మద్దిలపాలెం (విశాఖతూర్పు): ‘నా సినీ జీవితాన్ని మలుపు తిప్పింది వైజాగ్. నా చిత్రాలకు బ్రహ్మరథం పట్టిన ప్రేక్షకులు విశాఖ వాళ్లే. అందుకే వైజాగ్ అంటే ప్రాణం. ఇది నా లక్కీ సిటీ అని ప్రముఖ హీరో జేడీ చక్రవర్తి అన్నారు. ‘దయ’తో ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌లో తొలిసారిగా నటించానన్నారు. విశాఖ వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. అవి ఆయన మాటల్లోనే..
‘గులాబి’తో స్టార్ స్టేటస్
కృష్ణవంశీ తెరకెక్కించిన గులాబి చిత్రంతో స్టార్ స్టేటస్ లభించింది. ఈ చిత్రం విశాఖలో చిత్రీకరణ జరుపుకుంది. మేఘాలలో తేలిపోమన్నది పాట చిత్రీకరణ పాడేరు కాఫీతోటల సమీపంలో చిత్రీకరించామని, ఆ పాట ఎప్పుడు విన్నా ఈ ప్రాంతం గుర్తుకు వస్తుందన్నారు. దాదాపు ఈ చిత్రమంతా వైజాగ్ పరిసరాల్లో షూటింగ్ జరిపామన్నారు. గులాబి నా సినీ జీవితాన్ని మలుపు తిప్పిందన్నారు.
వైజాగ్ అంటే ప్రాణం
విశాఖ ప్రేక్షకులు సినిమాలను విశేషంగా ఆదరిస్తారని, ఇక్కడ టాక్ బాగుంటే ఆ సినిమా సూపర్ హిట్టే. తాను నటించిన గులాబి, సత్య సూపర్ హిట్ చేశారని, తొలిసారిగా నటించిన ‘దయ’ వెబ్ సిరీస్‌ను కూడా ఆదరించాలని కోరారు.
దయ ప్రమోషన్ ఇక్కడ నుంచే..
దయ వెబ్ సిరీస్ ప్రమోషన్ నా లక్కీ సిటీ వైజాగ్ నుంచి ప్రారంభించడం ఆనందంగా ఉంది. డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ దర్శకుడు పవన్ సాధినేని రూపొందించిన ఈ వెబ్ సిరీస్‌ను 24 గంటల్లోనే ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక్కడ వాళ్లు దయ చూశామని, చాలా బాగుందని చెబుతుండడం ఆనందంగా ఉంది. ఇది నా సెకెండ్ ఇన్నింగ్స్‌కు శుభసూచికంగా భావిస్తున్నా.
మూడు భాషల్లో వెబ్ సిరీస్‌లో నటిస్తున్నా..
ప్రస్తుతానికి రెండు హిందీ, ఒక తెలుగు, తమిళ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాను. అలాగే మూడు చిత్రాల్లో నటిస్తున్నా. వాటిలో రెండు తెలుగు చిత్రాలు కాగా, ఒకటి తమిళ చిత్రం.
రాజకీయాలకు దూరం
రాజకీయాలంటే ఆసక్తే కాని, ప్రత్యక్షంగా ఆ రంగంలోకి వచ్చే ఆలోచనే లేదు. ప్రస్తుతం మంచి చిత్రాలతో అభిమానులను అలరించాలన్నదే నా లక్ష్యం.
ఆర్జీవీ నా గురువు
రాంగోపాల్ వర్మ నాకు గురువు. చాలా మంది రామూ మీ ఫ్రెండ్ కదా అంటుంటారు. ఆయన జీనియస్..ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. దయ వెబ్ సిరీస్ చూసి ఆదరించండి. చక్కని థ్రిల్ కలిగించే క్రైమ్ వెబ్ సిరీస్. మంచి స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment