బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ మధ్యే లుట్ గయ్ అనే లవ్‌సాంగ్‌లో ఆడిపాడాడు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు పూర్తైన అతడు బాలీవుడ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ రంగుల ప్రపంచం అంతా ఫేక్ అని, అందుకే తన పని పూర్తయ్యాక ఈ ఫీల్డ్‌తో సంబంధం లేనట్లు దూరంగా ఉంటానని పేర్కొన్నాడు. తాజాగా ఇమ్రాన్.. సిద్ధార్థ్ ఖన్నా వ్యాఖ్యాతగా వ్యవహరించిన రేడియో ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా బీటౌన్‌లో అసలు ఏం జరుగుతుందనే విషయాన్ని బయటపెట్టాడు.
"అందరి ముందు మనల్ని పొగుడుతున్నట్లే కనిపిస్తారు, కానీ వెనకాల మాత్రం గోతులు తీస్తూ కిందకు లాగుతుంటారు. ఇదే పచ్చి నిజం. బాలీవుడ్‌లో జరిగేదిదే. అయినా వృత్తి కన్నా వ్యక్తిగత జీవితం ముఖ్యమని నేను నమ్ముతాను. అందుకే నా పర్సనల్ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాను. నా పేరు ఇంకా బాలీవుడ్‌లో వినిపిస్తోందంటే దానికి కారణం నా స్నేహితులు, తల్లిదండ్రులే. వారు వాస్తవిక దృక్పథం అలవర్చుకోవడం నేర్పించారు. దానివల్లే నేనింకా ఇక్కడ నిలదొక్కుకునే ఉన్నాను. నా పనేదో నేను చేసుకున్న తర్వాత చిత్రపరిశ్రమకు దూరంగా ఉండటం వల్లే ఇప్పుడు మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను" అని చెప్పుకొచ్చాడు.
ఇదిలా వుంటే ఇమ్రాన్ తాజాగా నటించిన 'ముంబై సాగా' మార్చి 19న రిలీజవుతోంది. జాన్ అబ్రహం, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, మహేశ్ మంజ్రేకర్ కీలక పాత్రలు పోషించారు. దీనితో పాటు అమితాబ్ బచ్చన్ 'చెహెరే' సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషించాడు. క్రిస్టల్ డిసౌజ, అను కపూర్, దృతీమాన్ చటర్జీ, రఘుబీర్ యాదవ్ సహా తదితరులు నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment