
ధర్మేంద్ర, హేమ మాలిని
‘కలసి ఉంటే కలదు సుఖం’ అంటారు. కానీ ఇదే విషయాన్ని సీనియర్ నటి హేమ మాలిని వేరే విధంగా చెబుతున్నారు. దూరంగా ఉంటే క్షేమంగా ఉంటాం అంటున్నారు. భర్త ధర్మేంద్రను హేమ కలసి ఏడాది పైనే అయింది. ఈ ఇద్దరూ దూరం కావడానికి కారణం కరోనా. కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. దీంతో ఎక్కడివాళ్లు అక్కడ ఉండాల్సిన పరిస్థితి. ధర్మేంద్ర, హేమ మాలిని విషయంలో ఇదే జరిగింది. నిజానికి గతేడాది లాక్ డౌన్ నుంచే ధర్మేంద్ర ముంబయ్‌కి దూరంగా ఉన్న ఫామ్‌హౌస్‌లో ఉన్నారు. హేమ ఏమో ముంబయ్‌లో ఉన్నారు. తాజాగా లాక్‌డౌన్ విధించడంతో ఇద్దరూ ఎక్కడివాళ్లు అక్కడ ఉండిపోయారు.
ఈ విషయం గురించి హేమ మాలిని మాట్లాడుతూ –‘‘ప్రస్తుతం ప్రతి ఒక్కరూ భద్రంగా ఉండటం అవసరం. ఇప్పుడు ఒకరినొకరు కలుసుకోవడం కన్నా ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. ఆయన్ను (ధర్మేంద్ర) మేం కలవడంకన్నా ఆయన ఆరోగ్యంగా ఉండటం మాకు ముఖ్యం. వందేళ్ల మానవ చరిత్రలో ఇంత పెద్ద అంటువ్యాధిని మనం ఇప్పుడే ఎదుర్కొంటున్నాం. సమాజాన్ని కాపాడుకోవాలంటే.. మనం ధైర్యంగా నిలబడాలంటే మనిషికీ మనిషికీ దూరం పాటించాల్సిందే. ఈ త్యాగం చేయాలి’’ అన్నారు. ధర్మేంద్ర వయసు దాదాపు 85. హేమకు 70 ఏళ్లు పైనే. ఈ కరోనా టైమ్‌లో వయసు పైబడినవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణం చేయడం మంచిది కాదు. ఇంటిపట్టునే ఉండాలి. అందుకే ధర్మేంద్ర–హేమ ఇలా దూరంగా ఉంటున్నారు. ఈ ఇద్దరూ 1980లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటికే ధర్మేంద్రకి పెళ్లయి, ఇద్దరు కుమారులు సన్నీ, బాబీ డియోల్ ఉన్నారు. ధర్మేంద్ర–హేమకు ఇద్దరు కుమార్తెలు ఇషా డియోల్, అహానా డియోల్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment