
Download The Kashmir Files: For Free Police Warn Against Free Links: ది కశ్మీర్ ఫైల్స్ సినిమా ఉచితంగా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ లింక్ క్లిక్ చేయండి అంటూ మీకు వాట్సాప్‌లో మెసేజ్‌లు వస్తున్నాయా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఫ్రీగా సినిమా చూడొచ్చని కక్కుర్తి పడి లింక్ క్లిక్ చేశారో.. మీ బ్యాంకు ఖాతాలోని డబ్బులన్నీ ఖాళీ అయినట్లే. ఎందుకంటే సైబర్ నేరగాళ్ల దృష్టి ఇప్పుడు ది కశ్మీర్ ఫైల్స్ సినిమాపై పడింది.
ఈ సినిమాను ఉచితంగా చూడొచ్చంటూ లింకులు పంపి స్మార్ట్‌ఫోన్‌ను హ్యాక్ చేసి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కొల్లగొడుతున్నారు. ఇలాంటి ఫ్రీలింకులపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఢిల్లీ, నోయిడాల్లో హ్యాకర్లు ఇదే పనిగా సైబర్ క్రైమ్‌కు పాల్పుడుతున్నారని పోలీసులు తెలిపారు. ది కశ్మీర్ ఫైల్స్‌ను ఉచితంగా చూడొచ్చంటూ లింకులు పంపి స్మార్ట్‌ఫోన్లను హ్యాక్ చేసి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసినట్లు చెప్పారు.
ఒకవేళ మీకు ఇలాంటి లింకులు వస్తే 1920 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని రాచకొండ పోలీసులు సూచించారు. కాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ది కశ్మీర్ ఫైల్స్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. వారం రోజుల్లోనే వంద కోట్లు సాధించి సత్తా చాటుతోంది. ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.