ ప్రిన్స్ బహిరంగ హత్యకు గురవుతారు. ఈ కేసును విచారిస్తున్న ఇంటర్‌పోల్ ఆఫీసర్ అస్లామ్(ఇర్ఫాన్ ఫఠాన్).. ఒడిశా ముఖ్యమంత్రి, రష్యా మంత్రి కూడా అదే రీతిలో హత్యకు గురయ్యారని గుర్తిస్తాడు. ఈ హత్యలకు కోల్‌కతాలో ఉన్న లెక్కల మాస్టర్ మది(చియాన్ విక్రమ్)కి సంబంధం ఉందని అనుమానిస్తాడు. అలాగే వేరు వేరు దేశాల్లో జరిగిన ఈ హత్యలతో యువ వ్యాపారవేత్త రిషి(రోషన్ మాథ్యూ)కి కూడా సంబంధం ఉంటుంది. మరి వీరిలో ఎవరు ఆ హత్యలు చేశారు? ఈ కేసు విచారణలో అస్లామ్‌కు ఓ లెక్కల స్టూడెంట్ జూడీ(మీనాక్షీ గోవింద్ రాజన్) ఏ రకమైన సహాయం చేసింది? సాధారణ లెక్కల మాస్టర్‌కు ఈ హత్యలకు ఎలాంటి లింక్ ఉంది? కధీర్‌కు మదికి ఉన్న సంబంధం ఏంటి? పోలీసుల విచారణలో ఏం తేలింది? అనేదే కోబ్రా కథ.
ఎలా ఉందంటే..
సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘కోబ్రా’. ఇందులో విక్రమ్ పది రకాల పాత్రల్లో కనిపించి మెప్పించాడు. ఒక్కో పాత్ర కోసం ఐదారు గంటల పాటు మేకప్‌కే సమయం కేటాయించేవాడని మూవీ ప్రమోషన్స్‌లో మేకర్స్ తెలిపారు. అతని కష్టం తెరపై కనిపించింది కానీ..అజయ్ జ్ణానముత్తు కథనే కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. గతంలో డిమాంటీ కాలనీ, అంజలి సీబీఐ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన అజయ్.. విక్రమ్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేస్తున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సింది.
విక్రమ్‌కు సెట్ అయ్యే కాన్సెప్ట్‌నే ఎంచుకున్నాడు కానీ తెరపై చూపించడంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేకపోయాడు. వరుస హత్యలతో కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా ప్రారంభమవుతుంది. మాథ్యమెటిక్స్‌లో ఉన్న అనుభవంతో ఆ హత్యలను ఎలా చేశారో వివరించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అదే సమయంలో కొన్ని సాగదీత సీన్స్ ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఆ తర్వాత మాత్ర కథ పూర్తిగా తేలిపోతుంది. సుదీర్ఘంగా సాగే మది, కధీర్‌ల ప్లాష్‌బ్యాక్ స్టోరీ సినిమాకు పెద్ద మైనస్. సెకండాఫ్ మొత్తం ప్రేక్షకుడి ఊహకందేలా సాగడమే కాకుండా.. నిడివి మరింత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. సినిమా చివరి భాగంలో కొన్ని యాక్షన్ సీన్లు మెప్పిస్తాయి.
ఎవరెలా చేశారంటే..
గెటప్పుల స్పెషలిస్ట్ విక్రమ్ నటనకు వంక పెట్టలేం. ఏ పాత్రలోనైనా నటించడం కంటే జీవించడం ఆయనకు అలావాటు. మది, కధీర్ పాత్రల్లో విక్రమ్ ఒదిగిపోయాడు. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో 10 రకాల పాత్రల్లో విక్రమ్ కనిపిస్తాడు. అందుకోసం ఈ విలక్షణ నటుడు పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. యాక్షన్స్ సీన్స్‌లో అదరగొట్టేశాడు. ఇక మదిని ప్రాణంగా ప్రేమించే టీచరమ్మ భావన పాత్రలో శ్రీనిధి శెట్టి జీవించేసింది. జెన్నిఫర్‌గా మృణాళిని మెప్పించింది. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే పాత్ర ఆమెది. ఇక లెక్కల స్టూడెంట్‌గా జూడీ మీనాక్షీ గోవింద్ రాజన్ తనదైన నటనతో ఆకట్టుకుంది.
ఇంటర్‌పోల్ ఆఫీసర్ అస్లామ్‌గా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పర్వాలేదనిపించాడు. అతనికిది తొలి సినిమా. డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. రోషన్ మాథ్యూ విలనిజం బాగుంది. కానీ అతని క్యారెక్టర్‌కు ఓ గోల్ అనేది లేకుండా ఉంటుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు చాలా పనిచెప్పాల్సింది. సినిమాలో అనవసరపు సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment