‘‘నిర్మాతను, థియేటర్ వ్యవస్థను కాపాడుకోకపోతే చాలా ప్రమాదం. ప్రస్తుతం డైరెక్టర్ ఎంత బాధ్యతగా ఉన్నాడంటే నిర్మాతను ఒప్పించాలి, థియేటర్‌ను కాపాడుకోవాలి, ఆడియన్స్‌ను సినిమాకు రప్పించాలి. ఒకవేళ ఓటీటీలో రిలీజ్ అయితే అక్కడి ఆడియన్స్ కూడా కళ్లను పక్కకు తిప్పుకోకుండా చూపించగలగాలి.. అప్పుడే ఒక డైరెక్టర్ సక్సెస్ అయినట్టు’’ అన్నారు డైరెక్టర్ మారుతి. గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్– యూవీ క్రియేషన్స్‌పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా జూలై 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు మారుతి చెప్పిన విశేషాలు.
► ప్రతి ఒక్కరూ స్క్రిప్ట్ బాగా రాసుకోవాలి. అవసరమైతే రెండు నెలలు ఎక్కువ కష్టపడి అయినా స్క్రిప్ట్‌ను మన టేబుల్ మీదే ఎడిట్ చేసు కుంటే వృథా తగ్గిపోయి నిర్మాతకు చాలా డబ్బులు మిగులుతాయి. దీనికి తోడు మంచి మంచి సబ్జెక్టులు వస్తాయి. ఇండస్ట్రీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బడ్జెట్‌తో పాటు షూటింగ్ రోజులు తగ్గించాలి.. మంచి కథలను సెలెక్ట్ చేసుకుని ఆడియన్స్‌కు నచ్చేలా తీయాలి. మనకు ఇష్టమొచ్చినట్లుగా తీస్తే చూడరు.
► ఒక వ్యక్తి డైరెక్టర్ కావాలంటే ప్రతిభ కంటే ముందు తను ఒక ప్రేక్షకుడు అయ్యుంటే బెస్ట్ సినిమా తీస్తాడు. నాకు సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన అనుభవం ఉండటం వల్ల కమర్షియల్ యాంగిల్‌లో సినిమాలు చేస్తున్నాను. ఆడియన్స్‌కు ఏం కావాలో ఇచ్చి, వారి దగ్గర డబ్బులు తీసుకొని నిర్మాతలకు ఇవ్వా ల్సిన మీడియేషన్ బాధ్యత డైరెక్టర్‌దే.. ఈ మీడియేషన్ కరెక్ట్‌గా చేయకపోతే ఇటు నిర్మాతలు, అటు ప్రేక్షకులు నష్టపోతారు.
► ‘పక్కా కమర్షియల్’ మంచి కథతో అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకులు సంతోషంగా కాలర్ ఎగరేసుకుని చూసే సినిమా ఇది. దివంగత రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు రాసిన ఈ సినిమా టైటిల్ పాటకు మంచి స్పందన వచ్చింది.
► జీఏ2 పిక్చర్స్– యూవీ క్రియేషన్స్‌పై నా దర్శకత్వంలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్, ప్రతిరోజూ పండగే’ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. దానికి కారణం మంచి కథ, నటీనటులు, సాంకేతిక నిపుణులు సెట్ అవ్వడం. మనకు చాలామంది మంచి ఆర్టిస్టులు ఉన్నా రు. వాళ్లకు తగిన క్యారెక్టర్స్ రాస్తే మిగతా భాషల నటీనటులను తెచ్చుకోవాల్సిన పని ఉండదు.
► సినిమా టికెట్ ధరలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రేక్షకులు పెద్ద సినిమాలకు ఎక్కువగా థియేటర్స్‌కు రావడం లేదు.. అందుకే మేము తక్కువ రేట్‌కే మా ‘పక్కా కమర్షియల్’ని చూపించనున్నాం. ఓటీటీలో చూసేయొచ్చు అనుకుంటారేమో.. ఇప్పుడప్పుడే ఓటీటీకి రాదు (నవ్వుతూ).
Comments
Please login to add a commentAdd a comment