సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా దర్శక ద్వయం హరి, హరీష్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
► తమిళంలో 'ఒరు ఇరవు', 'అంబులి', 'ఆ', 'జంబులింగం' సినిమాలు చేశాం. మా తొలి సినిమా 'ఒరు ఇరవు'లో హీరో హీరోయిన్లు ఉండరు. చూసే ప్రేక్షకులే హీరో. అది పాయింట్ ఆఫ్ మూవీ కావడంతో డిఫరెంట్ ఛాలెంజ్ ఫేస్ చేశాం. కానీ ‘యశోద’సినిమాని భారీ స్కేల్‌లో చేశాం. కంటెంట్ పరంగా ఛాలెంజెస్ ఈ సినిమాకూ ఉన్నాయి. కథ పరంగా ఎప్పుడూ కొత్త పాయింట్ చెప్పాలనేది మా ఉద్దేశం. కంటెంట్ ఎలా చెబుతున్నామనేది ముఖ్యం. ఇటువంటి కథకు అంత బడ్జెట్ అవసరం కూడా! సమంత, ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా బడ్జెట్ పెరుగుతుంది.
►మొదట ‘యశోద’సినిమాని తక్కువ బడ్జెట్‌లో తీసేలా స్క్రిప్ట్ రాసుకున్నాం. కథని శివలెంక కృష్ణప్రసాద్ గారికి చెప్పినప్పుడు 'భారీ స్థాయిలో ఎందుకు చేయకూడదు?' అని అడిగారు. 'కంటెంట్ బాగుంది. గ్లోబల్ రీచ్ ఉంటుంది. ఐదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా చేద్దాం' అన్నారు. స్టార్ కాస్ట్ ఉన్నప్పుడు అలా చేయడం సాధ్యం అవుతుంది. సమంత గారిని కలిసిన తర్వాత భారీ స్కేల్‌లో చేయాలనుకున్నాం. మేం ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకుని కథ రాశాం. కంటెంట్ విషయానికి వస్తే ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్‌లో ప్రేక్షకులకు కూడా కొత్తగా ఉంటుంది. టెక్నికల్ పరంగా కమర్షియల్ సినిమాలా ఉంటుంది.
► ఈ సినిమాలో సరోగసీ మెయిన్ స్టోరీ కాదు. కథలో అదొక భాగమంతే! అందుకే, ఓపెన్‌గా చెప్పేశాం. సరోగసీ కంటే కథలో ఇంకా ఉంది. వార్తల్లో చూసిన, చదివిన విషయాల ఆధారంగా స్క్రిప్ట్ రాశాం. సినిమా చూసినప్పుడు మీరు షాక్ అవుతారు.
► సమంతతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. ఎంత పెద్ద ఎమోషనల్ సీన్ అయినా సరే రెండు నిమిషాల సమయం అడుగుతారు. సెట్ అంతా సైలెన్స్ అయ్యాక ఈజీగా చేసేస్తారు. గ్లిజరిన్ కూడా వాడరు. మేం ఏం కోరుకొన్నామో... అది ఈజీగా ఇచ్చేసేవారు. ప్రతి 20 నిమిషాలకు సినిమాలో ఒక మూవ్ ఉంటుంది. సినిమా నెక్స్ట్ లెవల్ కు వెళుతుంది. సర్‌ప్రైజ్‌లు షాక్ ఇస్తాయి. మేం చేసిన సినిమాల్లో ఎమోషనల్ సీన్ ఇది. మహిళలు, మాతృత్వం గురించి చెప్పాం. సినిమాలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ఆవిడ చాలా బాగా చేశారు. 'మీకు ఓకేనా? వన్ మోర్ కావాలా?' అని అడిగేవారు.
► సమంత హెల్త్ కండిషన్ గురించి షూటింగ్ సమయంలో మాకు తెలియదు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిగేటప్పుడు మాకు ఆ విషయం తెలిసింది. ఆవిడ వల్ల ఎప్పుడూ షూటింగ్ డిస్టర్బ్ కాలేదు. ఒక స్టంట్ సీన్ అద్భుతంగా చేశారు. ఆ రోజు సాయంత్రం ప్యాకప్ చెప్పేటప్పుడు ఆవిడకు జ్వరం ఉందని తెలిసింది. ఆవిడకు వర్క్ అంటే అంత డెడికేషన్. తన వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదని కోరుకుంటారు. యానిక్ బెన్ రెండు, వెంకట్ మాస్టర్ మూడు స్టంట్ సీన్స్ చేశారు.
