పవర్, సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ, వెంకీ మామ, వాల్తేరు వీరయ్య సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకరచయిత బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర. కొన్ని సినిమాలకు రచయితగా కొన్నింటికి దర్శకుడిగా మరికొన్నింటికి స్క్రీన్‌ప్లే రైటర్‌గా పని చేశాడు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా అతడు ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. చిరంజీవి ఓసారి సినిమా ఆఫర్ ఇస్తే చేయనని చెప్పినట్లు తెలిపాడు.
ఆచార్య షూటింగ్‌లో చిరు.. అప్పుడే..
డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ.. 'వెంకీ మామ సినిమా అయిపోయాక ఓసారి చిరంజీవి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆయన అప్పుడు ఆచార్య సినిమా షూటింగ్‌లో ఉన్నారు. తన పిలుపు మేరకు వెళ్లి కలిశాను. ఆయన లూసిఫర్ అనే మలయాళ సినిమా చూశావా? అని అడిగారు. చూశానన్నాను. అప్పటికే లూసిఫర్ రీమేక్‌లో చిరంజీవి చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఆ ప్రాజెక్టు డైరెక్షన్ నాకే అప్పజెప్పుతారా? ఏంటని మనసులో అనుకున్నాను. ఇంతలో మెగాస్టార్.. ఆ సినిమా మరోసారి చూడు.. లూసిఫర్ రైట్స్ తీసుకున్నాం. ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్‌ని అనుకుంటున్నాం.. నువ్వు కూడా బానే చేస్తావనిపించింది. ఓసారి సినిమా చూసి నీ అభిప్రాయం చెప్పు అని అడిగారు. సరేనని సెలవు తీసుకున్నాను.
వెంకీమామ బలవంతం మీద చేశా
రెండు రోజుల్లో లూసిఫర్ పాతికసార్లు చూశాను. కానీ ఆ మూవీ నాకు కనెక్ట్ కాలేదు. ఎందుకంటే సర్దార్ గబ్బర్ సింగ్ నేను రాసిన కథ కాకపోవడం వల్ల అది అనుకున్నంత సక్సెస్ కాలేదు. అప్పుడే నేను బలంగా ఫిక్సయ్యాను.. మనం రాసిన కథ కాకుండా వేరేవాళ్ల కథలతో సినిమా చేయకూడదని నిశ్చయించుకున్నాను. కానీ వెంకీ మామ కథ బలవంతం మీద చేశాను. అయితే లూసిఫర్ రీమేక్ అడిగినప్పుడు నో చెప్పడానికి చాలా ఇబ్బందిపడ్డాను.
ఎప్పటికీ చిరుతో సినిమా చేయలేననుకున్నా
ఎందుకంటే చిరంజీవి అభిమానిని అని చెప్పుకునే నేను ఆయన అవకాశం ఇచ్చినప్పుడు కాదంటే తర్వాత తనతో ఎప్పటికీ సినిమా చేయలేనేమోనని భయపడ్డాను. నరకం అనుభవించాను. రెండు రోజుల తర్వాత చిరంజీవిని కలిశాను. నేను సొంతంగా రాసుకున్న కథలనే బలంగా తీయగలను. వేరొకరి కథలో నేను మార్పుచేర్పులు చేయలేను. నేను చూసిన మాస్ చిరంజీవి లూసిఫర్ కథలో కనిపించలేదు అన్నాను. దీంతో చిరంజీవి.. సరే, వదిలెయ్.. దానికి చాలామంది ఉన్నార్లే.. అన్నారు. ఇక జన్మలో మెగాస్టార్ నాతో సినిమా చేయరనుకున్నాను.
వెంటనే ఇంకో ఆఫర్..
వెళ్లేముందు తనతో ఓ సెల్ఫీ దిగాను. అప్పుడాయన.. నువ్వు చూసిన చిరంజీవి ఏం చేస్తుంటాడు? ఎప్పుడు కథ చెప్తావ్? అని వెంటనే నాకు మరో ఆఫర్ ఇచ్చారు. నేను షాకవుతూనే 20 రోజుల్లో వస్తానన్నాను. 18 రోజుల తర్వాత నీకు రెండు రోజుల సమయమే ఉంది అని ఆయన దగ్గరి నుంచి మెసేజ్ వచ్చింది. సరిగ్గా 20వ రోజు తన దగ్గరకు వెళ్లి వాల్తేరు వీరయ్య సినిమా కథ చెప్పడం, తను ఒప్పుకోవడం జరిగింది' అని చెప్పుకొచ్చాడు బాబీ.
చదవండి : హనుమంతు చేసిన మ్యాజిక్.. చూసేకొద్దీ చూడాలనిపించేలా..
Comments
Please login to add a commentAdd a comment