ప్రతి హీరో దగ్గర తమ కెరీర్‌లో తిరస్కరించిన ప్రాజెక్ట్‌ల జాబితా ఉంటుంది. అదే క్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లిస్ట్‌లో కూడా కొన్ని రిజక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 'చిరంజీవి కుమారుడి'గా అరంగేట్రం చేయడం నుంచి మెగా పవర్‌స్టార్‌గా భారీ అభిమానులను సంపాదించుకోవడం.. ఆపై ఇప్పుడు RRR తో గ్లోబల్ స్టార్‌గా తనను తాను స్థాపించుకోవడం వరకు, రామ్ చరణ్ నిజంగా తన సినిమా ప్రయాణంలో చాలా దూరం చేరుకున్నారు. అయితే రామ్ చరణ్ తన సినీ కెరీర్‌లో తిరస్కరించిన ఐదు సినిమాల గురించి తెలుసుకుందాం.
గౌతమ్ తిన్ననూరి సినిమాను రిజక్ట్ చేసిన చరణ్
RRR సినిమాతో భారీ విజయం అందుకున్న రామ్ చరణ్ తదుపరి ప్రాజెక్ట్ జెర్సీ ఫేమ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చేయవలసి ఉంది. ఆర్‌ఆర్‌ఆర్ వంటి విజయం తర్వాత మాస్ అప్పీల్ ఉన్న కథ కోసం చరణ్ కోరుకున్నారట. దీంతో గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్‌కు ఓకే చేయలేదని వార్తలు వచ్చాయి. తరువాత అదే కథను విజయ్ దేవరకొండకు ఆయన వివరించాడట. అది ఇప్పుడు VD12గా రూపొందనుందని నివేదికలు చెబుతున్నాయి. రామ్ చరణ్‌కి వివరించిన స్క్రిప్ట్ స్పోర్ట్స్ డ్రామా అని సమాచారం.
సూర్య సన్ ఆఫ్ క్రిష్ణన్
కోలీవుడ్‌లో 'వారణం ఆయిరం' చిత్రంలో సూర్య నటించారు. తెలుగులో 'సూర్య సన్ ఆఫ్ క్రిష్ణన్' పేరుతో 2008లో విడుదలైంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. తమిళ్ వర్షన్ కంటే టాలీవుడ్‌లోనే ఈ సినిమాకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా విడుదలై దాదాపు 16 సంవత్సరాలు అయింది. రీసెంట్‌గా తెలుగులో రీ-రిలీజ్ చేసినా థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యాయి. ఈ సినిమాను చూస్తున్నంత సేపు సూర్య తప్ప మరే ఇతర నటుడు గుర్తుకు రారని చెప్పవచ్చు. ఈ సినిమా ఆఫర్ మొదట చరణ్‌కు వచ్చింది. ఆ సమయంలో SS రాజమౌళితో మగధీర షూటింగ్ షెడ్యూల్ బిజీలో చరణ్ ఉన్నారు. అప్పటికే ఎక్కువ డేట్లు మగధీరకు కేటాయించడంతో 'సూర్య సన్ ఆఫ్ క్రిష్ణన్' సినిమాకు చరణ్ నో చెప్పారట.
ఓకే బంగారం
మలయాళం సినిమా ఓకే కన్మణి గుర్తుందా..? 2014లో విడుదలైన ఈ సినిమా భారీ హిట్ కొట్టింది. హిందీలో 'ఓకే జాను'గా రీమేక్ అయింది. టాలీవుడ్‌లో 'ఓకే బంగారం' పేరుతో విడుదలైంది. ఈ కథలో హీరో పాత్రకు రామ్ చరణ్ కరెక్ట్‌గా సెట్ అవుతాడని దర్శకుడు మణిరత్నం భావించారట. మొదట ఈ కథను చరణ్‌కే ఆయన చెప్పారట. ఆ సమయంలో తన బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన నో చెప్పడంతో అది కాస్త దుల్కర్ సల్మాన్ బోర్డులోకి వచ్చి చేరిందట. ఇందులో నిత్యా మీనన్‌తో ఆయన జతకట్టిన విషయం తెలిసిందే.
అఖిల్ 'ఏజెంట్'
రామ్ చరణ్ ఇటీవల తిరస్కరించిన చిత్రాలలో ఒకటి ఏజెంట్. అఖిల్‌కు ఈ సినిమా భారీ డిజాస్టర్‌ను మిగిల్చింది. ఈ చిత్రం మొదట రామ్ చరణ్ వద్దకు చేరిందట. ఏజెంట్ సినిమా డైరెక్టర్ సురేందర్ రెడ్డి అప్పటికే చరణ్‌తో ధృవ సినిమా తీసి ఉన్నాడు. దీంతో రెండో సినిమా ప్లాన్ చేయాలని ఈ కథతో చరణ్‌ను సురేందర్ రెడ్డి కలిశారట. కానీ పలు కారణాల వల్ల చరణ్ నో చెప్పారట. దీంతో ఫైనల్‌గా అఖిల్ వద్దకు ఆ ప్రాజెక్ట్ వెళ్లడం.. భారీ అంచనాలతో తెరకెక్కిన ఏజెంట్ సినిమా ఇండస్ట్రీలోనే భారీ డిజాస్టర్‌గా మిగిలిన విషయం తెలిసిందే.
ఎటో వెళ్లిపోయింది మనసు
2008లో 'సూర్య సన్ ఆఫ్ క్రిష్ణన్' తిరష్కరించిన చరణ్‌తో ఎలాగైన ఒక సినిమా తీయాలని డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ అనుకున్నారట. సుమారు నాలుగేళ్లు నిరీక్షించి 2012లో చరణ్‌ను ఆయన కలిశారట. ఆ సమయంలో 'ఏటో వెళ్లిపోయింది మనసు' కథను వినిపించారట.. రొమాంటిక్ కామెడీగా ఉన్న కథ కావడంతో చరణ్ నో చెప్పారట. అప్పటికే ఇలాంటి కాన్సెప్ట్‌తో 'ఆరెంజ్'ను తీసిన చరణ్ ఈ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట.. ఆ తర్వాత అది కాస్త నాని వద్దకు ఆ ప్రాజెక్ట్ చేరిపోయింది. ఇందులో సమంత హీరోయిన్‌గా కనిపించింది. ఈ చిత్రం విమర్శకుల చేత ప్రశంసలు అందుకున్నప్పటికీ, అది వాణిజ్య పరంగా రాణించలేదు.
Comments
Please login to add a commentAdd a comment