► యశోద.. మెడికల్ మాఫియా తరహా సినిమా అనుకోవచ్చు. సరోగసీ మీద చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ టాపిక్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. మాకు అది సర్‌ప్రైజింగ్‌గా ఉంది. లాక్‌డౌన్‌లో చాలా మంది పేద మహిళలు డబ్బుల కోసం తమ గర్భాన్ని సరొగసీకి ఇచ్చారు. ట్విన్స్ పుడితే వాళ్ళకు ఎక్కువ డబ్బులు వస్తాయి. దానికి కూడా వాళ్ళు ఓకే అనేవారు.
► ఈ సినిమాలో సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్‌కు'ఈవా' అని పేరు పెట్టాం. ఆ పేరు ఎందుకు పెట్టామో సినిమా చూస్తే తెలుస్తుంది. ఆ సెంటర్ గ్రాండ్ గా ఉండాలని ఊహించుకున్నాం. దాని కోసం హైదరాబాద్ సిటీలో స్టార్ హోటల్స్ అన్నీ చూశాం. మాకు షూటింగ్ చేయడానికి కొంచెం ఫ్రీడమ్ కావాలి. స్టార్ హోటల్స్ అంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అప్పుడు నిర్మాతను అడిగితే సెట్ వేద్దామన్నారు. ఆర్ట్ డైరెక్టర్ అశోక్ గారితో 'జురాసిక్ పార్క్'లా ఉండాలని చెప్పాం. ఆయన అద్భుతమైన స్కెచ్ ఇచ్చారు. కృష్ణప్రసాద్ గారు ఖర్చు విషయంలో రాజీ పడలేదు. పాన్ ఇండియా కాబట్టి అన్ని రాష్ట్రాల ప్రజలు కనెక్ట్ అయ్యేలా ఉండాలనుకున్నాం. మెజారిటీ షూటింగ్ నానక్‌రామ్ గూడాలో వేసిన సెట్స్‌లోనే చేశాం. సినిమాలో మొత్తం 30, 40 సెట్స్ ఉంటాయి.
► నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. మణిశర్మ, మార్తాండ్ కె. వెంకటేష్, సుకుమార్... ప్రతి ఒక్కరూ వంద, రెండొందల సినిమాలు చేశారు. మణిశర్మ గారు మాకు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చారు. మార్తాండ్ కె వెంకటేష్ గారు క్రిస్పీగా ఎడిట్ చేశారు. క్రియేటివ్ డైరెక్టర్ హేమాంబర్ జాస్తి గారు (బుల్లి గారు) మాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఆయనకు చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. కాస్టింగ్ డైరెక్టర్ పుష్ప గారు కూడా మంచి నటీనటులను ఎంపిక చేశారు.
► ఈ సినిమాకు పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి గార్లు తెలుగులో మాటలు రాశారు. తెలుగులో మా ఫీలింగ్ బాగా కన్వే చేశారు. మేం బౌండ్ స్క్రిప్ట్‌తో వాళ్ళను కలిశాం. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన విషయాలు కొన్ని యాడ్ చేశాం. మా మధ్య పాజిటివ్ కన్వర్జేషన్స్ జరిగాయి. ఇద్దరూ జర్నలిస్ట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చారు. వాళ్ళకు చాలా కమాండ్ ఉంది. బాగా చేశారు. మాకు కొంచెం తెలుగు వచ్చు. భాగ్యలక్ష్మి గారికి తెలుగు, తమిళం వచ్చు. పులగం గారు రాసింది ఆవిడ మాకు తమిళంలో వివరించేవారు. మా వర్క్ ఈజీ అయ్యింది. మహిళల కోణంలో ఆవిడ కొన్ని విషయాలు చెప్పారు.
► ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. కథను ఆవిడకు జూమ్ కాల్‌లో నేరేట్ చేశాం. 20 మినిట్స్ చెప్పాం. ఆవిడ మౌనంగా ఉంటే మాకు ఏమీ అర్థం కాలేదు. కథ అంతా విన్నాక 'మీకు ఇటువంటి ఐడియాస్ ఎక్కడ నుంచి వస్తాయి?' అని అడిగారు. 'మీకు కథ ఓకేనా?' అని అడిగితే చెప్పిన కథ స్క్రీన్ మీదకు తీసుకురమ్మని అన్నారు. ఆవిడను కొత్తగా చూస్తారు.
► ఎమోషన్‌తో కూడిన థ్రిల్లర్ 'యశోద' అని చెప్పవచ్చు. సినిమా మొత్తం చూశాక మాకు అదే అనిపించింది. ఈ విషయంలో రాజమౌళి గారు మాకు ఇన్స్పిరేషన్. ఆయన ప్రతి సన్నివేశంలో ఎమోషన్ ఉండాలని చెబుతారు.
Comments
Please login to add a commentAdd a comment