భార్య రూపాదేవి, కూతురు కైవల్యతో తిరుపతి
సాక్షి, విజయనగరం (నెల్లిమర్ల): వకీల్ సాబ్ సినిమా డైలాగ్ రైటర్ మన ఊరి అల్లుడే. ఆ సినిమాకు డైలాగులు రాసిన మామిడాల తిరుపతి నెల్లిమర్ల పట్టణానికి చెందిన అమ్మాయినే వివాహం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం గ్రామానికి చెందిన తిరుపతి నెల్లిమర్ల మండల పరిషత్ కార్యాలయంలో సబ్‌స్టాఫ్‌గా పనిచేస్తున్న బొద్దాన శంకరరావు, మంగమ్మ దంపతుల కుమార్తె బొద్దాన రూపాదేవిని 2011వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. తిరుపతి, రూపాదేవి దంపతులకు కైవల్య అనే పాప ఉంది. ప్రస్తుతం వారి కుటుంబం హైదరాబాద్‌లో నివసిస్తోంది.
తిరుపతి 20 ఏళ్ల కిందట సినీ పరిశ్రమకు వెళ్లారు. 13 ఏళ్ల కిందట చిత్ర నిర్మాత దిల్‌రాజు టీమ్‌లో చేరారు. అప్పట్నుంచి ఆ టీమ్‌లో ప్రధాన టెక్నీషియన్‌గా కొనసాగుతున్నారు. 2011లో వేణుశ్రీరామ్ డైరెక్షన్లో వచ్చిన ‘ఓ మై ఫ్రెండ్’ సినిమాతో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ సినిమాకు స్క్రిప్ట్ కోఆర్డినేటర్‌గా, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. 2013లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు.
2017లో మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘స్పైడర్’ సినిమాకు స్క్రిప్ట్ అసిస్టెంటుగా, నాని నటించిన ‘ఎంసీఏ’కు డైలాగ్ రైటరుగా వ్యవహరించారు. తాజాగా శుక్రవారం విడుదలైన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్‌కు డైలాగులు రాశారు. సినీ పరిశ్రమలో తిరుపతికి మంచి భవిష్యత్ ఉందని నెల్లిమర్ల పట్టణవాసులు చర్చించుకుంటున్నారు. ఆయన నెల్లిమర్ల అల్లుడు కావడంపై గర్వపడుతున్నారు. ఆయనకు ఫోన్‌లో అభినందనలు తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment