
‘‘బాలకృష్ణగారి సినిమాలు చూస్తూ పెరిగాను.. అలాంటిది ఆయనతో కలసి నటించడం మాటల్లో చెప్పలేని అనుభూతి. తొలిసారి ఆయన్ని సెట్‌లో చూసినప్పుడు నన్ను నేను నమ్మలేకపోయాను.. ఆయనది గొప్ప వ్యక్తిత్వం’’ అని నటుడు దునియా విజయ్ అన్నారు. బాలకృష్ణ, శ్రుతీహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ చిత్రంలో మెయిన్ విలన్ పాత్ర పోషించిన కన్నడ నటుడు దునియా విజయ్ మాట్లాడుతూ– ‘‘గోపీచంద్‌గారు బ్రిలియంట్ డైరెక్టర్. ‘వీరసింహారెడ్డి’ లో నా పాత్ర (ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి) గురించి చెప్పినప్పుడే చాలా థ్రిల్ అనిపించింది. చాలా మొరటుగా ఉండే నా పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది.
ఇంత మంచి పాత్రలో బాలకృష్ణగారి సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన ఎనర్జీ సూపర్.. పనిపట్ల అంకితభావం గొప్పగా ఉంటుంది. ‘వీరసింహారెడ్డి’ ఆయన అభిమానులకు, ప్రేక్షకులకు గ్రేట్ ఎమోషనల్ జర్నీ. ఒక నటుడిగా అన్ని పాత్రలూ చేయాలని ఉంటుంది. ఈ సినిమా తర్వాత కూడా మంచి పాత్రలు వస్తే విలన్‌గా చేయడానికి సిద్ధమే. నటన, దర్శకత్వం వేర్వేరు. నటుడిగా చేస్తున్నప్పుడు నా దృష్టి కేవలం నటనపైనే ఉంటుంది. దర్శకునిగా చేస్తున్నప్పుడు నా నుండి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో దానిపైనే ఫోకస్ ఉంటుంది. ప్రస్తుతం కన్నడలో ‘భీమ’ అనే చిత్రంలో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నాను. తెలుగులోనూ కొన్ని చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment